ఆరేళ్ళప్రాయంలో అమ్మ ఒక స్వామివారి ఆశ్రమానికి 30 రోజులు వరుసగా వెళ్ళింది. వారు సకల శాస్త్రపారంగతులు, పీఠాధిపతులు, పురాణ ప్రవచనంలోనూ వేదాంత విచారణలోనూ ప్రసిద్ధులూను.
అమ్మలోని తేజస్సు, వర్చస్సు, అలౌకికతలకు కదలిపోయి ఉండబట్టలేక స్వామివారు 31వ రోజున తానే అమ్మను పలకరించారు. ఆనాటి ప్రసంగవశాన అమ్మ “ఇది ఉపాధ్యాయుడు లేని బడిగా ఉన్నది. కాని ఉపాధ్యాయుడు లేని దానిని బడి అనటం నాదే పొరపాటు” అన్నది.
ఉప = సమీపే; అధ్యయతి ఇతి ఉపాధ్యాయః; విద్యార్థితో అధ్యయనం చేసేవాడు ఉపాధ్యాయుడు. ఈ సత్యాన్ని స్పష్టం చేస్తూ N.C.E.R.T. Director Dr. Rajput ‘Learning with the children’ అని ఒక గ్రంథాన్ని వెలువరించారు. విద్యాభ్యాసం అనేది B.A./M.A/D.Litt./M.Litt. ల సముపార్జనతో సమాప్తి కాదు. అభ్యసనం అనేది Learning Continuum ఊపిరి విడిచే వరకూ కొనసాగేది.
సరే – ‘ఉపాధ్యాయుడు లేని బడి’ అని అనటంలో అర్థం ఏమిటి? ఆ స్వామిజీ అనుదినం పురాణప్రవచనం చేస్తున్నారు. అయినా, అది ఉపాధ్యాయుడు లేని బడి. ఎందువలన? ఆధ్యాత్మిక సంస్థల్లో, పాఠశాలలు కళాశాలల్లో సాధారణంగా ప్రవచనం / బోధన ఒక వైపే (One way) ఉంటుంది. బోధించటమే కాని అభ్యసనం ఉండదు. ఉపాధ్యాయశిక్షణలో Theories of Learning అని చెప్తారు. 100 మంది విద్యార్థుల అభ్యసన స్థాయిలు 100, విధానాలు 100. ‘ఏనాటికీ ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయికి దిగి బోధించలేడు’ – అనేది నా నిశ్చితాభిప్రాయం.
ఆర్షవిజ్ఞానం మరొక సత్యాన్ని ఆవిష్కరించింది-
‘ఆచార్యాత్ పాద మాధత్తే పాదం శిష్యః స్వమేధయా ।
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ ॥’- అని. విద్యార్థి, ఉపాధ్యాయుని నుండి నేర్చుకోనేది 25%, తనంతటగా నేర్చుకునేది 25%, తోటి సహాధ్యాయుల నుండి నేర్చుకునేది 25%, మిగిలిన 25% జీవితాంతము – అని.
ఉపాధ్యాయుని ప్రవర్తన, పోకడ ఎలా ఉండాలో అమ్మ ఆచరణలో దర్శించవచ్చు. సాధారణంగా ప్రశ్నలను సంధించి సమాధానాన్ని రాబడుతుంది. దీనిని Socratic Method అని అంటారు. (అమ్మ జ్ఞాన స్వరూపిణి. మాటలతో నిమిత్తం లేకుండా కేవలం తన సంకల్పమాత్రం చేతనే జ్ఞాన ప్రసారం చేయగలదు. అది నా అనుభవం) మూలానికి పోతే –
అమ్మ ఒక సందర్భంలో – “ఒకరి మనస్సు మరొకరికి ఎవరికీ అర్ధం కాదు. కనీసం మార్గదర్శకుల మనీ, గురువుల మనీ అనుకుని బోధ చేసే వారికి కూడా మనస్సుని గుర్తించలేని స్థితి ఉంటూనే ఉన్నది. ఇదే భిన్నత్వం అంటే. అసలు మనస్సు తెలిసినప్పుడు బోధ లేదు” – అని వివరించింది.
అమ్మ చరిత్రలో బోధనాభ్యసన ప్రక్రియకి దర్పణం పట్టే కొన్ని సందర్భాలు :-
అమ్మ : దేవుడు ఎక్కడ పుట్టాడు?
