‘ఉపవాసం అంటే నిరాహారంగా ఉండటం’, ‘ఉపాసన అంటే ఆరాధన’ అనేది సామాన్యార్థం. తత్వతః – ఇష్టదైవం సన్నిధిలో ఉండటం ఉపవాసం, ఇష్టదైవాన్ని తన వద్ద ఉంచుకోవడం ఉపాసన.
అంటే – మనం వెళ్లి అమ్మ వద్ద ఉండటం ఉపవాసం, అమ్మ వచ్చి మన వద్ద ఉండటం ఉపాసన. శ్రీమద్రామాయణపరంగా చెప్పుకుంటే లక్ష్మణుడు చేసినది ఉపవాసం; భరతుడు చేసినది ఉపాసన. లక్ష్మణుడు ప్రత్యక్షంగా శ్రీరాముని సేవించాడు; భరతుడు శ్రీరామ పాదుకా పట్టాభిషేకం చేసి ఒక సేవకునిలా ఆరాధించాడు.
ఉపాసన, లేక ఉపవాసం చేయడానికి హేతువు ప్రగాఢమైన బంధం. అది జిల్లెళ్లమూడి పరంగా మరింత వైభవాన్నీ, రామణీయకతను సంతరించుకుంటుంది మనకి అమ్మ ఆరాధ్యమూర్తి, మనం అమ్మకి ఆరాధ్యమూర్తులం మరి ఉపాసకులెవరు? ఉపాస్యులెవరు? అది మాతాశిశు మహనీయ మమకార బంధ విశేషం.
‘రసోవైసః’ – అంటుంది ఆప్తవాక్యం. అంటే – ఆ మూలకారణ శక్తి కంటె సర్వోన్నతమైనది, సర్వోత్కృష్టమైనది, పరమగమ్యమైనది, సుందరమైనది, ఆనంద దాయకమైనది, అనన్యశరణ్యమైనది, కారుణ్య విలసితమైనది వేరే లేనే లేదు అని.
అమ్మ ప్రత్యక్ష సన్నిధిలో ఉంటూ రహి, రెడ్డి సుబ్బయ్య, ప్రభావతి అక్కయ్య, కొమ్మూరు డాక్టర్ గారు, అధరాపురపు శేషగిరిరావుగారు, రాచర్ల లక్ష్మీనారాయణగారు, యార్లగడ్డ రాఘవయ్యగారు, గోపాల్ అన్నయ్య, భాస్కరరావు అన్నయ్య వంటిసోదరీ సోదరులు, ‘సరగున నీ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారలు’, ఎందరో మహానుభావులు ఉపవాసం చేశారు; చేస్తున్నారు.
దేశ విదేశాల్లో దూర సుదూర ప్రాంతాల్లో ఉంటూ కూడా డా॥ శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారు, టి. రాజగోపాలాచారిగారు, Gordon Westerlund, బ్రహ్మాండం రంగశాయి, జేమ్స్, ఢిల్లీ ఉషక్కయ్య వంటి సోదరీ సోదరులు అమ్మను తమ మనో మందిరాల్లో ప్రతిష్ఠించుకుని మూర్తీభవించిన సేవారూపాలుగా ఉపాసన చేశారు; చేస్తున్నారు. ‘హరిగుణమణిమయ సరములు గళమున శోభిల్లు అట్టి భక్తకోటులు ఎందరో ఉన్నారు.
వీరంతా అమ్మ సన్నిధిలో దర్శన, స్పర్శన, సంభాషణాదులచే కోకొల్లలుగా ప్రత్యక్ష అనుభవాలు పొందినవారే; పుక్కిట బంటిగా అమ్మ దివ్య వాత్సల్యామృతాన్ని తనివితీర ఆస్వాదించి పరవశించిన వారే. మొదటి వర్గం: వారిది ఉపవాసం; రెండవ వర్గం వారిది ఉపాసన.
కాగా సంప్రదాయ బద్ధంగా ఉపాసన, ఉపవాసం అనేవి ఉపాసకుని పద్ధతి, దీక్ష. అమ్మ విధానమే వేరు. ‘అమ్మ’ పరంగా ఆరెండూ అమ్మకే వర్తిస్తాయి. బిడ్డలు నిమిత్త మాత్రులే. ఇరు మార్గాల్లో కర్తృత్వం అమ్మదే. వివరిస్తాను.
ఒక సోదరుడు ‘అమ్మా! నీదర్శనం కోసం ఎన్నో ఏళ్ళ నుంచి రావాలనుకున్నాను; ఇవాల్టికి రాగలిగాను’ అంటే, అమ్మ “రావాలని నువ్వు అనుకున్నావు కానీ నేను అనుకోలేదు” అన్నది. అంటే అమ్మ సంకల్పం, అనుమతి తోనే అమ్మ దరిచేరుతున్నాం, ఆ దివ్యసన్నిధిలో అలౌకిక ఆనందాన్ని, జన్మసాఫల్యాన్ని పొందుతున్నాం. ఇది ఉపవాసం.
బిడ్డ ఎక్కడ ఉంటే అమ్మ కరావలంబం, రక్షాకవచం అక్కడే. అది ఉపాసన. కొన్ని ఉదాహరణలు.
