1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆరాధన, ఆత్మీయతలకు ప్రతిరూపం – శ్రీ అంగర సూర్యనారాయణరావు

ఆరాధన, ఆత్మీయతలకు ప్రతిరూపం – శ్రీ అంగర సూర్యనారాయణరావు

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : January
Issue Number : 6
Year : 2022

నీ పాదకమల సేవయు నీ పాదార్చకులు తోడి వైయ్యము … తాపిన మందార నాకు దయసేయగదే’ త్రికరణశుద్ధిగా ఆరాధ్యమూర్తిని ప్రార్ధించడం, తదనుగుణంగా నడుచుకోవడం సిసలైన భాగవతుని లక్షణాలు. అట్టి శుభలక్షణ లక్షితులు సో॥ శ్రీ అంగర సూర్యనారాయణ గారు, వారి కుటుంబసభ్యులు,

“R.S.S. కార్యకర్తగా దేశభక్తి, దైవభక్తులను నరనరాల జీర్ణింపజేసుకుని, శ్రీ తంగిరాల కేశవశర్మ వంటి సోదరులు సత్సాంగత్యంతో అమ్మ దివ్యదర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని పొంది, అఖిలలోకారాధ్య అమ్మను తమ మనోమందిరంలో ఇష్టదైవంగా ప్రతిష్ఠించుకున్నారు. అన్నయ్య అందరింటి సభ్యులందరికీ చిరపరిచితులే. ఆదరణీయులే.

ఎవరైనా వారింటికి వెడితే సాక్షాత్తు అమ్మ వచ్చినట్లు నంబరవడి సమ్మానించేవారు. అది జిల్లెళ్ళమూడి సోదరీసోదరుల సంస్కృతి, మాన్య సో॥ శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు అనే వారు “ఎవరైనా జిల్లెళ్ళమూడి వెళ్ళి వచ్చారంటే వాళ్ళ battery charge అయిందని, వారిని కలుసుకుని కరచాలనం చేస్తే వారు పొందిన అమ్మ అనుగ్రహవైద్యుత శక్తి మనకూ ప్రసరిస్తుందని అనుకునేవాళ్ళం” అని.

శ్రీ అంగర సూర్యనారాయణ అగ్రజులతో నా సన్నిహిత సంబంధ విశేషాల్ని కొన్నిటిని ముచ్చటిస్తాను. 

 1993లో నేను బెంగళూరు ఒక training నిమిత్తం వెళ్ళాను. నాకు బెంగళూరు కొత్త కనుక నేరుగా వారింటికి వెళ్ళాను. వారు మహదానందపడి నాడు శ్రీ అనసూయావ్రతం చేయించమన్నారు. సరేనన్నాను. ఆ క్రమంలో పంచామృతస్నాన అనంతరం శుద్ధోదక స్నానం  అనగానే, వారు తాత్సారం చేశారు. వేడినీళ్ళు తెప్పించారు. ఇదేమిటి? అని అడిగాను. “మనం వేడి నీళ్ళు పోసుకుని అమ్మకు చన్నీళ్ళు పోస్తామా?” అన్నారు. అది భగవతి ఎడల నిర్మలప్రేమకి తార్కాణం. తరువాత కాలంలో చతుష్షష్టి ఉపచారాలలో ఉష్ణోదకస్నానం శాస్త్ర నమ్మతం అని తెలిసింది. అమ్మ ప్రసాద స్వీకరణానంతరం నాకు కొత్తబట్టలు పెట్టారు. స్వయంగా నన్ను జ్ఞానభారతి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నా Training Centre కి తీసుకువెళ్ళారు.