సుబ్బారావుగారు : గుళ్ళో ఉన్న విగ్రహాలా?
అమ్మ : విగ్రహాలంటే దేవుడు కాదా?
సుబ్బారావు గారు: కాకేం! కాకేం! దేవుడే.
***
సోదరుడు: వేదాలు పౌరుషేయాలా? అపౌరుషేయాలా?
అమ్మ: వేదం అంటే ఏమిటి, నాన్నా?
సో: తెలుసుకోవటం
అమ్మ: తెలుసుకున్నపుడు (వేదాలు పౌరుషేయాలా, అపౌరుషేయాలా? ఈ ప్రశ్న ఉండదు.
***
అమ్మ : కృష్ణుడు భగవంతుడే కదా. భగవంతునికి గూడా దుర్మార్గులున్నారా? అన్నీ తనలో నుండే వచ్చినయ్ గదా!
చిదంబరరావు గారు : ఏమిటో పురాణాలు దుష్టశిక్షణ, శిష్టరక్షణ అని రెంటినీ చెపుతూనే ఉన్నాయి.
అమ్మ : రాముడు గూడా అట్లాగే చెప్పాడా?
చిదంబరరావుగారు: లేకేమమ్మా, ఆయనకూ దుష్టశిక్షణ, శిష్టరక్షణ రెండూ ఉన్నాయి.
అమ్మ : భగవంతుడుగా పూజింపబడే వారిలో యింతవరకూ ఎవరయినా ఆ ద్వంద్వం లేనివారున్నారా?
చిదంబరరావు గారు : ఇప్పటికి రాలేదు – ఇక వస్తారేమో తెలియదు.
***
అమ్మ : సృష్టి ఎవరిచేత ఏర్పడ్డది?
చిదంబరరావు గారు : అంతా లీల అంటున్నారమ్మా.
అమ్మ : అంటే ఒకడుగా ఉండి ఒకడే ఆడుకుంటున్నాడనా? వాడెవరు?
చిదంబరరావు గారు : (మౌనం వహించారు.)
అమ్మ : కర్త, కర్మ, క్రియ – మూడూ ఒకటేగా? కర్మ, క్రియ, కర్తలోవే.
***
అమ్మ : భగవంతుడంటే నామరూపాలు ఉన్నాయా? అతనికి సంకల్పాలున్నాయా, లేవా?
చిదంబరరరావు గారు : శాస్త్రాలు నామరూపరహితుడనీ, సంకల్పరహితుడనీ అంటున్నాయి.
అమ్మ : అన్నిరూపాలూ ఆయనే కావటం చేత ఆయనకు వేరే రూపం లేదు గనుక రూపం లేనివాడనా? అందరి సంకల్పాలూ ఆయన సంకల్పమే గనుక ఆయనకు వేరే సంకల్పం లేదనా? ఆయన సంకల్పరహితుడు కాదు. సంకల్పసహితుడు. ఆయనది సంకల్ప రహితమయిన సంకల్పం.
ఆ విధంగా అమ్మ విధానం – ప్రశ్నలు వేస్తూ, లోచన రేకిత్తిస్తూ, సత్యాన్వేషణ దిశగా అడుగులు వేయిస్తూ, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో – ఉంటుంది.
కనుకనే, ఉపాధ్యాయ శిక్షణ రంగంలో పూర్వం అమలులో ఉన్న ఉపాధ్యాయ కేంద్ర బోధన (Teacher fronted Education) స్థానే విద్యార్థి కేంద్ర బోధన (Pupil fronted Education) ని అమలు చేశారు. అందుకు భిన్నంగా ఉంటే అది ‘ఉపాధ్యాయుడు లేని బడి’ అవుతుంది.
అమ్మ .
ఆచార్యునివలె ఆచరించి చూపిస్తుంది, గురువువలె జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది,
ఉపాధ్యాయునివలె ఇచ్చి వుచ్చుకునే ధోరణిలో బోధిస్తుంది. శ్రీ దక్షిణామూర్తి ఆయి, అగోచరార్థ విజ్ఞానాన్ని పరమ సత్యాన్ని మాటలతో కాకుండా, కేవలం జ్ఞాన ప్రసారం ద్వారా అనుగ్రహిస్తుంది.
“తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే”