సోదరుడు తంగిరాల కేశవశర్మను తలచుకున్నప్పు డల్లా అతనితో నాకున్న 50 యేళ్ళ అనుబంధం, ఆ రోజుల నుంచి చివరిసారిగా ఈ సంవత్సరం ‘అమ్మ’జన్మదినోత్సవాల నాడు జిల్లెళ్ళమూడిలో కలిసేవరకూ అతనిలో దర్శించిన విశిష్ట వ్యక్తిత్వం అమ్మ పట్ల అతనికి గల అచంచలమైన భక్తి విశ్వాసాలు గుర్తుకొస్తాయి.
కేశవన్నయ్యను నేను మొట్టమొదటిసారిగా కలిసింది. 196వ సంవత్సరంలో, జిల్లెళ్ళమూడిలో, ఆ తరువాత 1962లో నా నిరుద్యోగ దశలో ఉద్యోగవేటలో నేను హైదరాబాద్ లో వుండటం, కేశవన్నయ్య ఎల్.ఐ.సి.లో ఉద్యోగం చేస్తూ వివాహమైన తరువాత శారదక్కయ్యతో నహా తాను హైదరాబాద్లో యాదృచ్ఛికమనుకోను. ఎందుకంటే అదే సమయంలో డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరరావుగారు కూడా ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రకలో ఉద్యోగం చేస్తూ వుండటం వాళ్ళిద్దరినీ కూడా తరచు కలుసుకోవటం అమ్మ నాకు అనుగ్రహించిన వరం.
నేను సాయంత్రానికి వెంకటేశ్వరరావుగారి ఆఫీసుకు చేరి వారితో బాటు బయలుదేరి, కేశవన్నయ్యను కలుపుకొని ఇంచుమించు ప్రతిరోజూ పబ్లిక్ గార్డెన్స్కు నడుచుకుంటూ వెళ్లి, అక్కడ కూర్చుని “అమ్మ”ను గురించి కబుర్లు విశేషాలు మాట్లాడుకుంటూ చివరకు ముగ్గురమూ అప్పట్లో వుండేది చిక్కడపల్లిలో కనుక మళ్లీ నడచుకుంటూ ఇంటికి చేరేవాళ్ళం విశేషమేమిటంటే కేశవన్నయ్యను అలా కలుసుకుని మాట్లాడుకునే టప్పుడు ‘అమ్మ గురించి తప్ప మరే విషయమూ ప్రస్తావనకు వచ్చేది కాదు. కొన్ని సందర్భాలలో ‘అమ్మ’ను గురించి కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినపుడు కేశవన్నయ్య ఎంతో ఉద్వేగంతో చెప్పేవాడు. ఆ సమయంలోనే, తన వివాహానికి పూర్వం అమ్మ దగ్గరకు వెళ్ళే రోజుల్లో అక్కడ తన వివాహ ప్రస్తావన వచ్చినపుడు, తను ‘అమ్మ’ దగ్గరకు వచ్చిన తరువాత కూడా పెళ్లి చేసుకోవలసి వచ్చినందుకు ఆవేదనతో, అమ్మతో పంతానికి దక్షిణదేశమంతా పాదయాత్రచేయటం, అక్కడి వివిధ ప్రదేశాల్లో తనకు కలిగిన అద్భుతమైన అనుభవాలను గురించి చెప్పేవాడు.ఆ ఆవేదనతోనే ‘విశ్వాసం’ గురించి తను వ్రాసిన వచనగేయాన్ని చూపించాడు. ఆ గేయం అమ్మపట్ల అతనికున్న ప్రగాడ విశ్వాసానికి దర్పణం పట్టినట్లుగా వుండటమేకాక అనేక భక్తజనావళికి మార్గదర్శకంగా వుంది.
మరికొన్ని సందర్భాలలో ‘అమ్మ’ను గురించి ముచ్చటిస్తున్నప్పుడు చిన్నపిల్లవాడిలా నవ్వుతూ మహదానంద పడేవాడు. కాని తన చాలీచాలని జీతంతో తను అనుభవిస్తున్న కష్టాలను గురించి గాని, శారదక్కయ్య అనారోగ్యం గురించి గాని (శారదక్కయ్య వివాహమైన తొలిరోజులనుంచి అనారోగ్యంగా వుండేది) ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు. ఒక్కసారే, అది కూడా నేను అదే సంవత్సరం రూర్కెలా ఉద్యోగం చేస్తున్నపుడు వుత్తరం వుండటం ద్వారా, అక్కయ్య వైద్యానికయ్యే ఖర్చు గురించి ప్రస్తావించి, తాను పడుతున్న ఇబ్బందులు గురించి వ్రాస్తూ నేను హైదరాబాద్లో అంతకుముందు తన దగ్గర్నుంచి అప్పుగా తీసుకున్న రొక్కం వెంటనే పంపితే తను చాలా సంతోషిస్తానంటూ వ్రాయటంతో అన్నయ్య పడుతున్న ఇబ్బందులను గురించి మొదటిసారిగా తెలిసి నాకు కళ్లనీళ్ళ పర్యంతమయింది.
