1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆపద్బాంధవి అమ్మ

ఆపద్బాంధవి అమ్మ

Pamidipati Giridhar Kumar
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : June
Issue Number : 11
Year : 2022

అమ్మ చరణారవిందాలకు శత సహస్రకోటి వందనాలతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. 

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి జిల్లెళ్ళమూడి వస్తున్నాను. అమ్మతో నా 20వ సంవత్సరము వరకు ప్రత్యక్ష సాంగత్య సౌభాగ్యం అమ్మవారు నాకు కలిగించినందుకు ఆమెకు మరోసారి ప్రణామం చేస్తున్నాను.

నా చిన్న సాంగత్య ప్రయాణంలో నాకు కలిగిన, నేను పొందిన అనుభవాలు కొన్ని మీతో పంచు కోవల్సిందిగా అనుకుని ఈ రోజు మీ ముందుకు వచ్చాను.

నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు గుర్తున్న ఏకైక సన్నివేశం 1973 లో జరిగిన స్వర్ణోత్సవాలు. అప్పుడు నాకు సుమారుగా ఆరేళ్ళు. అప్పుడు మా అమ్మతో పాటు, అమ్మ చేయిపట్టుకుని వచ్చాను. ఆ రోజు ఎటు చూసినా జనం. నదీరా గారు వ్రాసినట్లు ‘ఇటు జనములు, అటు జనములు, ఎటు చూసిన అన్నారు. యోజనములు’ అని, నాకు బాగా గుర్తుండిపోయిన సన్నివేశము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతోమందిని చూస్తూ వస్తున్నాను జిల్లెళ్ళమూడిలో.

ఆ తరువాత నేను, మా అమ్మగారు, మా అన్నయ్య, మా సోదరి వచ్చేవాళ్ళము. మా చెల్లికి అమ్మే నామకరణం చేశారు. మా ఇద్దరికి… నాకు, మా అన్నయ్యకి అమ్మే 1980లో ఒడుగు నిర్వహించారు. మా నాన్నగారు మాత్రం 1979 వరకు ఉద్యోగ రీత్యా హైదరాబాదులో వుంటూ, పెద్దగా వచ్చేవారు కాదు.

ఒక రోజు రాత్రి 1980 మార్చి మాసంలో హైదరాబాదులో వుండగా, ఆయన పడక కుర్చీలో పడుకుని వున్నారు వాకిట్లో. మా అమ్మగారు భోజనానికి రండీ! అని పిలిచారు. మా నాన్నగారు కుర్చీలో నుంచి లేద్దామని ఉపక్రమించి, కుర్చీలో కుప్పకూలిపోయారు. ఆయనకి ఎడమ పక్కన పక్షవాతం వచ్చింది. ఆయనకి చాలా బి.పి. రుగ్మత వుంది. అందుచేత ఆయనకు పక్షవాతం వచ్చింది. అప్పటికప్పుడు ఆయన్ను తీసుకుని, హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు, ఆయన మన స్పృహలో లేరు అప్పటి నుంచి. కానీ మర్నాడు పొద్దున ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆయనకు మెలకువ వచ్చింది. ఆయనకు మెలకువ రాగానే, (first) మొదట మా అమ్మతో అన్నమాట ఏమిటంటే, “జిల్లెళ్ళమూడి అమ్మ రాత్రంతా నా మంచం చుట్టూ తిరుగుతూనే వుంది. నాకు కనిపిస్తూనే వుంది. ఆవిడ వల్లే ఇవాళ నేను కళ్ళు తెరిచాను. మీరు ముందు అర్జెంటుగా నన్ను జిల్లెళ్ళమూడి తీసుకువెళ్ళండి” అన్నారు.

కొంచెం తగ్గనివ్వండి నాన్నగారు! వెళ్లాము అంటే, కాదూ! మీరు తీసుకువెళ్ళాల్సిందే! అన్నారు. ఆయన చాలా మొండివారు. అందుకని ఒక రెండు రోజులు ట్రీట్మెంట్ చేయించి, ఆయన్ని వీల్ ఛైర్ లో పెట్టుకుని, అప్పట్లో ఇన్ని వసతులు లేవు కదా! ఎట్లాగొట్లా జిల్లెళ్ళమూడి తీసుకుని వచ్చి, జిల్లెళ్ళమూడిలో అమ్మ దర్శనం చేయించాము.

అమ్మ అప్పుడు చీరాల డాక్టర్ గారు శ్రీ పొట్లూరి సుబ్బారావుగారిని పిలిచి, “నాన్నా వీడికి నువ్వే వైద్యం చేయాలి” అని చెబితే, ఆయన హెూమియో మందులు, తైలాలు ఇస్తే, ఆ తైలాలతో మర్దన చేయడం జరిగితే, అప్పుడు మా నాన్నగారికి మరలా నెల నెలా పదిహేను -రోజుల తర్వాత కాళ్ళు, చేతులు స్వాధీనంలోకి వచ్చాయి. అలా కొద్ది రోజులు గడిచింది. ఒక మూడు నాలుగు నెలలు, ఐదు నెలలు అయిన తర్వాత పూర్తిగా శక్తి శరీరంలోకి రాగానే, మా నాన్నగారికి మళ్ళీ హైదరాబాదుకి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చింది. అప్పుడ అమ్మ అంది “వద్దు నాన్నా! ఇక్కడే వుండు. నువ్వు ఏదన్నా చేయగలిగింది చేద్దూ గానీ, ఇక్కడే వుండు” అంది. కానీ, ఆయనకి కొన్ని దురలవాట్లు వుండేవి. దానితోటి కాదు వెళ్ళాల్సిందే అని చెప్పేసి, అమ్మకి చెప్పకుండా టికెట్ కొనుకొచ్చుకున్నారు, మాకూ చెప్పలేదు. మళ్ళీ ఒక రోజు పక్షవాతం ఆయనకి మళ్ళీ ఎటాక్ వచ్చింది, ఏమిటా మళ్ళీ ఎటాక్ వచ్చిందని చూస్తే, మాకప్పుడు తెలిసింది ఆయన దగ్గర దిండు క్రింద టికెట్ వుంది. ఆ టికెట్ ప్రయాణం రేపు అయితే, ఆయనకు ఇవాళ మళ్ళీ పక్షవాతం వచ్చింది. అప్పుడు అమ్మ మళ్ళీ చెప్పింది “వద్దు నాన్నా! ఇక్కడే వుండు” అని. అట్లా రెండు మూడు సార్లు ప్రయత్నించారు. రెండు మూడు సార్లూ అలాగే అయిన తర్వాత, అప్పుడు ఆయనకి “ఇహ ఇక్కడే నేను వుండాలి” అని విషయం తట్టి, ఆ విషయానికి రీకనైల్ అయి, అప్పుడు అమ్మ పాదాల దగ్గర చేరిపోయారు.

అమ్మ అంది, “నువ్వు హైమాలయంలో అర్చకత్వం చేయి నాన్నా! హాయిగా అభిషేకం చేసుకో!” అన్నది. ఆ విషయం ఎందుకు చెప్పిందంటే, మా నాన్నగారు శివప్రియులు. అభిషేకం చాలా ఇష్టం. అట్లా ఆయన 1981 నుంచి 1992 వరకు 11 సంవత్సరాలు ఏకాదశ రుద్రాభిషేకంలో 11 రుద్రాలు, ఆయన 11 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో, చక్కగా అభిషేకం చేశారు. ఆయనతో పాటు మా అమ్మగారు ఆయనకు సహాయ సహకారాలు అందిస్తూ వుండేవారు. వీళ్ళిద్దరూ చేసిన పూజలు, వీళ్ళిద్దరూ అకుంఠిత దీక్షతో అమ్మకు చేసిన సేవ వల్ల, మేమందరం ఇప్పుడు, మా జీవితాలు చాలా హాయి అయిన పరిస్థితుల్లో వున్నాయి.

