తే పదం వేదవిద్యాగిరో:
భాషా దేశ సముద్భవాః
చందాంసి, సప్తస్వరాట్
తాళాన్, పంచమహా ధ్వనిన్
ప్రకటయతి ఆత్మ ప్రసారేణ
యత్ తత్ బీజం,
పద వాక్య మానజనకం, శ్రీమాతృకే !
అద్భుత జన్మ ఎత్తిన అమ్మ ఐతరేయ ఉపనిషత్తు బోధించిన అండ, పిండ, బ్రహ్మాండధారిణి, ఆరంభమూ తానే, అంతమూ తానే! మమకార మహాకారిణి.
నూరేళ్ళుండాలి, కలసి వుండాలి, ఆవలి పెను వెలుగును అంతటా చూడాలి. చింతన చేయాలి అని వివరించిన ఈశావాస్యం అమ్మ !
‘నేను నేనైన నేను’ అని ప్రకటించటం, ముండకోపనిషద్వాఖ్య.
అంతా ఆత్మకదలికే, ఉన్నదంతా ఆత్మే, ఇప్పుడే – ఇక్కడే అన్నీ పొందవలసి వున్నదన్నపుడు, అమ్మ కేస బద్ధత్వం వదుల్చుకుని బుద్ధత్వంలోకి ప్రవేశించమని బోధించినపుడు, అమ్మ శ్వేతాశ్వతర!
లోకమంతా ప్రణవమేనని, శబ్ద నిశ్శబ్దాలు వ్యక్తావ్యక్తాలని; నామం ద్వారా నామిని పట్టుకోమని, స్మరణ వేళ నామే నిన్ను పట్టుకుంటాడన్నపుడు అమ్మ మాండూక్యం. మండోదరి. నిత్య కళ్యాణి !
‘అన్నాన్ని పెంచు, పంచు, అపేక్షించు, ఉపేక్షించకు’ అని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు మూలమైన అన్నం పరబ్రహ్మ స్వరూపమని నిరూపించినపుడు, తైత్తరీయం.
జ్ఞానం కోసం తీవ్ర సాధన చేయాలి. ఓంకార ధ్యానంతో ఆత్మానుభూతిని పొందాలని సమాధానపరచిన ప్రశ్నోపనిషత్ అమ్మ!
సద్విచారణలో జీవించాలని, ఉన్నదంతా మనలోపలే వున్నదని, మృత్యుభయాన్ని జయించాలని, మరణానికి ముందు తర్వాత సైతం మనం దేహులమని, అనంతరమూ అఖండ చిల్డ్రనరసమైన ‘ఆత్మ’ అని ఎరుకపరచినపుడు, అమ్మ కఠః
అమ్మని అమ్మ అనటమే సహజం. అనసూయ, రాజరాజేశ్వరి, జగజ్జనని, మాతృశ్రీ, విశ్వజనని… యిట్లా ఎన్ని విధాల పిలుచుకున్నా ఆమె అమ్మ! ఇల్లు, పిల్లలు, భర్త, ఇటు అటు బంధువర్గం ఇదంతా కలిపితే వ్యక్తి కుటుంబం. కుటుంబం అనగానే ఈతులు – యాతనలు, రాగాలు రోగాలు, కలిమి – లేమి, బాధలు – బంధువులు… ఇవన్నీ తప్పవు. ఎవరూ తప్పించుకోలేరు. పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, మళ్ళీ మళ్ళీ గుమ్మడి పాదులా విస్తరించే జీవితం. ఇటువంటి జీవితం సర్వసాధారణం.
అయితే ప్రపంచంలో వుంటూనే లోకాతీతమైన ఆత్మానుభవాన్ని పొంది, దొరక పుచ్చుకొని, నిలబెట్టుకొని, మళ్ళీ తామరాకుల నుండి జారిపడని ఆనందాంబువుగా, ముత్యంలా, మెరిసే వజ్రంలా, ఘనీభవించిన ఐంద్రీ మహావిద్యా స్వరూపిణిగా, అవ్యాజ కారుణ్యమూర్తిగా, జగదానందకారిణిగా, అద్వైత భావనాకారిణిగా, అన్నమయ కోశానికి ముద్దలందించిన చిత్ప్రనమణిగా, అమ్మగా, అంతాగా, అన్నీ ఈ ప్రపంచం ఉయ్యాలై, జీవులంతా బిడ్డలై, వారి లాలకు, లాలనకు, లాలికి మూలమై, జగత్పాలినియై, జగన్మధ్యయైనది. అమ్మ! అమ్మ అంటే జిల్లెళ్ళమూడి అమ్మే!
గుంటూరు జిల్లా, బాపట్ల సమీపం, ఆమె ఎంచుకున్న కార్యస్థలం! జిల్లెళ్ళమూడి గ్రామం!
