“రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిం
నమామి శిరసాదేవం కినో మృత్యుః కరిష్యతి”
– శివలీలలు
క్షీరసాగర మధనం జరుగుతున్నది. ముందుగా ‘గరళం” ఉద్భవించింది. దానిని ఎలా ఎదుర్కోవాలో దేవతలకు, రాక్షసులకు అంతుబట్టక శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు, దేవతలు రాక్షసులతో కలసి కైలాసం వెళ్ళి మహాశివుడ్ని ప్రార్థించారు. వీరి ప్రార్ధనను మన్నించి శివుడు ఆ గరళాన్ని మింగి ‘గరళ కంఠు’డై క్షీరసాగర మథనం కొనసాగేటట్లు అను గ్రహించాడు.
సాధారణంగా ‘అమ్మ’కు తన అవసరం కంటే బిడ్డల భోజనమే ముఖ్యం. ఒకనాడు అమ్మకు కడుపులో మంట వచ్చింది. వసుంధర అక్కయ్య మజ్జిగ ఇచ్చింది. మంట తగ్గింది. మరొకనాడు రాత్రి మళ్ళీ అమ్మకు కడుపులో మంట వచ్చింది. వసుంధర అక్కయ్య మజ్జిగ ఇస్తానన్నది. “వద్దు. అదే తగ్గుతుందిలే. ఏవేళ ఎవరు వస్తారో వాళ్ళకు ఆ మజ్జిగ ఉంచు” అన్నది అమ్మ.
అలాంటి అమ్మ ఒకరోజు అన్నపూర్ణాలయంకు కబురుచేసి మజ్జిగ తెమ్మంది. సోదరుడు శేషయ్యగారు స్వయంగా మజ్జిగ ఒక మగ్గుతో తెచ్చి అమ్మ వద్ద ఉంచి వినయంగా నిలబడ్డాడు. అందరు ఆశ్చర్యంగా చూస్తుండగా అమ్మ ఎత్తి ఆ మొత్తం మజ్జిగ తాగి వేసింది. ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య “అమ్మా ! అంత మజ్జిగ తాగి వేశావేమిటమ్మా?” అని ఆ మజ్జిగ చుక్క ఒకటి నోట్లో వేసికొని “అమ్మ మజ్జిగ చాలా పుల్లగా ఉన్నాయి గదమ్మా! ఈ మజ్జిగ ఎలా త్రాగవమ్మా” అని లబలబలాడాడు. శేషయ్యగారు కూడా చాల బాధతో “నీకని చెబితే తియ్యని మజ్జిగ తెచ్చేవాడినికదమ్మా” అన్నాడు.
వెంటనే అమ్మ “ఈ మజ్జిగ ఇలా అన్నపూర్ణా లయంలో ఉంటే ఎవరో ఒకరు తాగుతారు. ఇంత పుల్లని మజ్జిగ త్రాగితే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మొత్తం నేనే తాగేశాను” అన్నది.
మరొకనాడు పోతుకూచి సావిత్రి అక్కయ్య రేగుపండ్లు అమ్మకు నివేదన చేసింది. ఆ రోజుల్లో ఆవరణలో అందరూ జలుబులతో జ్వరాలతో బాధపడ్తున్నారు. అందువల్ల మామూలుగా ఆ పళ్ళను అందరికి పంచకుండా ఆ పళ్ళన్నిటినీ తానొక్కతే తింటూ “ఇవి మీకు పెడితే మీరు తింటారు. మీ అందరికి జలుబుతో జ్వరాలు వస్తాయి. కనుక నేనే తింటున్నాను” అని చెప్పింది పరమదయాళువు అమ్మ. ఆ గరళకంఠుడే మన అమ్మ.
అందుకే
“ఎంత మంచిదానవోయమ్మా!
నీదెంత మంచివిధానమోయమ్మా !” అని పాడుకున్నాడు “రాజుబావ”.