కొన్ని సంఘటనలు జీవితాంతం మరువలేనివిగా ఉంటాయి. అలాంటిదే మీతో పంచుకొంటాను.
1979లో నేను విశాఖపట్నం హిందుస్థాన్ జింక్ లో పని చేస్తూ ఉన్నాను. అక్కడనుంచి అమ్మ దగ్గరకు వచ్చే సోదరీసోదరులందరూ నాకు సన్ని హితులయ్యారు. సామూహికంగా పూజలు, ఇతర సంస్థాపరమైన కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళము. తరచుగా మాలో కొంతమంది కలిసి జిల్లెళ్ళమూడికి వెళ్ళేవాళ్ళం.
అలాగే నేను, ఇంకొక సోదరుడు కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళాలని ప్రోగ్రాం వేసుకొన్నాము. ఆయన విశాఖ సిటీలో ఉండేవారు. నేను సిటీకి దూరంగా గాజువాకలో ఉండేవాడిని. అందుకని నేరుగా స్టేషన్లోనే కలుసుకొందామని నిర్ణయంచుకొన్నాము.
ప్రయాణం రోజు ఉదయం ఆయన నాకు ఫోన్ చేసి “నేను అమ్మకి చీర సమర్పించుకోవాలని అనుకొన్నాను. అందుకని ఇప్పుడు మార్కెట్కి వెడుతున్నాను” అని చెప్పారు. వెంటనే నేను అయితే “నాకు కూడా ఒక చీర తీసుకోండి. దాని ఖరీదు రేపు జిల్లెళ్ళమూడిలో ఇస్తాను” అని చెప్పాను.
జిల్లెళ్ళమూడి చేరిన తర్వాత ఎవరి దారి వారిది, ఎవరి బిజీ వారిది అని మీకు తెలుసుకదా ! అందువల్ల కొన్ని గంటలు మేము కలుసుకోలేదు. సరిగ్గా నేను అమ్మ దర్శనానికి అమ్మ గది బయట వేచి ఉండగా ఆయన హడావుడిగా వచ్చి అమ్మకోసం నేను తెమ్మని చెప్పిన చీర పాకెట్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు.
నేను వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి చీర సమర్పిందామని పాకెట్ విప్పాను.ఆ చీర చూసి నేను నిర్ఘాంతపోయాను. ఆ చీర ఏమీ బాగా లేదు. అది చాలా చవకరకం, very poor quality గా ఉంది. నేత కూడా దూర దూరంగా ఉంది. ఇలాంటి చీరనా నేను అమ్మకు ఇచ్చేది అని చాలా బాధపడుతూ, కన్నీళ్లు ఉబికి వస్తూండగా “అమ్మా ఈ చీర ఏం బాగా లేదమ్మా, నేను ఇవ్వలేను. నేను కొనలేదు, నేను చూడలేదు. ఆయన చేత తెప్పించాను” అని చెప్పాను. ఫర్వాలేదు నాన్నా, ఇలా ఇయ్యి.” అంది అమ్మ.
“వద్దమ్మా! ఇది నీకు బాగుండదు. నేను ఇవ్వలేను” అని అంటుండగానే అమ్మ ముందుకు జరిగి, నా చేతిలోంచి చీరని తీసుకొంది. ఇంక నేను ఏం చేయగలను ? అమ్మ లోపలికి వెళ్ళిపోయింది.
ఒక ఐదు నిమిషాల తరువాత అమ్మ నేను తెచ్చిన ఆ చీరనే కట్టుకొని వచ్చి మంచంమీద కూర్చుని చీర కొంగు వెడల్పు గా చేసి నాకు చూపిస్తూ “బాగుంది నాన్నా, చాలా మెత్తగా, హాయిగా ఉంది, తడిపితే నేత దగ్గరకు అవుతుంది” అని అంది.
ఆ ప్రేమకి వాత్సల్యానికి తట్టుకోలేక కన్నీటి ధారలతో అమ్మ పాదాలపై వాలిపోయాను.
అమ్మ కేవలం మన మనస్సుని, ప్రేమని మాత్రం చూస్తుంది. విలువలు కాక వినియోగం చూడాలని, పెట్టుపోతలలో ప్రేమే గాని, ఖరీదు ముఖ్యంకాదనీ ఆచరణాత్మకంగా అమ్మ మనకు నేర్పుతోంది అనిపించింది.
అవును. “తల్లికి బిడ్డే సొమ్ము కదా!” అది నాకు అనుభవం అయింది.
జయహోూ మాతా.