1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆపద్బాంధవి అమ్మ

ఆపద్బాంధవి అమ్మ

Pamidipati Giridhar Kumar
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : July
Issue Number : 12
Year : 2022

(గత సంచిక తరువాయి)

“అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు” అని అమ్మ వాక్యం. దానికి ఒక చిన్న ఉదాహరణ: మన జీవితంలో యాక్సిడెంట్ అవ్వాలని వ్రాసుంది. అమ్మ కరుణా కటాక్షాలు మన మీద వుంటే, యాక్సిడెంట్ అవుతుంది కానీ, మనకు ఏమీ కాదు.

దాని గుర్తింపు ఏమిటంటే ఆ రోజు, బ్యాంక్ కి వెళ్ళడం కోసమని నా మోటర్ సైకిల్ బయటకు తీశాను. మోటర్ సైకిల్ ఎదురుగా ఒక జీపు ఆగి వుంది. నేను మోటర్ సైకిల్ స్టార్ట్ చేశాను – రోజూ స్టార్ట్ చేసినట్లుగానే. అప్పటికి కొన్నేళ్ళుగా నడుపుతున్నాను. రోజూ స్టార్ట్ చేసినట్లే స్టార్ట్ చేశాను. మోటర్ సైకిల్ ఎదురుగా వెళ్ళి జీపుకు కొట్టుకుంది. కేవలం ఒక అడుగుదూరంలో వున్న జీపే! నాకు ఏం కాలేదు. మళ్ళీ వెనక్కి తీసాను. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి గుద్దుకుంది. అప్పుడు అనుకున్నాను, ఇవాళ ఇదేదో అవ్వాల్సింది కాబోలు అని అనుకుని, ఆ మోటర్ సైకిల్ లోపల పెట్టేశాను. ఎందుకు చెప్పానంటే, మన చేతిలో యాక్సిడెంట్ అవ్వాలని వుంది, యాక్సిడెంట్ అయిపోయింది. కానీ, మనకు ఏం కాదు. ఎందుకంటే అమ్మ రక్షణ వుంది. నిలువెత్తు కవచంలా మనకు అండగా వుంటుంది. ఇంకొక సన్నివేశం చెబుతాను.

సన్నివేశం అని ఎందుకు అన్నానంటే, అది చాలా సినీమాటిక్ గా జరిగింది. నేనూ, నా భార్య మోటర్ సైకిల్ మీద బెంగుళూరులో చిన్న సందులో సూట్కేస్ పెట్టుకుని వెళ్తున్నాము. నా భార్య వెనకాల ఒడిలో సూట్కేస్ పెట్టుకుని వుంది. వెళ్తుంటే, ఒక ఆటో వెళ్తంది, ఆటో వెనకాల నేను వున్నాను.

ఖాళీగా వుంది కదా అనీ, ఆటోని ఓవర్ టేక్ చేయబోయాను. చేయబోతే ఎక్కడి నుంచి వచ్చిందో, ఎదురుగా ఇంకొక ఆటో వచ్చింది. రెండు ఆటోల మధ్యలో మేము వున్నాము. ఒక మనిషి పట్టే స్థలం కూడా లేదు.

కానీ, నా భార్య చక్కగా సూట్ కేస్తో సహా దిగి క్రింద నుంచుంది. నేను బండి ఆపాను. నాకు ఎక్కడా ఏమీ తగల్లేదు. కుడి చేతి ఉంగరం వేలికి అమ్మ ఉ ంగరం ఒకటి వుండేది, సైరామిక్ ఫోటోతోటి. జస్ట్ ఈ ఉంగరం మీద ఉన్న అమ్మఫోటో మాత్రమే చిట్లింది. ఇంకా నాకు ఎక్కడా గీత కానీ, నా భార్యకు ఎక్కడా ఒక్క గీత కానీ, ఒక దెబ్బ కానీ తగల్లేదు. అంటే, మొత్తం యాక్సిడెంట్ మొత్తం అమ్మ స్వీకరించి భరించి మనకి మాత్రం ఏమీ కాకుండా కాపాడింది. అలా మళ్ళీ ఇంకోసారి అమ్మ ప్రొటెక్షన్ అన్నమాట. అమ్మ చేయూత అలా వుండేది, వుంది.

తర్వాత జీవన ప్రయాణంలో మా అబ్బాయి ఒడుగు తలపెట్టుకున్నాము. 2007లో. అప్పుడు నా భార్య నన్ను ఏమి అడిగిందంటే, పెళ్ళిటైం కి ఏ రోజులు ఎట్లా వుంటాయో, అందరినీ పిలిచి చేయాలి అంది. సరే అనుకున్నాము. సుమారుగా 300, 350 మంది బంధువర్గం వున్నారు హైదరాబాదులో కానీ, చుట్టుపక్కల గాని. సరే అని చెప్పేసి, ముందుగా జిల్లెళ్ళమూడి వచ్చి, అమ్మకి దండం పెట్టుకుని, పూజ చేసుకుని, అమ్మ దగ్గర, అమ్మ పాదాల దగ్గర ఆహ్వాన పత్రిక ఉంచి, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరిపించాలనే ఉద్దేశ్యంతో ప్రార్థించి పెట్టుకుని, హైదరాబాద్ వెళ్ళిపోయాము. హైదరాబాద్ లో ఇంట్లో కూర్చున్నాము. మన్నవ నరసింహారావు తాతయ్య వచ్చారు మా యింటికి, మాట్లాడుతూ వున్నాము. ఇంతలోకి క్రింద నుంచీ వాచ్ మెన్ వచ్చాడు. సర్, మీరు డ్రైవర్ అడిగారట కదా!