ఆశ్రమం గృహస్థాశ్రమం!
ఆశ్రయం సర్వలోకాలకు!!
ఎవరి అనుభవమో, మనది కాదు.
మనం దక్కించుకున్నదే మనది.
అనుభవం లేకపోతే నమ్మకం కలగదు. నమ్మకం లేని సాధన ‘గంగిరెద్దు నడక, గానుగెద్దుల ఆట వంటిది.
12 సంవత్సరాల వయస్సులో ‘ఆమెను’ మొదటిసారిగా జిల్లెళ్లమూడిలో చూశాను. ఆమె కూచున్న చోట. మంచం! ఆ మంచం చుట్టూ నలుగురైదుగురు. ఆమెను చూడటానికి అమాయకంగా, ఆతృతగా, వెళ్ళబోతున్న నన్ను ఒక పెద్దాయన, “యిక్కడే ఉండు బాబూ! తర్వాత పంపిస్తా” అన్నాడు. ఈయన ఇంకా లోపలికి వెళ్లకముందే “వాణ్ణి తీసుకురా, నేనే పిలుచుకున్నా” అన్న మాటలు వినిపించినయ్. ఈ పెద్దాయన ఆశ్చర్యంగా “రా బాబూ” అంటూ లోపలికి తీసుకు వెళ్ళాడు.
అదుగో! అప్పుడు చూశాను ఆమెను! మంచం మీద కూర్చున్న ఆమెను. పండగల్లో, పేరంటాల్లో పట్టుచీర కట్టుకుని, ఎప్పుడూ నవ్వుతూనే వున్న మా అమ్మమ్మలా ఉంది. పచ్చ చామంతిలాగా, పసుపు ముద్దగా, కుంకుమ పువ్వులా వుంది. అమ్మమ్మ మనసులోకి రాగానే, కళ్ళవెంబడి కన్నీరు కారడం ప్రారంభం అయింది. అప్పుడామె నన్ను దగ్గరకు తీసుకుని, తన పక్కనే వున్న పన్నీరు బుడ్జి తీసుకుని, నెత్తిమీద జల్లుతూ” కన్నీరు – పన్నీరు రెండూ ఒకటే. రెండూ నీళ్ళే. నీ అమ్మనూ నేను, నీ అమ్మమ్మనూ నేనే” అంటూ చక్కెరకేళీ ఒలుస్తూ “పైన కనిపించేది తీస్తే తప్ప, లోపలున్నది కనిపించదు. ఆ కనిపించింది తింటే తప్ప ఆకలి తీరదు. ఆకలి తీరితే గాని ఆత్మారాముడికి శాంతి లేదు” అంటూ పండు తినిపించటం మొదలు పెట్టింది. పండు కోసం చేయి చాపుతుంటే “నోట్లో పెట్టడమే అమ్మకు యిష్టం, నోరు తెరు” అన్నది.
“అవును! ఎన్నిసార్లు చదువుతావురా! హనుమాన్ చాలీసా నువ్వు!” అంటూ “రఘువరదాసు దయ అంతా నీ మీద” అన్నది. పండు తినిపిస్తున్నపుడు మళ్ళీ మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. అంటే
ఆమె బ్రతికే ఉంది. కానీ దూరంగా వుంది. అందుకు ఆమె గుర్తొచ్చింది.
“ఎక్కడికీ వెళ్ళకు, వచ్చిందే నా కోసం. ఒక్కడివే వచ్చావు. భయం లేదా? మధ్యాహ్నం అన్నం తిని వెళ్ళు” అన్నది. మధ్యాహ్నం అయ్యేదాకా ఆమె దగ్గరే వున్నాను. ఆమె కాసేపు మాట్లాడడం. మరి కొంతసేపు మౌనం. ఆమె మాట్లాడుతున్నంత సేపూ నిశ్శబ్దం. ఆమె మౌనంగా వున్నంతసేపూ ఎన్నో మాటలు.
ఇంతలో ఆకలి వేళ? ఆమె ముద్దలు కలిపి నోట్లో పెడుతున్నది, మళ్ళీ అచ్చం మా అమ్మమ్మలాగే! ఆమె వేళ్ళు, నా నోట్లో ఎంగిలవుతున్నయ్యను కున్నాను. పైకి అనలేదు. “బ్రహ్మ ముట్టనిదేమన్నా వుందా! ఎంగిలి కాని దేమున్నది, అయిందే మున్నది. తల్లికి కావలసింది. ‘గిలి’. ఆ గిలి కోసమే యిదంతా”, అమ్మ ఆగి, “సాయంత్రం కల్లా బయలుదేరు” అన్నది.