అలా మా నాన్నగారు ఇక్కడికి రావడం, పర్మినెంట్గా ఆయనతోపాటు మేమూ రావడం జరిగింది. అట్లా జిల్లెళ్ళమూడిలో స్థిర నివాసం 1981లో మొట్టమొదటిసారిగా అయిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇహ మా జీవితాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకొక సంఘటన ఏం చెప్పాలంటే, 1982 లో నాది ఇంటర్మీడియెట్ అయిపోయిన తర్వాత ఇంజినీరింగ్ చేయాలనేది ఆ రోజుల్లో నాకున్న ఉత్సాహం. అందుకని అమ్మ దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఇంజినీరింగ్ చేస్తానమ్మా!’ అంటే, అమ్మ అంది, “నాన్నా! మనకి ఉత్తర దక్షిణాలు లేవు. నాన్నా! మనకు వద్దూ!” అంది. ఉత్తరం అంటే రికమెండేషన్, దక్షిణం అంటే డబ్బు.

చిన్న వయస్సు కదా! దుందుడుకుతనం. గుంటూరు వెళ్ళి అమ్మకు చెప్పకుండా, రవి కాలేజి అని వుండేది ఆ రోజుల్లో, అక్కడి నుంచి నాలుగు పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నా చదువుదామని. ఆ తరువాత నెమ్మదిగా మరొకసారి ధైర్యం తెచ్చుకుని అమ్మకు చెప్పా. అమ్మా! ఇట్లా ఎంట్రన్స్ వుంది, వెళ్ళి ఎగ్జామ్ రాయాలమ్మా! అని. ‘సరే నాన్నా” అని నవ్వింది. సరే, మామూలుగా నవ్విందేమో అనుకున్నా. కానీ, చదువుతూ వుంటే, -ఎగ్జామ్ కి మూడురోజుల ముందు, మూడు రోజులు కూడా కాదు, రెండు రోజుల ముందు గవదబిళ్ళలు రెండూ ఇట్లా వాచిపోయినాయి. సరే! ఎగ్జామ్ రోజు అమ్మ దగ్గరకు వెళ్ళా. అమ్మ చూసి నవ్వి, “ఏం నాన్నా! ఎగ్జామ్ కి వెళ్ళలేదా?” అంది. అంటే, నేను అన్నాను – ఇవి ఇట్లా వాచిపోయినాయి, జ్వరం వచ్చింది, ఇంకేం వెళ్తాను అన్నట్లుగా చూచి ఊరుకున్నాను, నేనేం చెప్పలేదు. ఆవిడకి. చూస్తూ

ఊరుకుంటే అప్పుడంది. “వద్దు నాన్నా! మనకు హాయిగా వుంటుంది. చక్కగా చదువుకో అని చెప్పింది. ఆ తరువాత బి.ఎస్.సీ లో చేరాను.. బీఎస్సీలో చేరిన తర్వాత మనకు బ్యాంకులు, ఎల్బీసీ నాన్నా! అంది.

అట్లా 1986 లో బ్యాంకులో చేరిన వాడిని, ఇవాల్టి వరకూ బ్యాంకుల్లోనే వున్నాను, ఎస్.బి.ఐలో చేసేవాడిని. ఎస్.బి.ఐ నుంచి ఇక్కడికి (HDFC) వచ్చాను. ఉద్యోగం, నాకూ మా అన్నయ్యకి ఒకేసారి వచ్చింది. అది ఏ సందర్భంలో వచ్చింది అంటే, అడవులదీవిలో మా బాబాయి గారు మధుసూదనరావు గారు అనసూయావ్రతం చేసుకుంటుంటే, మేమిద్దరం అక్కడున్నాము. అక్కడున్నప్పుడే మాకు ఆ న్యూస్ వచ్చింది. ఆ విధంగా అమ్మ మమ్మల్ని అడుగడుగునా దగ్గరుండి నడిపిస్తున్నది. అలా సాగిన మా జీవితంలో ఇంకా రెండు మూడు అనుభవాలు మీతో పంచుకుంటాను.