విశాఖపట్నంలో వుండగానే 2002లో జిల్లెళ్ళమూడిలో జరుప తలపెట్టిన హైమవతీదేవి క్షీర శిలావిగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ నిర్వహణ బాధ్యత తన భుజస్కంథాల మీద వేసుకొని, అవిశ్రాంతంగా కృషిచేసి ఆ కార్యక్రమాన్ని దక్షతతో, శ్రీవిశ్వజననీపరిషత్ సభ్యులు, అశేషమైన అమ్మ అనుంగబిడ్డల సహకారంతో విజయవంతంగా ముగిసేలా పాటుపడ్డాడు. ఈ సందర్భంలో ఏకభుక్తంగా వుంటున్న తను ఒకరోజు ‘అమ్మ’ భౌతికంగా లేని లోటుకు కుమిలిపోయాడు.
ఈ కార్యక్రమం ముగిసిన కొన్నాళ్లకు తీవ్ర ఆలోచన చేసి తన శేషజీవితాన్ని పూర్తిగా ‘అమ్మ’ ఉపాసనలోను, ధ్యానంలోను గడపాలనే సదుద్దేశంతో విశాఖపట్నంలోని తన ఇంటిని విక్రయపరిచి బాపట్లకు మకాం మార్చాడు. కాని అమ్మ సంకల్పం మరోలాగ వుండటంతో తాను సంకల్పించిన విధానానికి బదులు శ్రీవిశ్వజననీపరిషత్ చేపట్టిన అనేక కార్యక్రమాలతో తలమునకలవటమే కాక తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక ఎంతో కాలంగా అనిశ్చితంగా వున్న సంస్థకు చెందిన చర, స్థిరాస్తులనన్నింటినీ కార్యదర్శి మధుసూదనరావు సహకారంతో క్షుణ్ణంగా పరిశీలించి, వాటన్నింటికి ఒక సమగ్రమైన పద్ధతిలో యేర్పాటు చేశారు. ఇంకా ఎన్నో సేవాకార్యక్రమాల రూపకల్పనకు తానే కారణభూతుడై తానే ఆర్థిక సహాయాన్ని యేర్పాటు చేసి వాటి సక్రమ నిర్వహణకు తానే పూనుకుని అహర్నిశలు అదే ధ్యాసతో వున్న తనకు తన కుమారుడు చిరంజీవి తేజోమూర్తి సంపూర్ణంగా చేయూతనిచ్చి కేశవన్నయ్య ఆశయాలకు పరిపుష్టిని చేకూర్చాడు. ప్రొ. శివరామకృష్ణగారు మహోపదేశగణాన్ని ‘Divine Play of Amma’ అనే పేరుతో ఇంగ్లీషులోకి అనువదించగా ఆ పుస్తకము ముద్రణ తేజోమూర్తి ఆర్థిక సహకారంతో చేపట్టి, శ్రీ విశ్వజననీపరిషత్, అమ్మసేవాసమితిల సంయుక్త ఆధ్వర్యంలో కేశవన్నయ్యకు పూర్తి సంతృప్తి కలిగేలా విజయవంతంగా నిర్వహించాము.
అదే స్ఫూర్తితో కేశవన్నయ్య మరుసటి సంవత్సరం ఎక్కిరాల భరద్వాజ వ్రాయగా 1967లో ముద్రితమైన ‘Voice of Mother’ ఇంగ్లీషు పుస్తకాన్ని పునర్ముద్రణకు నన్ను ప్రోత్సహించి దానికి కావలసిన ఆర్థిక సహాయం కూడా యేర్పాటు చేశాడు.
జిల్లెళ్ళమూడిలో 1983 నుంచి తాను నిర్వహిస్తూ వచ్చిన ఎన్నో యాగాలలో పాల్గొనేందుకు మిగతా సోదరులతో పాటు నన్ను ప్రోద్బలం చేసి, ప్రోత్సహించి నాకు అలాంటి మహదవకాశాన్ని కల్పించాడు కేశవన్నయ్య. అలాంటి ఏ కార్యక్రమం తలపెట్టినా, చేపట్టినా ఆ కార్యక్రమ విజయానికి అహరహమూ పాటు పడిన కేశవన్నయ్య అందరికి మార్గదర్శకుడు.
ఇటీవల గత రెండు, మూడేళ్లుగా శ్రీ అనసూయేశ్వరాలయం విషయంలో ఆగమశాస్త్రానుసారం, దక్షిణాది సంప్రదాయం ప్రకారం ఆ ఆలయ పరిపుష్టికి జరుపవలసిన వివిధ ప్రతిష్ఠా కార్యక్రమాల గురించి అత్యంత కృషిచేసి వాటి గురించి నిరంతర తపనతో అసంపూర్ణంగా వుండిపోతాయేమో నన్న మనోవేదన ననుభవించాడు. చివరికి ‘అమ్మ’ కేశవన్నయ్య ఆవేదనా భరిత హృదయానికి వూరటం కలిగించేందుకు అన్నట్లు యేకంగా తన ఒడిలోకి లాక్కుంది..
అలాంటి కేశవన్నయ్య అమ్మ ఒడిలో చేరాడని సమాధానపడదామా, లేక అలాంటి వ్యక్తి మన మధ్య ఇక లేడని మధనపడదామా !
‘అమ్మే’ తన ఉచ్ఛ్వానిశ్వాసాలుగా నింపుకున్న ఆ నిరంతర తపస్వికి, ఆప్తుడైన కేశన్నయ్యకు నా ఆత్మీయతా కుసుమాంజలి.