1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆవేదనలూ నివేదనలే

ఆవేదనలూ నివేదనలే

Dr Tangirala Simhadri Sastry
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

ఈ సంఘటన 1967 ఆగష్టు నెల ప్రాంతంలో జరిగింది. ఒకరోజు సో. బ్రహ్మాండం సుబ్బారావు Hyderabad, Abidsలో ఉన్న Postmaster General Officeకి వచ్చి, అక్కడి Office Supdt. శ్రీ వెంకటరత్నం గారిని కలిసి తనను పరిచయం చేసికొని మాతృశ్రీ మాసపత్రిక, కుంకుమ పొట్లాలు ఇచ్చి, గుంటూరుజిల్లాలోని జిల్లెళ్ళమూడికి Telephone సౌకర్యం మంజూరు చేయటం గురించి మాట్లాడారు. కానీ తాను అమ్మ కుమారుడనని పరిచయం చేసుకోలేదు. అది ఆయన నిరాడంబరతకి ఉదాహరణ.

ఆ పత్రిక ముఖచిత్రంలో ఉన్న ఆమె ఎవరు అని ఆయన అడిగారు. “ఆమెను జిల్లెళ్ళమూడి అమ్మ అంటారని ఇక్కడ స్థానికులు ప్రతి శనివారం అమ్మ పూజలు చేస్తుంటారు, రాబోయే శనివారం తంగిరాల శాస్త్రిగారింట్లో పూజ చేస్తారు” అని చెప్పి, నా అడ్రసు ఇచ్చారు.

ఆ తర్వాత వెంకటరత్నంగారు మా ఇంట్లో అమ్మ పూజకి వచ్చారు. పూజ ముగిశాక వారు దిల్షుక్ నగర్లో ఇల్లు కట్టుకున్నామని తర్వాత శనివారం వారి నూతన గృహంలో అమ్మ పూజ చేసుకుంటామని చెప్పి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు మేమందరం వారింటికి వెళ్ళాం.

ఆ రోజే జిల్లెళ్ళమూడికి Telephone Connection వచ్చింది. ఆరోజుల్లో phone చేయాలంటే Trunk Call Book చేయాలి. పూజ ప్రారంభించే ముందు వెంకటరత్నం గారు జిల్లెళ్ళమూడికి Trunk call book చేశారు. జిల్లెళ్ళమూడిలో సంధ్యావందన పూర్వకంగా, ధూప దీప నైవేద్య నీరాజనాలతో అందరం అమ్మను ఆర్చించుకున్నాం.

పూజ ముగిసేసరికి Trunk call mature అయిందని, జిల్లెళ్ళమూడి అమ్మగారు మాట్లాడతారని Cheruvu Exchange వారు చెప్పారు. అమ్మతో మొదటిసారి – maiden call – శ్రీవెంకటరత్నం గారు మాట్లాడి, phone నాకు ఇచ్చారు. ఆ సమయంలో నేను అమ్మనామం చెబుతున్నాను. అమ్మ phone receiver ని జిల్లెళ్ళమూడిలో ఒక్కొక్కరి చెవి దగ్గర పెట్టిందని తర్వాత తెలిసింది.

చివరలో అమ్మ వెంకటరత్నం గారితో మాట్లాడుతూ “నాన్నా! నివేదన పెట్టారు. అందులో పచ్చడి వెయ్య లేదు. మీరైతే పచ్చడి వేసుకుని తింటారు కదా!” అన్నది. తీరాచూస్తే అమ్మ మాట నిజం. ఆ రోజు ఒట్టిగారెలే నివేదన చేయబడ్డాయి. వెంకటరత్నం గారూ, మేమూ ఆశ్చర్యచకితులైనాము. అది అందరికీ ప్రప్రధమ ప్రత్యక్ష అనుభవం.

తరచి తరచి చూస్తే, నిజానికి, అమ్మ చేసిన ప్రస్తావన – అర్థం, పరమార్థం – చట్నీ గురించి కాదు. కొంచెం వివరిస్తా. సో.వెంకటరత్నం గారు అమ్మకి ఫోన్ చేశారు. “నాన్నా! నాకు చట్నీ లేకుండా పెట్టారేమిటి?” అని అమ్మ అడిగింది, ఆయన Phone చేసి ఉండక పోతే, ఆ సంగతి ఎవరికీ తెలియదు.

అంతేకాదు. అమ్మ హైదరాబాదుకి ఎంతో దూరంలో ఉన్నది. తను ఎలా చూసింది? తనకి ఎలా తెలిసింది? – అంటే అమ్మ ఏకకాలంలో పలుచోట్ల ఉండగలదు. జిల్లెళ్ళమూడిలో భౌతిక రూపంతో అనుకుంటే హైదరాబాదులో అవ్యక్త, అదృశ్య రూపంతో, అలా విశ్వంలో ఎక్కడైనా ఉంటుంది. సర్వాంతర్యామి అని అంటాం. సర్వవ్యాపకత్వం దైవలక్షణం. చట్నీ లేకుండా ఒట్టి గారెలు నివేదన చేశారని తేల్చి చెప్పటం – సర్వజ్ఞత్వం అనే దైవలక్షణం.

