“ఆగాడు వరుణుండు – ఆగడా అరుణుండు, అంబరమ్మున వెలిగె మేలుకో” అని మనం అమ్మ సుప్రభాతాన్ని చదువుకుంటున్నాం. అరుణ భగవానుడు అమ్మ నిర్దేశించిన మార్గంలో దివారాత్రాలను సృష్టిస్తూ, మానవాళికి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఆ సూర్యభగవానుడి సౌరశక్తి జిల్లెళ్ళమూడిలో కొత్తరకంగా వినియోగింప బడుతుంది.
ఈ సంవత్సరం ఏప్రిల్ 13నాడు అమ్మ పుట్టినరోజుకు ఒకరోజు ముందు ఒక సోలార్ స్ట్రీట్ లైట్ అమర్చడం జరిగింది. ఈ లైట్ సౌరశక్తితో పనిచేస్తుంది. చీకటి పడేసరికి దానంతట అది వెలుగుతుంది. మళ్లీ ఉదయభానుడి కిరణాలు ప్రసారం మొదలుకాగానే దానంతట అది ఆగిపోతుంది. మనం లైటిని ఆన్, ఆఫ్ చేయనక్కరలేదు.
మనం వాడే విద్యుద్దీపాలు, వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్నాయి. భూగోళాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్న సంస్థలు ఒక గంట విద్యుత్ వినియోగాన్ని ఆపమని బ్రతిమలాడుతున్నాయి. తద్వారా గ్లోబల్ వార్మింగ్ని ఆపవచ్చని, జిల్లెళ్ళమూడిలో మనం దాదాపు 15 స్ట్రీట్ లైట్స్ మన ఆవరణలో వాడుతున్నాం. ఈ స్ట్రీట్ లైట్స్ అన్నీ కరెంటు మీద నడుస్తున్నవే. మనం నెమ్మదిగా ఒక్కొక్క స్ట్రీట్ లైట్ స్థానంలో ఒక్కొక్క సోలార్ స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఖర్చు తగ్గుతుంది. వాతావరణ కాలుష్యమూ తగ్గుతుంది.
1979లో జిల్లెళ్ళమూడిలో కోటినామార్చన జరిగిన తరువాత ప్రపంచవ్యాప్తంగా లలిత పారాయణ విరివిగా జరగటం మొదలయ్యింది. మనం జిల్లెళ్ళమూడిలో వాతావరణ కాలుష్యాన్ని అరికడితే, మన భావితరాల వారు భూమిపై మంచి వాతావరణాన్ని అనుభవిస్తారని మన ఆశ.
డెన్మార్క్, చైనా, అమెరికా దేశాలు సౌరశక్తిని వాడటానికి తీవ్రంగా కృషిచేస్తున్నాయని 9.05.2011 టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్రాసారు. యావద్భారతదేశం సౌరశక్తిని ఉపయోగిస్తే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అవసరం లేదు. సౌరహోమాలు విరివిగా జరిగే జిల్లెళ్ళమూడి మహాక్షేత్రం సౌరశక్తిని చక్కగా వినియోగించుకుని, ప్రపంచానికి మార్గదర్శకమౌతుందని ఆశిద్దాం.
మే నెలాఖరులోగా రెండవ సౌరదీపం ఏర్పాటుకు కృషి జరుగుతోంది. ఒక్కొక్క సౌరదీపం ఖరీదు దాదాపు 20,000 రూపాయలు.
మనం ప్రస్తుతం అన్నపూర్ణాలయంలో ఎల్.పి.జి. గ్యాస్ వాడి నీటిని వేడిచేసి, తద్వారా ఉత్పన్నమయ్యే ఆవిరి మీద వంట చేస్తున్నాం. ఎల్.పి.జి. వాడకం ఖర్చేకాకుండా, వాతావరణాన్ని పాడుచేస్తుంది. అన్నపూర్ణాలయ భవనంపై ఒక సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోంది. నిజానికి మనకి రెండు సోలార్ వాటర్ హీటర్స్ అవసరం. ఒక్కొక్క హీటర్ ఖరీదు దాదాపు ఒక లక్ష దాని మీద 25,000 రూపాయిల వరకూ గవర్నమెంట్ సబ్సిడీ లభిస్తుంది. సౌరశక్తితో పనిచేసే పరికరాలు తిరుపతిలోనూ, మౌంట్అబూలోనూ, షిర్డీలోనూ ఉన్నాయి. మనం ప్రస్తుతం వంటకి 16 గ్యాస్ సిలిండర్లు వాడుతున్నాం. సౌరశక్తిని వినియోగిస్తే ఈ వాడకం 5 సిలిండర్లకు తగ్గవచ్చు. ఖర్చే కాకుండా వాతావరణం కాలుష్యాన్ని అరికట్టడంలో మనపాత్ర మనం పోషించిన వాళ్ళమవుతాము.
దయచేసి మీ ఆలోచనలూ, సలహాలూ పరిషత్తుకి తెలియజేయండి. ఆ మహాక్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో మనమూ ఒక సమిధని సమర్పిద్దాం.