సో॥ రామరాజు కృష్ణమూర్తిగారు ఒకసారి గుంటూరులో ఆత్మహత్యకు పాల్పడి కరెంటు తీగెలు పట్టుకున్నారు. ఆ సమయంలో జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ బలంగా తన చేయి విదిలించింది. వారు ప్రమాదం నుంచి బయట పడ్డారు. అపుడు అమ్మ జిల్లెళ్ళమూడిలో ఉన్నట్టా ? గుంటూరులో ఉన్నట్టా?
ఒకసారి పాలకొల్లు ఆడిటర్ గోపి (శ్రీ కాశీనాథుని రాజగోపాల కృష్ణమూర్తి) గారింట్లో దొంగలు పడ్డారు. వారిని కట్టి వేసి మారణాయుధాలచే బెదిరించి సొమ్మును అపహరించుకు పోయారు. ఆయన భయవిహ్వలులైనారు. ఆసమయంలో జిల్లెళ్ళమూడిలో నిద్రిస్తూన్న అమ్మ “నాన్నా! గోపీ ! భయపడకు” అని, వారిని గట్టున పడవేసింది. తర్వాత వారు జిల్లెళ్ళమూడి వచ్చినపుడు “నాన్నా! ప్రాణనష్టం కలగలేదు కదా! సొమ్ము పోతే మళ్ళీ సంపాదించు కోవచ్చు” అన్నది. ఆ విపత్కర సమయంలో అమ్మ జిల్లెళ్ళమూడిలో ఉన్నట్టా? పాలకొల్లులో ఉన్నట్టా?
శ్రీమహావిష్ణువు “నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే రవౌ! మద్భక్తా: యత్రగాయన్తి తత్ర తిష్ఠామి నారద॥ అన్నారు నాడు. నేడు కారుణ్యావతార మూర్తి అమ్మ “తల్లి అంటే తరపింజేసేది” అని స్వీయ మాతృధర్మ లక్ష్యాన్ని స్పష్టం చేసింది. ఆపదలో కాపాడుతుంది, జనన మరణ ఘోర భవబంధాల నుండి తరింపచేస్తుంది; దాటిస్తుంది; విముక్తి కలిగిస్తుంది. అదే అమ్మ చేసే ఉపాసన.
అమ్మ అనన్య సామాన్య అనురాగం, అనుగ్రహం నాడు ఎలా ఉందో నేడూ అలాగే ఉంది, రేపూ అలాగే ఉంటుంది. అమ్మ దివ్య ఆశీ:ప్రసారానికి, అప్రతిహతమైన శక్తి తరంగ ప్రవాహానికి శరీరంతో నిమిత్తం లేదు. కార్తీక దీప ప్రభవలె అనవరతం అన్ని దిక్కులా ప్రసృతమౌతుంటాయి. “దర్శనమ్” ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఎడిటర్ సో॥ ఎం.వి.ఆర్. శర్మ, సంపాదక వర్గ సభ్యులు సో॥ ప్రసాదవర్మ కామఋషి అమ్మను భౌతికంగా చూసి ఉండ లేదు అమ్మ సాహిత్య ప్రచురణలు, రచనలు పరంగా వారి సేవలు శ్లాఘనీయములు. వారి గుండెల్లో అమ్మ కొలువై ఉన్నది. అదే ఉపాసన. మరొక్క ఉదాహరణ.
ది. 9.2.2015 తేదీన కెనడా నుంచి శ్రీ కోటేశ్వరరావు అనే ఒక యువకుడు మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చాడు. అతను Software Engineer – Team Leader, పుట్టుక, విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్లోనే. కెనడా పౌరసత్వం ఉండటం వలన Indian Visa మీద వచ్చి అమ్మ దర్శనం చేసుకున్నాడు. శ్రీ వై.వి. శ్రీరామమూర్తి, శ్రీ విశ్వజననీ పరిషత్ – ప్రధాన కార్యదర్శి వారికి అన్ని సౌకర్యాలు కలిగించారు. ఆలయ సందర్శనం, పూజాదికములలో పాల్గొనటం వంటివి. అనంతరం అమ్మ ఆలయంలో అమ్మ ఆశీఃపూర్వకంగా ఆయనకు నూతన వస్త్రాలను ఇచ్చారు: జిల్లెళ్ళమూడి అంటే ఆదరణ, ఆప్యాయత అని ఆచరణలో చూపారు. అతడు అమ్మ ఫొటోలు, సి.డి.లు, సాహిత్యం కొనుగోలు చేశాడు. అమ్మ నడయాడిన అడుగడుగునూ ఆనందంతో వీక్షించి ‘అమ్మ అనురాగతరంగ ‘స్పర్శ అనుభవమైంది’ అన్నారు. జిల్లెళ్ళమూడి వదలి, ఆటో ఎక్కే సమయంలో గుప్పెడు మట్టిని ఒక సంచీలో పెట్టుకుని ‘అమ్మ సంచరించిన పవిత్ర భూమి ఇది. మా పూజా మందిరంలో ఈ పవిత్రమైన మట్టిని పెట్టుకుంటాను’ అన్నాడు. తాను ఒక ‘కోటి రూపాయలు బ్యాంకులో Fixed Deposit గా చేసి, ప్రతినెలా వచ్చే వడ్డీని అమ్మ సేవా సంస్థల నిర్వహణకు పంపాలి’ అనేది కోటేశ్వరరావు
అమ్మ దృష్టి, అమ్మశక్తి, అమ్మ హృదయం, అమ్మత్వం, అమ్మతత్వం, అమ్మప్రేమ, అమ్మలాలన పాలన అగ్రాహ్యములే.