అంతరంగాన్ని మించిన అధ్యాపకుడు లేడు. కాలాన్ని మించిన గురువు లేడు.
లోకాన్ని మించిన సద్గ్రంథం లేదు.
జీవితాన్ని మించిన వేదాలు లేవు.
దైవాన్ని మించిన మంచి మిత్రుడు లేడు.
జ్ఞాపకాలను మించిన శాస్త్రాలు లేవు.
ఇంత స్పష్టంగా వేదాన్ని, వేదాంతాన్ని, జీవితాన్ని, అభేదంగా అద్వయంగా, సమన్వయంగా దర్శించిన వారే, దర్శన మార్గం సూచించగలరు. చూపించగలరు. నడిపించగలరు.
“భోజనం చెయ్యండి! చేశారు కదా!” అన్న సంజ్ఞాపూర్వక, వాక్పూర్వక ఆదరంతో అందరినీ దగ్గరకు చేర్చుకున్న అమ్మ, జగత్తు కిచ్చిన ఉపదేశం ఏమిటి? ఉపదేశం పొందాలన్న మిషతో ప్రారంభమైన ప్రశ్నోత్తర మాలిక, అమ్మ అసలు మిషన్కు అంకురమైంది. తదనంతర కాలంలో ఆ ఉపదేశం సమస్త ప్రపంచానికీ మార్గదర్శనం చేయించింది. అమ్మకు ఉపదేశం యివ్వాలనుకున్న వారే కడకు, అమ్మ నుండే ఉపదేశం అందుకున్న తీరే పరమాద్భుతం!
ఇద్దరు స్త్రీమూర్తుల మధ్య సాగిన విచారణా ప్రవాహమే, ఈ జగత్తుకు మహోూపదేశమై మిగిలింది. త్రేతాయుగంలో అగస్త్యుల వారు శ్రీరాముడికి ఉపదేశించినది ఆదిత్యహృదయం.
ద్వాపరలో యోగీశ్వర కృష్ణుడు అర్జునునకు ఉపదేశించినది భగవద్గీత.
కలికాలంలో యిద్దరు కలికి స్వరూపాల మధ్య సాగిన సందేహ నివారణమే, అమ్మ అందించిన ఉపదేశ ప్రసాదం.
కాలం ఒకటే. అనుభవాలు వేరు. సాయంసంధ్య ఏర్పడేది ఒకేసారి. అది కాలబద్ధం. వివిధ గృహాలలో దీపాలు వెలిగేది మాత్రం భిన్న సమయంలో. అవి కర్తవ్య, కారణ పరిధికి సంబంధించిన అంశం. అవన్నీ అనుభవాలకు పరిమితమైనవి.
దైవసంకల్పం కాదు. సంకల్పమే దైవం. సంకల్పం మనోధర్మం కాదు. చేతోమధనం నుండి బయటపడేది సంకల్పం. చేతన ఆంతరంగికం. అనేక స్థితులను దాటి సంకల్ప రూపంలో వెలువడే శక్తే, సంకల్పం. ఆ సంకల్పం నిస్వార్థమైనప్పుడు, జగత్తుకు మంగళదాయిని అవుతుంది. బలంగా, దృఢంగా, విస్తృతంగా, సర్వశ్రేయోదాయకంగా రూపుదాల్చి సార్వకాలికమౌతుంది. పదుగురికి అక్కరకొచ్చింది కనుక సంకల్పమే దైవం. దేనినీ విడిగా చూడనిది, అన్నీ తెలిసినా తెలిసినట్లు ఉండనిదీ, అన్నీ తానైనది, తానేమీ కానిది, ప్రత్యేకంగా లేనిది…. యిదే జ్ఞానం. ఇది నాశమెరుగనిది. ఈ స్థితి అక్షరం. అది మార్పెరుగనిది, జరుగుతున్న అన్ని మార్పులకు సాక్షిగా వుండేది, జ్ఞానం, ఆది, అంతం ఎరుగనిది. నిత్య, సత్య శాశ్వతమైనది. అదే సత్యం, జ్ఞానం, అదే అనంతం. అదే బ్రహ్మ.
అనగా అనగా మాటే మంత్రమౌతుంది. ఆ మంత్రమే మనసును ఒకే స్థాయిలో నిలబెడుతుంది. స్థాయిలో మనసు అచలమౌతుంది. ఈ స్థితిలో మంత్ర అవసరం వుండదు. ఈ స్థితి ఏర్పడేవరకు అనేవాడు, వినేవాడు విడివిడిగా వుంటారు. ద్వంద్వంలో కలిగేవన్నీ, కనబడేవన్నీ అసంపూర్ణాలు, అర్థసత్యాలు, అదంతా నివేదనే కాని, వేదాంతం కాదు.
వేదాంతం బోధించేదంతా వైరాగ్యమే. వైరాగ్య మంటే నిజస్థితి. మనం వేరు, దైవం వేరు అనుకోవటం అపరిపక్వమే.
భిన్నం కాదనుకోవటమే రాగరహిత స్థితి. చివరకు అదే వేదం. అంటే తెలుసుకోవలసినది.
ఒకే స్థితిలో వున్న యిద్దరు కనిపిస్తున్న వైనం భిన్నం, సాధన, సాధకుడు, సాధ్యం అవే కర్త, కర్మ, క్రియ అంటున్నాం. దైవం మూడింటి యందున్నందున అంతా కర్తే! విచిత్రమేమిటంటే, కర్తృత్వం లేని దైవం, అన్ని పనులకు కారణమౌతున్నాడు. కర్తవ్యమున్న జీవుడు, నిస్సహాయంగా చూస్తూ మిగిలిపోతున్నాడు.
