ఆ మధ్య నేను ఒకరోజు ఉదయం నామం చెప్పిన తరువాత యథాప్రకారం ముందుగా హైమాలయంలోను, తరువాత అనసూయేశ్వరాలయంలోను ప్రదక్షిణాలు చేసి తిరిగి వెడుతున్నంతలో అనసూయేశ్వరాలయం గర్భగుడిలోంచి అర్చకుని మంత్రనాదం మంద్ర స్వరంలో వినబడింది.
ఇంకా అప్పటికి అర్చకస్వామి తన విరామ సమయం నుంచి తిరిగి రాలేదు. ఒకవేళ నేను బయటకు వచ్చేసరికి వేరొక ద్వారం నుంచి అర్చకస్వామి వచ్చారేమోనని మళ్ళీ వెనుదిరిగి గర్భగుడి వద్దకు వచ్చి చూశాను. కాని ఎవరూ లేరు. గర్భగుడి గ్రిల్ తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నాయి. అయినా మంత్రనాదం వినిపిస్తూనే వున్నది.
నాకు ఆశ్చర్యం వేసి గ్రిల్ తలుపులోంచి లోనికి తొంగి చూశాను. గోడకు బిగించి వున్న ఫ్యాన్ తిరుగుతున్నది. కొద్దిగా శబ్దం చేస్తూ. అయితే నేను విన్నది. ఫ్యాన్ చప్పుడేమో ననుకున్నాను.
కాని, ఆ మంత్రనాదం ఇది వరకులాగే మంద్ర స్వరంలో వినబడుతూ వున్నది.
అంతే! రోమాంచితుడనై అమ్మకు నమస్కరిస్తూ అలాగే నుంచుని మరికొంతసేపు ఆ నాదాన్ని విని వచ్చేసాను.
ఇలా కేవలం నాకు మాత్రమే వినబడిందో లేక ఇంకెవరికైనా వినబడిందో తెలియదు. అదీ ఈ మధ్యనే అనసూయేశ్వరాలయంలో గర్భగుడి చుట్టూ నవశక్తులను గర్భస్థ శిశువు రూపాలతో సహా శాస్త్రోక్తంగా ప్రతిష్టించిన తరువాత నాకు కలిగిన అనుభవం!
దీనిని బట్టి నా యీ చిన్న బుర్రకు తట్టిన ఆలోచన యేమిటంటే అమ్మచుట్టూ పరివేష్టించి యున్న నవదేవతలు లోపల వున్న అమ్మవద్దకుచేరి, మంత్రనాదంతో అమ్మను స్తుతిస్తూ వున్నారేమోనని.
అంతకుముందు నేను గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు చుట్టూవున్న నవశక్తులను స్పృశిస్తూ చేసేవాడిని. ఈ అనుభవం కలిగిన తరువాత మామూలు దుస్తులతో వాటిని స్పృశించడానికే భయం వేసి కేవలం కళ్ళతోనే వాటికి నమస్కరిస్తూ ప్రదక్షిణలు చేస్తున్నాను.
మరి అంతేకదా. గర్భగుడిలో పరివేష్టితమైవున్న ‘అమ్మ’ ఆది పరాశక్తి అయితే, ఆమెచుట్టూ బయట ప్రతిష్టింప బడివున్న నవశక్తులు ఆమె సోదరీమణులు! ఆమె అంశలు!
అందుకే దాని కనుగుణంగానే ఈ మధ్య మన ‘విశ్వజనని’ మాసపత్రికలో – ఇటు అనసూయేశ్వరాలయంలోనూ, అటు హైమాలయంలోను, ఆగమశాస్త్ర, ప్రకారం ఆలయ మర్యాదలు పాటిస్తూ ఏవిధంగా దర్శనాదులు, క్రతువులు చేసుకోవాలో వివరిస్తూ చాలా చక్కగా దిశానిర్దేశాలు చేసారు. అదిచాలా ముదావహం.