మీరు నమ్మండి, నేను డ్రైవర్ కావాలని ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క జిల్లెళ్ళమూడిలో అమ్మకి కార్యక్రమం డ్రైవర్ లేడు, డ్రైవర్ ఎలాగో అనుకున్నాను అంతే. ఆ డ్రైవర్ ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాను అంతే. డ్రైవర్ కావాలి, పైకి రమ్మను అని చెప్పాను. అతను పైకి వచ్చాడు. మాట్లాడాము. ఏం బాబు ఎప్పటి నుంచీ చేరుతావు అంటే, ఇప్పుడే చేరిపోతానండి అన్నాడు. ఎంత ఇవ్వమంటారు అన్నాను. మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి అన్నాడు. నాకు అర్థమైంది ఏం జరుగుతున్నదో. కారు తాళం చెవులు ఆయన చేతుల్లో పెట్టి, సరే క్రింద వుండు బాబు నేను వస్తాను అని చెప్పాను. ఆ తరువాత నెక్స్ట్ డే నుంచి ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి వెళ్ళాలి. హైదరాబాద్ మహానగరం. మీకు తెలిసిందే. దాంట్లో నా తరఫున కానీ, నా భార్య తరఫున కానీ పెద్ద బంధువర్గం, వీళ్ళందరూ ఎక్కడెక్కడో వున్నారు. మా మామయ్యగారు, వఝా ప్రసాద్ గారు ఈ ఇన్విటేషన్ కార్డులను ఏ రూటుకు తగ్గట్టుగా రూట్ కి సెట్ చేసి ఇచ్చారు. కూకట్పల్లి వైపు వెళ్ళాలి అంటే, మొత్తం అదంతా ఒక బంచ్ గా ఇచ్చారన్నమాట. అది తీసుకుని బాబూ! మొదట మనం కూకట్పల్లి 6th ఫేజ్ లో వెంకటేశ్వరస్వామి గుడి వద్దకు వెళ్ళాలి తెలుసా మీకు అంటే, ఆ తెలుసండీ అని చెప్పి, తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి ముందు కూర్చోబెట్టేవాడు. అక్కడి నుంచి మొత్తం అన్ని కార్డులు యివ్వటానికి, అతను సునాయాసంగా, అన్నీ తెలిసినవాడిలాగ తీసుకు వెళ్ళాడు. పేరు కృష్ణ అని చెప్పాడు. మూడు నాలుగు రోజుల్లో కార్డులన్నీ డిస్ట్రిబ్యూషన్ చేశాము. అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం వెనక్కి వచ్చాము.

అతన్ని ఇంటి దగ్గర ఉండమని, మేము షాపింగ్కి వెళ్ళాము. వెనక్కి వచ్చాక మా పిల్లలు చెప్పారు, డ్రైవరుకి జ్వరంగా వుంది, యింటికి వెళ్ళి రేపు వస్తానని చెప్పి సజావుగా చేయమని చెప్పాను తప్ప, నా భార్యతోటి వెళ్ళాడు అని.

 

అలా వెళ్ళిన ఆ డ్రైవరు ఈ రోజు వరకు మరల కనబడలేదు. అతను ఎవరు అని మేము మిగితా డ్రైవర్లని అడిగితే ఎవరూ అతడ్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు అని చెప్పారు. అప్పుడు నాకు, నా భార్యకు అర్థమైంది. ఆ జగజ్జనని అమ్మ, తన బిడ్డల సౌలభ్యం కోసం, తనే (అర్జునుడికి శ్రీకృష్ణుడిలాగా) సారధ్యం వహించింది అని.

మేము జిల్లెళ్ళమూడి వెళ్ళి, అమ్మను కార్యక్రమం సజావుగా జరిపించమని అర్థించాము కదా! ఒడుగు రోజు అమ్మది పెద్ద ఫోటో స్టేజి మీద పెట్టాము. మా సిద్ధాంతిగారు, వారి శిష్యులతో కార్యక్రమం జరిపిస్తూ, ఆయన తన కూతురితో కూర్చుని, క్రతువు చూస్తున్నారు. ఉన్నట్లుండి, ఆయన కళ్ళు భారమై, కన్నీళ్ళు వర్షించినాయి. ఏమైందని అడిగితే, “ఆ ఫోటోలో ఉన్న అమ్మని నేను ప్రత్యక్షంగా మీ వెనుక నుంచోవటం చూశాను. ఆమె, దేవతలు మీతో వుండి ఒడుగు జరిపిస్తున్నారు” అని చెప్పారు. ఆయన అప్పటికప్పుడు వస్త్రాలు తెప్పించి, అమ్మకు సమర్పించారు.

మా బామ్మగారు, సావిత్రమ్మ గారు మమ్ములను ఆశీర్వదించి, “ఈ రోజు స్టేజి మీద నేను దేవతలే దిగివచ్చినట్లుగా చూశాను” అన్నారు.

అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద అలా అనుక్షణం ప్రసరించి, మన జీవితాలను సుఖశాంతులతో పరిపూర్ణం చేస్తుంది అమ్మ.

జయహెూమాతా!!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!