శాస్త్రమంటే ఆచారమా, సాంప్రదాయమూ, అలవాటా, జ్ఞాపకమా, తనంతట తాను ఏర్పడినదా? ఎవరైనా వ్రాసినదా? శాస్త్రం స్థిరమా? జాతి, మత, కుల, వర్గ, వర్ణ, అవసరాలన్నిటినీ శాస్త్రం నడిపించగలదా? మారుతున్న సమాజ పోకడలకు, శాస్త్రాలకు పొంతన వున్నదా? బహుశా శాస్త్ర గత సంగతులు అయా దేశకాల పరిస్థితులకు అన్వయించుకుంటే తప్ప, ఆచరించి అనుభవిస్తే తప్ప అనుభూతి పొందితే తప్ప, శాస్త్రాల పూర్ణత్వం, సమగ్రత్వం అర్థంకాదు, కాబట్టి శాస్త్రాలు వల్లె వేసుకోటానికి కాక, సర్వజనులూ ఆచరించవలసిన విధివిధాన, సంవిధాన సంప్రదాయా లన్న మాట.
నీకు ఏ దేవుడంటే యిష్టమని ప్రశ్నించటమే లోపభూయిష్టం. ఉన్నదంతా దైవమే అనుకోమని సనాతన ధర్మం చెబుతున్నది. ఉన్నదంతా బ్రహ్మమే అనటంలోనే సమన్వయమున్నది.
చేసేదే కర్మకాదు. చూసేది, గీసేది, రాసేది, అనుకునేది, అంటున్నది, వింటున్నది, అంతా కర్మే! కదలికలు, మెదలికలు అన్నీ కర్మలే. ప్రకృతిలో సంభవించే ప్రతి మార్పూ కర్మే!
ఒకే అమృతంలోంచి వెలువడినవన్నీ పంచామృతాలే. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, తన్మాత్రలు, పంచకోశాలు….. యివన్నీ ఒకే మూలం నుండి వచ్చినవే. ఆ మూలమే ఆత్మ! ఆత్మకు వాడు-వీడు, ఇదీ అదీ, అక్కడా యిక్కడా అంటూ లేవు. అంతా తానై, అన్నీ తానై వుండటమే దాని స్థితి. నిదానవతీ ఉపాసనలో పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి అంటూ వీటన్నింటికీ మూలం పాలనీ, చరమం నెయ్యనీ అనుభవిస్తున్నాం. అంతా ఒకటే అయినా దాన్నే అనేకంగా భిన్న రుచులలో చవిచూస్తున్నాం.
మనం ఏ పనిచేసినా లోకోత్తరంగా వుండాలి. మనల్ని ఎవరో మెచ్చుకోవటం కాదు. అందరూ మెచ్చే రీతిలో, అందరికీ నచ్చే రీతిలో మనం పనిచేయాలి. ప్రయత్నం అందించే ఫలితం అందరికీ చెందాలి. అందరూ ఆనందించాలి.
పాపం పండటమంటే, యికపై చేయటానికి పాపం లేకపోవటమే. ఇకపై వుండబోతున్నదంతా పుణ్యమే. మనసున్నంతసేపూ పాపం – పుణ్యం అంటూ వుంటాయి. హృదయం నడిపించటం ప్రారంభం కాగానే యీ రెండూ వుండవు. వర్ణ భేదంలేని చైతన్యమే అన్నిటినీ నడిపిస్తుంది. ఇక స్పర్ధ ఎక్కడుంది? ఉన్నదంతా ఆనందమే. కనిపిస్తున్నదంతా బ్రహ్మాండమే.
పుట్టారన్న సంతోషం, పురుడు రూపంలో పట్టుకుంటున్నది. పోయారన్న దుఃఖం, మైల రూపంలో పట్టుకుంటున్నది.
మనిషిని సుఖదుఃఖాలే పట్టుకుంటున్నయ్. అన్ని స్థితులలోనూ మనిషి తనను తాను పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి. అది ప్రధానం.
తృప్తిని, హాయిని, శాంతిని యిచ్చేది మంత్రం, ధ్యేయాన్ని స్మరించటమే ధ్యానం; తనకంటే భిన్నంగా ఉన్న వాడు దైవం అనుకుంటూ వున్నంతకాలం, అది అసాధ్యం; జరిగిన మరుక్షణం, అదే సాధ్యం;
సుఖ సంతోషాలు ద్వంద్వం! ఆనందం ద్వంద్వాతీతం!!
అమ్మ ప్రకటించిన ఈ మహా పరిసత్యాలన్నీ వేద ప్రామాణికాలు. యదార్థవాదాలు. తెరలెరుగని సత్యాలు.
ఈ మాటలంటున్నపుడు అమ్మ వయసు 26 వసంతాలు. వింటున్న రాజమ్మకు అంతకు మూడింతల వయసెక్కువ.
జ్ఞానికి వయసున్నదా?
విశ్వజనీనము, సార్వకాలికము, కాలాతీతం జ్ఞానం అయితే, జ్ఞానీ అంతే!
( శ్రీ వి.యన్. ఆర్. మూర్తి గారి గ్రంథం ‘అమ్మత్వం’ నుండి గ్రహించబడినది.)