అమ్మ చేయూత, రక్షణ అనేవి అనవరతం అజ్ఞాతంగా ఉంటాయి. రక్షణ అన్నది అర్థం కాదు. ‘రక్షణ అంటే ఏమిటమ్మా?’ అని అడిగితే ‘కంటిలో దిగాల్సిన ముల్లు కాలిలో గుచ్చుకోవటం. నేను ఇక్కడ మంచం మీద కూర్చున్నాను. కాలు నేల మోపి దిగే చోట గాజు పెంకులున్నాయి. కానీ నేను లేవబోతూండగా ప్రక్కకి ఒరిగిపడ్డాను. కాలు బెణికింది. గాజు పెంకు కాలిలో దిగబడితే ఎంత ప్రమాదం? దానికంటే ఇది నయం. అలా ఉంటుంది రక్షణ అంటే’ అని సోదాహరణంగా వివరించింది అమ్మ.
మన చేతలు అమ్మ చేతుల్లో ఉన్నాయి. వాటిని పొందికగా తీర్చిదిద్దుతుంది. వాస్తవానికి అమ్మ అర్థం కాదు, అమ్మ మనకి చేసే సేవా అర్థం కాదు. అలసిసొలసి ఉన్న ఎందరినో ఆదుకున్నది, ఆదరించింది. ఎందరికో ప్రాణదానం చేసింది. మరెందరికో జీవితకాలాన్ని పొడిగించింది. ‘Nanna garu, the adorable and the unforgettable’ అనే వ్యాసంలో శ్రీ దినకర్ అన్నయ్య అమ్మ తనని మృత్యు ముఖంలోంచి ఎలా కాపాడిందో కళ్ళకి కట్టినట్లు వివరించారు. సామాన్యము, అసామాన్యము, లౌకికము పారమార్థికము అనే భేదం లేకుండా మనల్ని తన కంటి పాపలా సంరక్షిస్తోంది. మాతృధర్మ పరిరక్షణే అమ్మ ధ్యేయం.
ఈ నేపథ్యంలో శ్రీ అన్నమాచార్యులవారు రచించిన కీర్తన ‘ఆదిమూలమే మాకు నంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష… సర్వరక్ష అనేది నిత్య సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ వాస్తవాన్ని శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్య వంటి వారు చక్కగా సూటిగా నిజజీవితంలో చూస్తున్నారు. ‘అమ్మా! నన్ను ఆస్పత్రికి వెళ్ళమంటావా? సరే. ఆపరేషన్ చేయించుకోమంటావా? చేయించు. వద్దంటావా? మా నెయ్యి. ఇష్టం. నాకు నా గురించి చీకూ, చింతా లేదు. భారమో, బాధ్యతో అంతా నీదే” – అని అంటుంది.
‘ఆది మూలము’, ‘అంగరక్ష’ అనే పదాల్ని విశ్లేషిస్తాను. ఆదిమూలము అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుని సముచితమైన సమాధానాన్ని అందించారు పోతనగారు. ఎవ్వనిచే జనించు జగము?…. లీనమై ఎవ్వని యందుడిందు? అంటే – ఆ శక్తి, ఆ పరమేశ్వరుడు, మూలకారణం, అనాది మధ్యలయుడు, సర్వము తానయైనవాడు, ఆత్మభవుడు, ఈశ్వరుడు – అని.
ఆ శక్తి, ఈశ్వరుడు అమ్మే. తల్లిలేని తల్లి, తొలి.
– ‘అంగరక్ష’ అంటే శరీరంలోని సర్వ అవయవాల్ని రక్షించేవాడు. ఏ అవయవం ముఖ్యమైనది? ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, సర్వస్యగాత్రస్య శిరః ప్రధానం’ – అంటుంది ఆర్యోక్తి. కానీ అన్నీ ముఖ్యమైనవే. ఏదైనా ఒక అవయవం పని చేయనపుడు దాని విలువ అక్షరాలా అర్థమౌతుంది.