ఆమెను చూసిన తొలివేళ అది. బయలుదేర బోయేముందు మళ్ళీ ఆమె గదిలోకి వెళ్ళాను. ఆమె కూర్చున్న మంచం, విశ్వసింహాసనం లాగా వుంది. బాసిం పెట్టుకుని కూర్చున్న తీరు “సింహాసనేశ్వరి” యైన త్రిపుర సుందరిలాగా వుంది.
అరుణారుణంగా తీర్చిన నుదుటి కుంకుమ, ఉదయాద్రిన మొలిచిన భానుబింబంలాగా వుంది. రెండు చేతులా ధరించిన, నిండుగాజులు, శబ్దం బ్రహ్మలై ఆమెను ఆశ్రయించినట్లున్నయ్. ఆమె కట్టిన పట్టుచీర, అష్టదిక్కులు ఆమెను చుట్టుకున్నట్లుంది.
“నువ్వు నా కోసం, నేను నీ కోసం’ అంటూ ఆమె ద్రాక్ష పళ్ళ గుత్తిని చేతులో పెట్టింది. పది రూపాయల నోటు యిచ్చింది. మంచం దిగింది. బయటకు వచ్చింది; సాగనంపింది.
ఇంతకీ, బయట వున్న నన్ను చూడకుండానే నన్ను లోపలికి రమ్మన్నదే! అమ్మ, అమ్మమ్మ నేనే నంటూ, పెరిగింది అమ్మమ్మ దగ్గర అన్నదే? అమ్మలగన్న అమ్మ అమ్మమ్మే కదా!
హనుమాన్ చాలీసా ఎన్నోసార్లు చదువుతానని ఆమెకు ఎవరు చెప్పారు? రఘువరదాసుగారు అనబడే అవధూతేంద్ర సరస్వతీ స్వామి దయ వల్ల నాకు చాలీసా వచ్చిందని ఆమెకెలా తెలుసు? నేను ఒంటరిగా వచ్చినట్లు ఆమెకు ఎలా తెలుసు?
ఆమెకు అన్నీ తెలుసని తర్వాత తెలిసింది. ఎన్నో అనుభవాలు. అవన్నీ తరువాత!
ఆమెను ‘చూడాలని’ వెళ్ళి, దర్శించాను. చూడటం వేరు, దర్శించటం వేరు కదా!!
ఆమె, ఆమె అన్న మనసు మరెన్నడూ ‘ఆమె’ అనలేదు, ‘అమ్మ’ అనటం మానలేదు.
సర్వాలంకార భూషితయై, త్రిశూలధారిణిగా తరువాత కాలంలో దర్శనమిచ్చిన ‘దేవీ’ రూపం కంటే, ఒడిలో పడుకోబెట్టుకుని. ముద్దలు తినిపించిన అమ్మే నా గుండెలో నిలిచిన యిష్టమయిన, అందమైన బంగారు బొమ్మ!
‘అమ్మ’ అనే బంధం కంటే, ఆమెను దేవతను చేసి, వేరుగా చూసే సంబంధం ఎంత చిన్నది! ఇంత జరిగినా ‘అమ్మ’ కాళ్ళకు అందరిలాగా దణ్ణం పెట్టలేదు.
అమ్మ ఒడిలో పడుకున్న నాకు, అమ్మను నాకంటే వేరుగా చూడటం నాకు యిష్టం కాలేదు.
అమ్మ, పుట్ట తేనె!
అమ్మ, ఆనంద సౌందర్యం!
అమ్మ పూర్ణాద్వైతం !
అమ్మ అంటే నేను !
‘నేనంటే’ అమ్మ’
పరిమిత రూపమూ, అనంత శక్తీ, పూర్ణమాతృత్వం కలబోసుకున్న అవ్యాజ కారుణ్య త్రివేణీ సంగమం అమ్మ.
అమ్మ ఉపాసనామార్గంలో ఉన్నదంతా పూర్ణాద్వైతమే. శంకరులు, భగవాన్ రమణులు ప్రతిపాదించిన పూర్ణాద్వైత సాధనకు అమ్మ జీవితం ఒక దివ్య ఉదాహరణ.
కర్మాద్వైతం, ఉపాసనాద్వైతం, జ్ఞానాద్వైతం, వైరాగ్యాద్వైతం, మోక్షం నిండుగా పరచుకున్న శతపత్ర జీవితం అమ్మది. అదీ ఉన్నది గనుక. అది జ్ఞానాద్వైతం.
సంసారం ఉన్నది గనుక అది కర్మాద్వైతం.
సర్వ దైవోపాసన ఉన్నది గనుక అది ఉపాసనాద్వైతం.
సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇదంతా నివృత్తిమార్గం.
ఏదీ శాశ్వతం కాదని ఒక భగవద్భావనే శాశ్వతమని బోధించినందున అమ్మది వైరాగ్యాద్వైతం.
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః
సన్యాస యోగాత్ యతయః
శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే
పరామృతాత్ పరిముచ్యంతి సర్వే.