జగజ్జనని అమ్మ ఈ అవనీతలంపై నడయాడిన అరవైమూడు సంవత్సరాలు పుడమితల్లికి ప్రతిరోజూ పండగే. అనేకమంది పుణ్యాత్ములు అమ్మతో ప్రత్యక్షంగా దర్శన, స్పర్శన, సంభాషణల మహాయోగం పొందగలిగారు. అమ్మ అనేకమందితో మాట్లాడిన సందర్భాలలో కొన్ని సృష్టి రహస్యాలు వెల్లడించిన సందర్భాలు కూడా వున్నాయి. అమ్మ ద్వారా ప్రత్యక్షంగా అవి విని ఆ సంభాషణలని యధాతథంగా భద్రపరచుకున్న అదృష్టవంతులు వున్నారు. అవి నిజంగా వేదవాక్యాలే!
ఉదాహరణకు సృష్ట్యాది నుండీ ఎవరూ నిర్దిష్టంగా సమాధానం చెప్పలేకపోయిన కొన్ని ప్రశ్నలలో “చెట్టు ముందా? విత్తు ముందా?” అన్న ప్రశ్న ఒకటి వున్నది.
ఒకానొక సందర్భంలో మన ప్రియతమ స్వర్గీయ సోదరుడు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ అమ్మతో సంభాషిస్తూ పై ప్రశ్న అడిగారు. అమ్మ నిర్ద్వంద్వంగా “చెట్టే ముందు నాన్నా” అని సమాధానం చెప్పటం విశేషం. ఆ సమాధానాన్ని సహేతుకంగా, సోదాహరణంగా వివరించటం ఇంకా విశేషం.
“ప్రతిదీ పంచభూతాలలో నుంచే వస్తుంది నాన్నా! పేడ తీసుకువచ్చి ఒక మూల వెయ్యి. రెండు, మూడు రోజులకి పేడలో పురుగు వస్తుంది. దానికి తల్లి కానీ, వేరే ఆధారం కానీ లేదు. పురుగు దాంట్లోంచి పుట్టుకు వచ్చింది. బియ్యం డబ్బాలో పోసి మూత పెట్టు. 10 రోజులు అయేటప్పటికి దాన్లోంచి తెల్లని పురుగు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తోంది? ప్రతిచోటా ఈ పంచభూతాల సమ్మేళనం వల్ల అక్కడ ఒక చెట్టుకాని, క్రిమిని దానంతట అదే పుట్టుకొస్తుంది. తరువాత దానికి గింజలు పుట్టి వ్యాపించ వచ్చు. విజ్ఞాన పరంగా ఇవాళ మనం అన్నిటినీ రూపుమాపగలుగుతున్నాం. మరొక కొత్తరకం పురుగు పుడుతోంది. ప్రపంచంలో దాని మూలం (తల్లి) వుంటే కదా అది పుట్టాలి? ఏమంటే మొట్టమొదటి సృష్టి భగవంతునిది. కాబట్టి చెట్టే ముందు నాన్నా!” అని అమ్మ వివరించింది.
ఒకచోట తేమ, ఒకచోట గాలి, ఒకచోట వేడి, ఒకచోట వెలుతురు, ఒక చోట కేవలం మట్టి (మట్టిలో కూడా మిగిలిన నాలుగు భూతాలూ వున్నాయి). దానికి తగ్గ క్రిమి పుడుతుంది. పూర్వం పంట చేలో కలుపు తీసేవారు. ఇప్పుడు మందు చల్లితే రెండు మూడు ఏళ్ళదాకా కలుపు మొక్కలు పెరగవు. తర్వాత మళ్లీ పెరుగుతాయి. అంటే సహజంగా సృష్టి జరుగుతుంది”.
తల్లి లేని తల్లి, చదువురాని తల్లి, చదువుకోని తల్లి ఇంతటి క్లిష్ట సంశయాలని ఇంత తార్కికంగా ఎలా వివరించగలిగిందీ? అంటే దానికి సమాధానం ఒకటే!
“ఈ సృష్టి అనాది – నాది” అనగలిగిన జగన్మాతకే సాధ్యం!
(అమ్మ ఇచ్చిన వివరణ శ్రీ రావూరి ప్రసాద్ గారి సేకరణ “అమ్మతో అనుభవాలు” గ్రంథం 8వ భాగం నుండి గ్రహింపబడింది)