సరే. అమ్మ నివేదన స్వీకరించింది, చూసింది, తెలుసుకుంది. కానీ ఆ సంగతి Phone లో ఎందుకు తెలియపరచింది? ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యాప్రయచ్ఛతి,’ ‘కించిత్ భక్షిత మాంసశేష – కబళం నవ్యోప హారాయతే’ అనే సత్యాలు మనకి తెలుసు. ప్రేమతో పెడితే స్వీకరిస్తాడు – ఆ వస్తువు ఏదైనా. కాగా ‘చట్నీ లేదు’ అని ఎందుకు గుర్తు చేసింది? అది అమ్మ కృపావిశేషం. ఒక ఆప్తవాక్యాన్ని తద్వారా వినిపించింది – “అమ్మ అంటే జిల్లెళ్ళమూడిలో మన కంటికి కనిపించే పరిమిత రూపం మాత్రమే కాదు, అది అనంతమైనది, అంతా అయినది, అర్థం కానిది- అని. ఒక ఎఱుక కలిగించింది.

దీనిని మాహాత్మ్యం (Miracle) అని కూడా సంభావన చేయవచ్చు. అది మన ఊహకి అతీతమైనది, విశేషమైనది. అమ్మకి సహజం. Miracles are incidents that promote faith. ఆ సందర్భంగానైనా సర్వాంతరాత్మగా అమ్మను కొంతవరకైనా అర్థం చేసుకోగలం.

మరొక సంగతి. సహజంగా దైవ చిత్రపటం/విగ్రహం ముందు లాంఛనంగా నివేదన చేస్తాము. రత్న సింహాసనం సమర్పయామి, నృత్యం దర్శయామి… అన్నీ ఒక తంతు. నిజంగా దైవం స్వీకరిస్తాడు (భుజిస్తాడు) అనుకుంటే కేవలం అరటి పండు/బెల్లంముక్క/పంచదార పలుకులతో సరిపెట్టం కదా! ఈ సందర్భంగా అమ్మ ‘నీ నివేదనను నేను ప్రేమతో స్వీకరిస్తాను’ అని పరోక్షంగా ధృవీకరిస్తోంది.

మరొక విశేషాంశం. ఇక్కడ ‘నివేదన’ అనే పదాన్ని (Define) నిర్వచించాలి. నివేదన అంటే- తినుబండారం (ఆహారపదార్థం) మాత్రమే కాదు; మనకి కలిగిన దానిని (విద్య/సంపద/శ్రమ.) భగవంతునికి/భగవంతుని ఉన్న చరాచర జీవులకు సమర్పించటం. సాధారణంగా సుఖాలు కలిగితే స్పృహ కోల్పోతాం; వ్యతిరేక పవనాలు వీస్తే తలక్రిందులౌతాం – వాటిని దైవానికి నివేదించాలని స్ఫురించదు. నిరంతరం మన వెన్నంటి అదృశ్యంగా ఉంటూ కనిపెట్టుకుని ఉండే ఆ అలౌకిక శక్తికి కాక మరెవరితో మొరపెట్టుకుంటాం?

ఇక్కడే అమ్మ మహనీయతత్వం – విలక్షణ సముద్ధరణ తత్వం ప్రస్ఫుటమవుతుంది. నిస్సహాయస్థితిలో ఉన్న వాళ్ళు తనను పిలిచి మొరపెట్టుకోలేదని అమ్మ చూస్తూ ఊరుకోదు. అమ్మకి ఆశ్రిత పక్షపాతం లేదు. పూజించే వారు – ద్వేషించేవారు; నమ్మినవారు – నమ్మనివారు అనే విచక్షణ, విభజన లేదు. అందరూ తన ముద్దుబిడ్డలు, కంటిపాపలు, వాత్సల్యానికి పాత్రులు.

‘శ్రద్ధాం, మేధాం, యశః, ప్రజ్ఞాం విద్యాం, బుద్ధం, శ్రియం, బలం, అయుష్యం, తేజః, ఆరోగ్యం దేహి’ అని ప్రార్థించనవసరం లేదు; ప్రాధేయపడవలసిన అవసరం లేదు. అమ్మ ప్రేమలో మురిసిపోతూ, అమ్మ అనంతత్వ వైభవాన్ని స్మరించుకుంటూ కృతజ్ఞతా పూర్వకంగా జీవించగలిగితే చాలు. ‘అమ్మా! ఆశీర్వదించు!!’- అని అభ్యర్థిస్తే అమ్మ- ‘అది అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఉన్నది’ అన్నది. ‘అడగనిదే అమ్మ అయినా పెట్టదు కదా!’ అని చిరకాల నానుడిని ప్రస్తావిస్తే, “అడగనిదే అవసరాన్ని గమనించి – పెట్టేదే అమ్మ” అని తన నిజతత్వాన్ని స్పష్టం చేసింది. ఆర్తత్రాణపరాయణత్వం, దీనజనావనతత్వం అమ్మ సహజతత్త్వం, ధర్మం. పిలువకుండానే పలికే ప్రేమామృత పయోరాశి, కారుణ్య రసాధిదేవత అమ్మ.

కావున మన ఆవేదనలూ అమ్మకి నివేదనలే.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!