అమ్మ తన నివాసంలో మూడో అంతస్తులో మంచం మీద సుఖాసీనయై ఉంది. నిండు నీలం పట్టుచీర, నుదుట ఎర్రని కుంకుమబొట్టు, ముక్కుకు ముక్కెర -ముగ్ధ మనోహరంగా మాతృదర్శనం.
వారిద్దరు నవదంపతులు. వివాహమై నాలుగు రోజులయింది. వధువు తల్లిదండ్రులు వాళ్ళిద్దర్నీ అమ్మ సన్నిధికి తీసుకువచ్చారు.
ఒక పళ్ళెం నిండా తెల్లని మల్లెలు, మరొక పళ్ళెం నిండా పచ్చని మామిడిపండ్లు, ఇంకో పళ్ళెంలో పది కొబ్బరికాయలు, ఒక బుట్టెడు తమలపాకులు, మరొక బుట్టలో పెద్ద పూలదండ, ఒక స్టీలు బేసినులో లడ్లు – అమ్మ మంచం దగ్గర ఉంచారు.
ఆ నూతన దంపతులలు ముందుగా అమ్మ పవిత్ర పాదాలు కడిగారు. తదుపరి గులాబీ రేకుల వలె సుకుమారంగా ఉన్న ఆ పాదపద్మాలకు తమలపాకులతోను, తెలిమల్లెలతోనూ నిండు మనసులతో భక్తి తత్పరతతో పూజ చేసుకున్నారు. చెరొక పక్క పట్టుకుని అమ్మ మెళ్ళో పూదండ వేశారు. కొబ్బరికాయలు, మామిడిపళ్ళు, లడ్లు అమ్మకు నివేదన చేశారు.
కొత్త పెళ్ళికూతురు నుదుట అమ్మ కళ్యాణం బొట్టు, కొత్త పెళ్ళికొడుకు నుదురు మీద పొడుగు బొట్టు పెట్టింది. తన పాదాలు వారు పూజ చేసుకున్న మల్లెపూలను వారి తలల మీద తలంబ్రాలుగా పోసింది. నాలుగు రోజులు నాటి తలంబ్రాల ఘట్టం గుర్తుకు వచ్చిందేమో వారు ముసి ముసి నవ్వులతో మురిసిపోయారు.
పళ్ళెంలో నుంచి ఒక లడ్డు తీసుకుని అమ్మ ఆ అబ్బాయి సగం కొరకేటట్లుగా నోటికి అందించింది. మిగతా సగం ఆ అమ్మాయి చేత తినిపించింది. వారి మనసులను ఏ మధురోహ గిలిగింతలు పెట్టిందో సిగ్గుతెరలు దించుకున్నారు.
వారిద్దరినీ తన దగ్గరగా రమ్మంది అమ్మ. ఎందుకో వారికర్థం కాలేదు. ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. ఏమి సమాధానం లభించిందో అమ్మ ముందుకు వచ్చారు. తలలు రెండూ తన రెండు చేతులతో దగ్గరకు తెచ్చింది అమ్మ. తన మెళ్ళోని పూలదండలు తీసి వారిద్దరి మెడలనూ కలుపుతూ ఆ దండ వేసింది.
ఇద్దరూ కలసి తల ఎత్తారు. విడిపోకుండా వారిద్దర్నీ బంధిస్తూ అమ్మ వేసిన పూలదండ తమ వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు ఇద్దరూ కలిసి అనుభవింతురుగాక ! అని అమ్మ ఆశీర్వచనమా అది !
ఎంత మహదాశీస్సు అది! వారి కంట ఆనందబాష్పాలు జలజలా రాలాయి !
కళ్యాణమూర్తి, వాత్సల్యనిధి – ఆ అమ్మ ఇప్పుడేది?
నూతన వధూవరులను అలా అలరించి, ఆశీర్వదించే ఆ అమ్మ ఇప్పుడేది ?
ఆ అమ్మ ఇక లేదు, భౌతికంగా.
అమ్మ నివాసం వెనుక, ఆరు బయట, మంచం మీద తెల్లని దుప్పటి, అంతకంటే తెల్లని చీరెతో అమ్మ ప్రశాంతంగా, ప్రసన్నంగా కూర్చొని అనంతాకాశంలోకి చూస్తూ ఉన్నది.