దరిమలా డా॥ పన్నాల రాధాకృష్ణశర్మ గారు అమ్మ అశేష కళ్యాణ గుణ వైభవాన్ని కీర్తిస్తూ రచించిన ‘అంబికా సహస్ర నామావళి’కి నేను వివరణము వ్రాస్తున్నానని తెలుసుకొన్నారు. ఆ గ్రంధరచన 30 ఏళ్ళక్రితం ప్రారంభించినా నేటికికాని పూర్తికాలేదు. 12.04.2022, అమ్మ 100వ జన్మదినోత్సవ సందర్భంగా ఆవిష్కరించాలని సంకల్పం. కానీ, ఆ గ్రంధవైశిష్ట్యాన్ని గుర్తించి అమ్మయందలి వినిర్మల భక్తి ప్రపత్తులతో తమ శక్తికిమించి నేను అడగకుండానే ఆ గ్రంథాన్ని ప్రచురించాలని రు. 75,000/-లు 20 ఏళ్ళక్రితమే విరాళంగా నాకు అందించారు. వారు మధ్యతరగతి సామాన్యగృహస్థులే. ‘ఇంకా సొమ్ము ఎంత అవసరమో చెప్పండి, పంపిస్తాను’ అని పదేపదే అనటం, నాకు ఉత్తరాలు వ్రాయటం చాలా విశేషం. ఆస్తి ఉండటం వేరు, ఆస్తిక్యత ఉండటం వేరు.

జిల్లెళ్ళమూడిలో ఒక ఏడాది నాన్నగారి ఆరాధనోత్సవం ధాన్యాభిషేకం వైభవంగా నిర్వహింపబడుతుంది. విరాళాలు స్వీకరించి రశీదుతో పాటు అమ్మ ఫోటో ప్రసాదాలను అందజేసే కౌంటర్లో నేను పనిచేస్తున్నాను. శ్రీ సూర్యనారాయణ గారి అబ్బాయి చిరంజీవి రాజేంద్రప్రసాద్ నా సమీపంలో కూర్చున్నారు. వివరాలు అడుగుతున్నారు. ఆ ఏడాది ఐస్తా ధాన్యం రు.1,000లు, బస్తా బియ్యం రు.2,000లు, శాశ్వత ధాన్యాభిషేక విరాళం రు.10,000లు అని చెప్పాను. అంతే. ఆ అబ్బాయి తక్షణ వారి కుటుంబసభ్యుల 6 పేర్లు చెప్పేరు 60,000/-లు చెక్ అందజేశారు.

మరలా ఒకసారి బెంగళూరు వెళ్ళాను. Gangusa lay out, Ramamurthynagar లో వారి కుటుంబ సభ్యులందరూ కలిసి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని నివసిస్తున్నారు. నాల్గు ఫ్లాట్స్ ఒకే డిజైన్, ఒకే సౌకర్యం, ఒకే చోట పూజామందిరం. వాస్తవానికి అమ్మ బిడ్డలందరూ వారికి ఆత్మబంధువులే. వారి కుమార్తె పద్మ, వారి శ్రీమతి, వారి బిడ్డలు అందరూ అమ్మ శ్రీవరణాల్ని విశ్వసించినవారే. సముద్రస్నానానికి ఒక్కరూ పోకూడదు; ‘ఏకః స్వాదు న భుంజీథా’ అన్నట్లు రుచికరమైన పదార్థాల్ని ఒక్కరే ఆరగించకూడదు. జగన్మాత అమ్మదర్శనం, ప్రసాదం, అనుభవాలు వ్యక్తిగత సంపద అని భావించక పదిమందితో కలిసి పంచుకోవాలి. ఇదే వసుధైకకుటుంబ భావన.

అమ్మపట్ల ఆరాధన, అమ్మబిడ్డల పట్ల ఆదరణ, ఆప్యాయత ఉన్నత ఉత్కృష్ట ఆదర్శ భాగవత లక్షణం. ‘వినైవానసూయాం న మాతా నమాతా, సదైవాన సూయం స్మరామి స్మరామి’ అనే దృఢనిశ్చయంతో అందరి మనస్సులకు చేరువై, తన జీవితాన్ని జీవనాన్ని ఒక దేవపారిజాత పుష్పంగా మలచుకొని అమ్మను ఆరాధించిన శ్రీ సూర్యనారాయణ అన్నయ్యగారు 16-12-2021న దేహత్యాగం చేసి విశ్వాంతరాత్మ్యం అయిన అమ్మ అనంతచైతన్యమహోదధిలో ఐక్యమైనారు. 

ఆత్మీయ సోదరునకి అశ్రునివాళి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!