ఆంజనేయులు అన్నయ్య 1960 నుండి మా కుటుంబానికి ఆప్తుడు అయ్యాడు. మేము చాల కష్టాల్లో ఉన్నపుడు, దీనజన శరణ్య ‘అమ్మ’ ఎవరో తెలియనపుడు మమ్మల్ని ‘అమ్మ’ శ్రీ చరణ సాన్నిధ్యానికి చేర్చి గట్టు ఎక్కించిన పి.యస్.ఆర్. అన్నయ్య ఋణం ఎప్పటికీ తీర్చుకోలేము.
ఏ చిన్న కష్టం కలిగినా అన్నయ్యకు ఫోన్ చేస్తే తక్షణం స్పందించి సమస్యకు పరిష్కారం చూపి ధైర్యం చెప్పేవాడు. ఇదే పరిస్థితిలో ‘అమ్మ’ ఏమి చెప్పి సాంత్వన కలిగించేదో చెప్పి చతికిలపడ్డ మమ్మల్ని లేవదీసి కూర్చోబెట్టే వాడు.
శ్రీ గిరిరాజు ఆంజనేయులు మా అన్నగారు. వారి మరణానంతరం ‘అమ్మ’ ఇచ్చిన అన్నయ్యగా పి.యస్.ఆర్. అన్నయ్య ప్రేమను పంచాడు. పి.యస్.ఆర్.అన్నయ్య మనందరికీ పెద్ద అన్నయ్యగా ఆప్తుడు అయ్యాడు. జగన్మాత ‘అమ్మ’ ముద్దుబిడ్డగా ఎన్నో సేవాకార్యక్రమాలను నిర్విఘ్నంగా, అకుంఠిత దీక్షతో నిర్వహించిన వ్యక్తి.
ధీరోధాత్తుడు, మంచికవి, అన్నింటినీ మించి మనసున్న మనిషి. మెడలో జరీ ఉత్తరీయం, ముఖాన చిరునవ్వు, భ్రుకుటిలో కుంకుమరేఖ, గంభీరమైన కంఠధ్వని – ఆదరణకు ప్రతిబింబం అన్నయ్య. ప్రతినెల ‘విశ్వజనని’ పత్రిక రాగానే మొట్టమొదట చదివేది పి.యస్.ఆర్.అన్నయ్య సంపాదకీయాన్నే – ఎన్నో సంగతులను తన సంపాదకీయాల ద్వారా తెలియపరిచాడు. ఆ సాహిత్యసేవ అమ్మ ప్రసాదించిన వరం.
అన్నీ తెలిసిన అన్నయ్య తను చేయదలచుకున్న పనులను త్వరగా ముగించుకుని తనువు చాలించాడు. దుర్లభమైన, అర్కపురీ పుణ్యక్షేత్రంలో మహాప్రస్థానం చేసి, అమ్మలో ఐక్యమైనాడు.
పి.యస్.ఆర్.అన్నయ్య ప్రేమ వ్యక్తంగా ఉంటుంది; నిఖిలలోకశరణ్య అమ్మరక్షణ, పాలన, పోషణ అవ్యక్తంగా ఉంటాయి.