ఆమె: అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెదమ్మ: సురారులమ్మ కడుపాఱడి వుచ్చినయమ్మ, దన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ. దుర్గ మా యమ్మ కృపాబ్ది, యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
ఆమె: అట విజయ వాటిక నున్నది, అమ్మల (త్రిశక్తుల) గన్నయమ్మ, కనకదుర్గమ్మ.
ఈమ: ఇట అర్కపురం వాటిక నున్నది, అమ్మల (త్రిమూర్తుల) గన్నయమ్మ అనసూయమ్మ.
ఆమె: చాల పెద్దమ్మ (అందరినీ గన్న పెద్ద తల్లి)
ఈమె: చాల ఆదెమ్మ లేదా ఆద్యమ్మ (ఆది + అమ్మ) ఆద్య అంటే దుర్గ, పార్వతి అని కూడా అర్థం వుంది.
ఆమె: సురారులమ్మ కడుపాఱడి వుచ్చెడి యమ్మ (రాక్షస మాత ‘దితి’గర్భమును వ్యర్ధము చేసిన అమ్మ)
ఆమె: ఆ సురారులనే తన గర్భమున దాచుకొని సార్ధకులను చేసిన అమ్మ. దన్ను లో నమ్మిన వేల్పుటమ్మల (దేవతా మాతల మనంబున నుండెడియమ్మ, దుర్గమ్మ తనను నమ్మిన, నమ్మని వారందరినీ తన మదిన నిలిపెడి రాజరాజేశ్వరి.
ఆమె – కృపాబ్ధి (దయాసముద్రము).
ఈమె – కృపాబ్ధిజ (ఆ దయాసముద్రమున ఉదయించిన) మహాలక్ష్మి, గాయత్రి.
ఆమె :యిచ్చుత (ఇచ్చును) మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ (కవిత్వము నందు శబ్దములకు, అర్ధములకు సార్ధక్యము అను సంపదలు నిచ్చును.)
ఈమె – పంచును, మహత్వ, మాధుర్య, మాతృత్వ దయామృతమ్.
ఆమె – అన్నపూర్ణ, మల్లేశ్వరుని ధర్మపత్ని.
ఈమె – నిరతాన్నదానేశ్వరి, నాగేశ్వరుని అర్ధాంగి,
ఆమెది దుష్టశిక్షణ
ఈమెది – దుష్టత్వ శిక్షణ.
కనుకనే, ఈమె –
అయ్యల గన్నయమ్మ, ముగురయ్యల మూల పుటమ్మ, చాల ద్యమ్మ; సురారులంగూడ తన కడుపునందిడు కొని మార్చెడి యమ్మ, దన్ను నమ్మిన, నమ్మని వారి నందరిని తన్మదిన నిలిపెడి యమ్మ, అనసూయ మా యమ్మ, కృపాబ్ధిజ, పంచును, మహత్వ మాధుర్య మాతృత్వ దయామృతమ్.
అందుకనే – ఈ యిద్దరమ్మలూ ఒకే నాణెమున కిరువైపులా నుండి రెండు బంగారు బొమ్మలు !