సద్గురు శ్రీ శివానన్దమూర్తిగారు అన్నారు “రాక్షసులు తపస్సుచేసి వరాలు పొందారు. శక్తి కావాలని, ఒకరిని అంతంచేయాలని, జయించాలని. దైవదర్శనమ్ అయినా వాళ్ళలో ఏ మార్పు వచ్చింది? నశించారు. లోకహితం కోసం ఎవరైతే తపస్సు చేశారో వారిని ఇలవేలుపుగా ఆరాధిస్తుంది. లోకం” అని. కనుకనే –
‘విద్యావివాదాయ ధనం మదాయ శక్తిః పరేషాంపరిపీడనాయ |
లస్యసాధోర్విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ ||’
– అన్నారు. ఉదాహరణకి హిరణ్యకశిపుడు ఘోరతపస్సుచేసి బ్రహ్మదేవుని మెప్పించి ‘గాలిన్ కుంభిని… మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే’ అని కోరుకున్నాడు. ఆ షరతులకు అంగీకరిస్తూ ‘తధాస్తు’ అన్నాడు బ్రహ్మ. భగవత్సాక్షాత్కారం అయినా ఏమీ పరిణామం రాలేదు. లోక కంటకుడై మరణించాడు. అంతే. మరొక కోణంలో పోతనగారు ‘చక్రచ్ఛిన్నశిరస్కుడై మునివచశ్శాపావధి ప్రాప్తుడై చక్రించెందెను వాడు పార్శ్వచరుడై సారూప్యమార్గంబునన్’ అన్నారు. కాగా లోకరహితంకోరి తపస్సు చేసిన బుద్ధ భగవానుడు, రమణమహర్షి వంటి మహామహితాత్ముల్ని ఇలవేలుపుగా లోకం పూజిస్తుంది.
మన కళ్ళ ముందు లోకహితం కోసం తపస్సు చేసింది హైమక్కయ్య. ‘తపసా బ్రహ్మవిజిజ్ఞాసస్వ’ అని నిర్దేశించింది వేదం. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి తపస్సే ఏకైక మార్గం. జగన్మాత అమ్మను లక్ష్యంగా పెట్టుకొని సాధకులకి ఆదర్శంగా ‘ఎప్పటికైనా నీవే తప్ప ఇంకేమీ లేకుండా ఉండగలనా?’ అని తపించింది. బుద్ధ భగవానునిలా’ ఏవిధంగా జీవుల వేదనలు నశించి శాంతి కలుగుతుంది? అని మధనపడింది. మన ఆవేదనల్ని అమ్మకి నివేదనచేసే సోదరి నివేదిత హైమ. ఒక ఉదాహరణ. ఒకసారి రాజుపాలెపు శేషగిరిరావుకి, వారి తల్లికి ఒకేసారి మశూచి మహమ్మారి సోకింది. వాళ్ళ ఊపిరిని కబళించబోయింది. అప్పుడు హైమ అమ్మ పాదాలు పట్టుకుని ‘అన్నయ్యను బ్రతికించు, బ్రతికించు’ అని కన్నీరు మున్నీరుగా విలపించింది. తక్షణం అమ్మ అంగీకరించింది. ఆ వ్యాధి దుష్ప్రభావాన్ని తాను భరించి ఆ తల్లీ బిడ్డలకి పునర్జన్మని ప్రసాదించింది.
ఇక్కడ ముఖ్యాంశము హైమ ప్రార్ధించినది ఇతరుల కన్నీటిని తుడవటానికి. పరమార్థమే స్వార్థం అక్కడ. కనుకనే అమ్మ అంగీకరించింది.
‘అమ్మా! ఒక్కసారి మావైపు చూడు.
నీ చూపులే ఇహపరముల తోడు’ – అంటూ హైమక్కయ్య అమ్మ పాదాలమ్రోల ఆర్తితో దీనంగా పాడేది, ప్రార్థించేది, పోట్లాడేది. అమ్మ దయార్ద్ర దృక్కులు ఎవరిపై ప్రసరిస్తాయో వారికి భోగమోక్షాలకి కొదవలేదు. సకల జీవకోటి ప్రతినిధిగా అమ్మను అభ్యర్థించేది. హైమలోని ఈ లోకోత్తర గుణవైభవాన్ని వివరిస్తూ .
‘జ్ఞాన సంపాదనే హైమా మహాక్లేశముపాగతా ।
తత్కృతౌ జ్ఞాన వాశిష్ఠచరితం భాసతే స్మృతా ॥’ అన్నారు. పరమ దయాళవుహైమ వేదనా పరితప్త హృదయ స్థితిని తెలుసుకోవాలంటే సహవేదన కావాలి; కనుకనే తానూ అనుభవించింది. ఒక ఉదాహరణ :
ఆంగ్లభాషలో ‘Thought’, ‘Thoughtfulness’ అనే రెండు పదాలున్నాయి. అంధుడు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అని ప్రశ్నిస్తే, కళ్ళు ఉన్నవాడు ఊహించి చెప్పవచ్చు. ఈ భావనని ‘Thought’ అని అంటారు. కళ్ళకి గంతలు కట్టి నాలుగు రోజులు ఉంచితే ఆ సమస్యలు అనుభవంలోకి వస్తాయి. ఆ భావనని ‘Thoughtfulness’ అంటారు.