మా నాన్నగారు 1980-81 లో వచ్చినప్పుడు ఇక్కడ చేస్తున్న తరువాత ఏదో మాటల సందర్భంలో ఒకసారి మా నాన్నగారు ఇక్కడ ఎప్పటి దాకా వుంటారు? అనే విషయాన్ని అమ్మ మాటల్లో పెట్టి సూచించింది. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. కుమార్ పెళ్ళి దాకా చూద్దాం రా! (కుమార్ అంటే నేను) అంది. కుమార్ పెళ్ళి 1992 జూన్లో జరిగింది. మా నాన్నగారు 1992 లో హైదరాబాద్ వచ్చారు మా పెళ్ళి కోసం. ఆ తరువాత రకరకాల మార్పుల తోటి, ఆయన మళ్ళీ అర్చకత్వం చేయలేకపోయారు. అంటే, ఈ విషయం 92 లో విషయం, అమ్మ 82 లోనే చెప్పేసింది.

అట్లా తరువాత నా ఉద్యోగం గురించి, ఎంతోమంది సాఫ్ట్ వేర్ కంపెనీలలో చాలా సీనియర్ పొజిషన్స్ లో వున్నవాళ్ళు “మీకింత బ్యాంకింగ్ నాలెడ్జ్ వుంది, మిమ్మల్ని మేము తీసుకుంటాము’ అని చెప్పిన వాళ్ళు కూడా, వాళ్ళు ఏమీ చేయలేక వదిలేశారు. రకరకాల కారణాలతో వాళ్ళు ప్రొఫైల్ పూర్తి చేయలేకపోయేవారు. ఆ రోజు ఆ టైం కి ఏదో ఒకటి వచ్చేది. నేను అట్లా బ్యాంక్ లోనే…. అమ్మ 1984 85లో చెప్పిన విషయం అట్లా బ్యాంకుల్లోనే కంటిన్యూ అవుతున్నాను ఇవ్వాల్టికి 2022 కి కూడా. బహుశః 2025 లో రిటైర్ అవుతాను, అప్పటి దాకా కూడా బ్యాంకుల్లోనే వుంటాను. అట్లా అమ్మ ముందు జరుగబోయేవి, ఎప్పుడో జరుగబోయేవి మాకు ముందే సూచించింది. అప్పుడు కొన్ని అర్థమైనాయి. ఇప్పుడు అన్నీ అర్థమౌతున్నాయి. అంతే తేడా! అట్లా ఉద్యోగం వచ్చి, ఇహ ఉద్యోగం రాగానే పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. అందరి దగ్గర నుంచి ఒత్తిడి పెరుగు తున్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియక, అమ్మకు దండం పెట్టుకున్నాను ఒక సంబంధం వస్తే. ఈ రోజు రాత్రి పెళ్ళికి సంబంధించిన సన్నివేశం ఏదన్నా, నా కలలో వస్తే, ఈ సంబంధం ఖాయం అని దండం పెట్టుకున్నాను. ఆ రోజు రాత్రి, అరుంధతి నక్షత్రం సన్నివేశం కలలోకి రావడం, ఆ సంబంధాన్ని నేను ఓకే చేయడం, ఆ అమ్మాయి, వఝా ప్రసాదరావు గారి అమ్మాయి శివకుమారిని నేను 1992 లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అమ్మబిడ్డలే. అట్లా మమ్మల్ని అమ్మ అడుగడుగునా దగ్గరుండి  నడిపిస్తోంది. 

– (సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!