తూర్పు ఆకాశాన అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడు అమ్మ నుదుట అరుణ రోచిస్సులు ప్రసరిస్తూన్న కుంకుమ బొట్టును ప్రామాణికం చేసుకొని తన అంచులు దిద్దుకుంటున్నాడు. అమ్మ వెనుకగా, పడమటి ఆకాశాన, వెండి మువ్వలుగా శుక్రుడు వెలుగుతున్నాడు. నీలాల నింగిలో అనేకానేక నక్షత్రాలు.
సంధ్యావందనం పూర్తికాగా ఒక్కరొక్కరే అమ్మకు పాదాభివందనం చేసి వెళ్ళిపోయారు.
ఆ మూలగా. అల్లంత దూరాన, ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చున్నాడు.
“మీరు ! రండి. అమ్మకు నమస్కారం చేసుకోండి” – అని రామకృష్ణ అన్నయ్య పిలిచాడు.
ఆ వ్యక్తి లేచి ముందుకు వచ్చాడు.
డెబ్బై ఏళ్ళపై బడ్డ వయస్సు. వయసును మించినవార్ధక్యం మనిషిని కుంగదీసింది.
ఏ ఊరునుంచి వచ్చారు? – అన్నయ్య అడిగాడు.
గొంతులో నుంచి మాటరావటం లేదు. పెదిమలు కదులుతున్నప్పటికీ, కాళ్ళు తడబడుతున్నాయి. తూలిపడబోయాడు.
అన్నయ్య లేచి, చేయిపట్టుకుని నడిపించి, అమ్మ పాదాల చెంత కూర్చోబెట్టాడు. ఆయన అమ్మ పాదాలను కన్నీటితో అభిషేకం చేశాడు. ఆ అభిషేకమే మూగ అభిభాషణ: బాధ వ్యక్తీకరణ.
“రెండు రోజుల నుంచి అన్నం తినలేదు కదూ – “నాన్నా” ఆ వృద్ధుని ఆకలిబాధ అమ్మ గొంతులో ధ్వనించింది.
అవును – అన్నట్లు ఆ వృద్ధుడు తల ఊపాడు.
అమ్మ అన్నయ్యవంక చూసింది.
అన్నయ్య లోపలికి వెళ్ళి ఒక నిమిషంలో వచ్చాడు.
మరునిమిషంలో వసుంధర అక్కయ్య పళ్ళెం నిండుగా సాంబారు కలిపిన అన్నం తెచ్చి, అమ్మకు ఇచ్చింది.
అమ్మ ఆ వృద్ధుడి నోటికి ఒక ముద్ద అందించింది. రెండు రోజుల నాడు తిన్న అన్నం కదా. ఆవురావురు మంటూ ఒకటి రెండు ముద్దలు తిన్నాడు. ఆ తరువాత ఆకలిని తోసి రాజన్నది అమ్మ ఆదరణ. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించిన తన కన్నతల్లి స్ఫురణకు వచ్చిందేమో.
కళ్ళు నీటికుండలయ్యాయి: కంఠం పూడుకు పోయింది. ముద్ద మింగుడు పడటం లేదు.
. “తిను నాన్నా. ! కడుపులో ఇంకా చాలా ఆకలి ఉంది” బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది గదా!
ఒక్కొక్క ముద్దే అమ్మ ఆ వృద్ధుని చేత తినిపించింది. ఆకలి తీరింది.
తన కన్నీటి కథ చెప్పుకున్నాడు. ఇంటింటి కథే అది!
ఆస్తులకూ, ఆపేక్షలకూ దూరమైన ముదుసలి.
అనాదరణకూ, అవమానానికి గురైన వృద్ధుడు.
ఎవరూ లేని దిగులు చెందకు నాన్నా! ఇక్కడ నీకు అమ్మ ఉంది. అది గుర్తుపెట్టుకో – అమ్మ ఆ వృద్ధుని ఓదార్చింది.
నా అన్నవాళ్ళకు దూరమైన వాళ్ళకు ఆదరణ చూపే ఆ అమ్మ ఇక భౌతికంగా లేదు.
అతను ఇరవై ఏళ్ళ యువకుడు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. వస్తూనే అమ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
“అమ్మా ! మా రిజల్టు తెలిశాయి. యూనివర్శిటీ ఫస్ట్ ప్యాసయానమ్మా ! గోల్డు మెడలు కూడా వచ్చింది. ఇదంతా నీదయేనమ్మా!”
“కష్టపడి చదివావు. ప్యాసయ్యావు. ఇందులో నాదయ ఏమీ లేదు నాన్నా!” కర్తృత్వం తన మీద వేసుకోని అమ్మతత్త్వం అది.