జన్మప్రభృతి హైమ క్లేశాల్ని అనుభవించింది; అధిగమించింది. శ్రీరావూరి ప్రసాద్ సహధర్మచారిణి అయిన చి.ల.సౌ. శేషప్రభావతి ఆ రోజుల్లో హైమతో కలిసి సాయం సమయంలో మొదటి ఒరవ (culvert) దాకా వెళ్ళి వస్తూండేది. సోదరి శేషు తలనెప్పి జ్వరంతో బాధపడుతూండేది. హైమక్కయ్య కూడా అంతే. హైమ శేషుబాధ గురించి వివరంగా అడిగేది; సరాసరి అమ్మదగ్గరకి వెళ్ళి శేషు అనారోగ్యం గురించి చెప్పి దిగులుపడేది. ఆ కరుణారస హృదయ స్పందనయే దైవత్వం.
ఈ సందర్భంగా మరొక మాట చెప్పుకోవాలి.
“బాధలు జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి” అంటుంది అమ్మ.
‘ఎండ మావులైన లేని ఎడారి వోలు బ్రతుకులోన యిసుకతుఫానును కోరే
ఆశకలదు మాసిపోదు’ అనేది అమ్మ సహజ సహన గుణతత్త్వ స్వరూపం. అమ్మ యొక్క ఈ విలక్షణ విప్లవాత్మక ప్రవచనాన్ని విన్న వెంటనే మన గుండెల్లో రాయి పడుతుంది, కాళ్ళ క్రింద నేల కంపిస్తుంది, మన అల్పత్వం సుబోధక మౌతుంది. కాగా తన అనుంగు బిడ్డలకి భరించలేని స్థితి రానివ్వదు. అమ్మ. తన పొత్తిళ్ళలో పొదివి పట్టుకొని ఆపదల నుంచి రక్షిస్తుంది; “రక్షణ అంటే కంట్లోదిగే ముల్లు కాలిలో దిగటం” అని చల్లగా వివరిస్తుంది.
హైమతత్వం వేరు. క్లేశలేశాన్ని కూడా చూసి సహించలేదు. ఆ మూర్తి దయగల హృదయం – దైవనిలయం. “ఎవరు ఎక్కడ ఉన్నా హాయిగా ఉండాలని నేను నీకు నమస్కారం చేసుకుంటానమ్మా” అనేది అందరమ్మతో. ఇదే ‘ఎవరైతే లోకహితం కోసం తపస్సు చేస్తారో వారిని ఇలవేలుపుగా ఆరాధిస్తుంది లోకం’ అనే శ్రీ శివానన్దమూర్తిగారి ప్రవచనసారం.
నిత్యకృత్యంగా ఒకసారి హైమక్కయ్య అమ్మ దగ్గరకి వెళ్ళి అంజలి ఘటించి “అమ్మా! వాళ్ళ (ఫలానా సోదరీ సోదరుల) బాధ తీసెయ్యరాదూ!” అని అర్థించింది. అందుకు అమ్మ “నీవే తీసెయ్యొచ్చుగా! నా దాకా ఎందుకు?” అని అడిగింది. అనతికాలంలో లోక కళ్యాణార్థం హైమను దేవతగా ప్రతిష్ఠించింది. అమ్మ తన మాటను ఆచరణలో చూపింది. విశ్వశ్రేయస్సాధనకి హైమని సరియైన ఉపకరణంగా ఎన్నుకుంది.
కామితార్థ ప్రదాయినిగా, అద్వైత సిద్ధిదాయినిగా హైమక్కయ్య నానా కేశవిశీర్ణ జీర్ణ హృదయాలని, జీవితాల్ని గట్టెక్కిస్తోంది. శ్రీ మధు అన్నయ్య, శ్రీ పి.ఎస్.ఆర్. అన్నయ్య, శ్రీ రావూరి ప్రసాద్, శ్రీ వై.వి. సుబ్రహ్మణ్యం, నేను.. ఇంకా ఎందరెందరో హైమాలయంలో ప్రదక్షిణలు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టుకుని మొక్కులు తీర్చుకుని మనోవాంఛాఫలసిద్ధిని పొందారు, పొందుతున్నారు. లోకహితం కోసం తపస్సు చేసిన హైమవతీదేవి, మన తోబుట్టువు, ఇలవేలుపు.