– పూజా సమయంలో :
శ్రీ సుకుమార పావన పదాబ్జాయైనమః – పాదౌ పూజయామి,
శ్రీ బ్రహ్మండోదరాయైనమః – ఉదరం పూజయామి,
శ్రీ కరుణాకటాక్ష వీక్షణాయైనమః – నేత్రే పూజయామి,
శ్రీమాత్రే నమః శిరః పూజయామి,
శ్రీ అనసూయా మహాదేవ్యైనమః – సర్వాణ్యంగాని పూజయామి. అని స్మరిస్తాం. అసలు అమ్మ విరాట్స్వరూపం ఎలా ఉంటుంది? ఒక ఉదాహరణ:
– భూః పాదౌయస్యనాభి ర్వియదసురనిలశ్చంద్రసూర్యౌచ నేత్రే కర్ణా వాకాశిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయ మబ్ధిః | అంతస్థ్సం యస్య విశ్వం సురనరఖగగో భోగిగంధర్వ దైత్యైః చిత్రం రంరమ్యతే తం త్రిభువన వపుషం విష్ణు మీశం నమామి।।
ఆ స్వరూపానికి పాదములు – భూమి; నాభి – ఆకాశం; శ్వాస – వాయువు, నేత్రములు – సూర్యచంద్రులు; చెవులు-బ్రహ్మాండము, శిరస్సు – స్వర్గము, ముఖము – అగ్ని: కుక్షి – సాగరం: దేవతలు, నరులు, గోవులు, సర్పములు, గంధర్వులు, రాక్షసులు ఇత్యాది సమస్త సమూహములతో విశ్వం లోపల ఉంటుంది. మూడు భువనాలూ తన శరీరంగా ప్రకాశిస్తాడు.
అవతారమూర్తి అమ్మ అంటుంది ‘పాదాలు వాయుతత్వం, నేత్రాలు – జలతత్వం, తల- పృధ్వీతత్వం, శరీరమంతా – ఆకాశతత్వం’ – అని. అంటే అమ్మ స్వరూపం పంచభూతాత్మకంగా, గాయత్రీ మాతగా అర్థమౌతోంది.
రుద్రాభిషేక సమయంలో.
‘పాదయోః విష్ణుః తిష్ఠతు,
హస్తయోః హరః తిష్ఠతు,
బాహె్వూః ఇంద్రః తిష్ఠతు,
లలాటే రుద్రాః తిష్ఠంతు,
శిరసి మహాదేవః తిష్ఠతు,
సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యధాస్థానం తిష్ఠంతు’ అని ఆవాహన చేస్తాం; ఆర్థిస్తాం. దేవతాగణం వచ్చి ఆయా అవయవాల్లో కొలువై ఉండి సదా వాటిని రక్షించాలి అని పరితపిస్తాం.
శ్రీలలితా ఖడ్గమాలాస్తవం, శ్రీ అంబికా (అమ్మ) ఖడ్గమాలా స్తవంలో జగజ్జనని,
నయన రక్షిణి,
వదన రక్షిణి,
బాహు రక్షిణి,
హృదయ రక్షిణి,
చరణ రక్షిణి,
సర్వాంగ రక్షిణి – అని స్తుతిస్తాం.
వీటన్నిటి సారాంశాన్ని సూటిగా ఒక్క సన్నివేశం ద్వారా వివరిస్తా. ఒకనాడు ‘మంచం మీద దిండు ఏవైపు (దిక్కుగ) పెట్టమంటావు? అని అడిగితే అమ్మ. “ఏ దిక్కు అయినా ఒకటే అన్నిటికీ వాడే దిక్కు” అన్నది.
నేను అనుదినం శ్రీ అంబికా సహస్రనామ పారాయణ చేస్తా. శ్రీ అనసూయా వ్రతం, శ్రీహైమవతీ వ్రతాన్ని ఆచరిస్తా. అమ్మాలయంలో పూజలూ, హైమాలయంలో ప్రదక్షిణలు చేస్తా. నా జీవితంలో ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహము, నూతన గృహప్రాప్తి ఇంకా ఎన్నో శుభాల్ని, లాభాల్ని అమ్మ అనుగ్రహించింది. ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి; అమ్మ దయతో అవి అదృశ్యమైనాయి. నాకు ఆదిమూలము అమ్మ.
అమ్మే నాకు అంగరక్ష, జీవరక్ష, సర్వరక్ష.