పబ్లిక్పరీక్షలు ఇంకా రెండు, మూడు నెలలుండగా, అతడు అమ్మ దగ్గరకు వచ్చాడు. ఫస్ట్ క్లాస్ రాదేమోనన్న భయంతో, చదువు మీద దృష్టి నిలుపలేకపోతున్నాడు.
అమ్మ అతడికి ధైర్యం నూరిపోసింది. కృషి చేయడం నీ ధర్మం అని నచ్చచెప్పింది.
అలా అభయమిచ్చి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఆ చదువుల తల్లి ఇప్పుడేది ? ఆ అమ్మ ఇకలేదు!
కూతుళ్ళు, కోడళ్ళ పురుళ్ళూ పుణ్యాలకు – మనవ సంతానం రోగాలకూ, రొష్టులకూ – నా జీవిత సరిపూతున్నది అమ్మా ! రామాలేదు, కృష్ణా కృష్ణా లేదు. కాశీరామేశ్వరాలు అంతకన్నా లేవు. ఏమిటమ్మా ఈ జీవితం?
యాభై ఏళ్ళు దాటిన ఒక సామాన్య స్త్రీ ఆవేదన అది!
బిడ్డలకు నీళ్ళు పోస్తుంటే, అది బిడ్డ అనుకోవద్దు. శివునికి అభిషేకం అనుకోండి. పిల్లల ఆలనా, పాలనా చూడటం భగవంతుని ఆరాధనగా భావించండి. కాశీరామేశ్వరాలకు వెళ్తే ఏ పుణ్యం లభిస్తుందో, ఆ పుణ్యం మీకు ఎక్కడున్నా దక్కుతుంది. అందరికీ సుగతే.
అని భరోసా ఇచ్చి, ముక్తిమార్గం చూపిన ఆ అమ్మ.
పిల్లవాడు కన్పించకుండా పోయి పదిరోజులైంది అమ్మా! పేపర్లో వేయించాం, రేడియోలో చెప్పించాం. జాడ తెలియలేదు – ఎక్కడ ఉన్నాడో, అసలు ఉన్నాడో లేడో అని బాధపడే తండ్రికి.
కట్టుబట్టలతో పోలేదు కదా ! వేరే మరి రెండుజతలు బట్టలు తీసుకుపోయాడు కదా నాన్నా! తప్పక తిరిగి వస్తాడు – అని కొండంత ధైర్యం చెప్పే ఆ అమ్మ.
గుంటూరు నుంచి గౌహతికి ట్రాన్స్ఫర్ చేశారమ్మా! నెలకొక సారాయినా నిన్ను చూడనిది ఉండలేని నేను అంతదూరంలో ఎలా ఉంటానమ్మా! తలచుకుంటేనే మనసు వికలమయిపోతున్నది – అని వాపోయే ఉద్యోగికి – చిన్నతనంలోనే కోల్పోయిన కన్నతల్లిని అమ్మలో చూచుకుంటున్న ఆ చిరు ఉద్యోగికి.
నీవింకా నయం నాన్నా! ఈ దేశంలోనే ఉన్నావు. భర్తతో లండన్ వెళ్ళిన నీ చెల్లి సంగతేమిటి? అని వాస్తవాన్ని ఎత్తి చూపి, జీవితంలోని కష్టసుఖాలని సమభావంతో అనుభవించటం నేర్చుకోమని చెప్పే ఆ అమ్మ.
ఇక లేదు !
అవును –
ఆ అమ్మ ఇక లేదు – అన్న తలపు ప్రతి ఒక్కరి మనసుకూ ములుకులాగా గుచ్చుకుంటున్నది. అది తప్పదు.
కాని –
ఇప్పుడు ఆ అమ్మ – ఇంతవరకు మనం చూసిన రూపంలో లేకపోవచ్చు. ఆలయంలో, శ్రీ అనసూయేశ్వరా లయంలో మరొక రూపంలో, మనకు కన్పించని రూపంలో, మరింత తేజస్సుతో వెలుగుతున్నది.
జీవితంలో దగాపడిన బిడ్డలు, జీవన సమరంలో విజయం చేజిక్కించుకున్న బిడ్డలు –
ఇకమీదట ఆలయంలోని అమ్మకు తమ కష్టనష్టాలు విన్నవించుకొని ఉపశమనం పొందుతాడు; తమ సుఖసంతోషాలు చెప్పుకుని ఉల్లాసం చెందుతారు.
ఈ సత్యం భవిష్యత్తులో మన అనుభవంలోకి ఆలయంలోని అమ్మ తీసుకువస్తుందనేది సత్యం.