1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఎందుకో… ఈ రాక!

ఎందుకో… ఈ రాక!

Uppala Varalakshmi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : May
Issue Number : 10
Year : 2022

‘ఎవ్వరో ..ఈ అమ్మ!

ఎందుకో.. ఈ రాక’

అన్నపల్లవి పాటల పల్లకిలో పయనిస్తూ – ఎద లోతులను తాకింది ఏనాడో! తీరం చేరని నావలా తుదిమొదలు లేని పయనంలా సాగే జీవనగమనంలో నాతో నేను మాట్లాడుకునే సన్నివేశాలు అరుదే అని చెప్పాలి. ఇన్నాళ్ళుగా – ఇన్నేళ్ళుగా అంతశ్చేతనలో ఉ న్న ఈ పల్లవి అమ్మ శ్రీచరణ స్పర్శతో రాగరంజితమైన చరణమై అక్షరగవాక్షాలలోనుండి తొంగిచూస్తూ ఆశల విరిజల్లులు కురిపిస్తోంది. వాత్సల్యామృతాన్ని వర్షించే అమ్మ కంటి కొసలలోని కారుణ్యరేఖలు స్వానుభూతిలో ప్రతిఫలించి మనోనభస్సులో మరో హరివిల్లును అవిష్కరిస్తున్నాయి. అవ్యక్తమైన ఈ ఆనందహేలను అభివ్యక్తీకరించేందుకు మాటలు చాలవే ఎలా? ఇది తరుణం అన్న అంతర్వాణి ఆదేశాన్ని శిరసావహిస్తూ అక్షరరూపిణిగా అంతరంగంలో కొలువుతీరిన తేటమాటల తల్లి పదమంటి ప్రార్థిస్తూ.. ఉపక్రమిస్తాను.

శతవసంతాలనాటి సామాజిక చిత్రాన్ని మనోయవనికపై పర్యాలోకనం చేస్తే సంప్రదాయవేత్తలు అనుకునే వారిలోకూడా మితిమీరిన మూఢ విశ్వాసాలు, కులమత భేదాలు, వర్గ సంఘర్షణలు, బాల్యవివాహాలు, నిరక్ష్యరాస్యత అస్పృశ్యత వంటి సాంఘిక దురాచారాలతో ఆర్థిక అసమానతలతో మానవ సంబంధాలు ఛిద్రమై సమతుల్యతను కోల్పోయిన సామాజిక జీవనం పతనోన్ముఖంగా పయనిస్తున్నవేళ భావస్వాతంత్ర్యం కోల్పోయిన జాతి నిర్వీర్యమై నిస్తేజమై నిద్రాణమై అంధానుసరణంగా సాగిపోతున్న దశలో అమ్మ వేగుచుక్కయై సమాజానికి దిశానిర్దేశం చేసింది. అరుణోదయ ప్రభలతో అంధకారాన్ని పటాపంచలు చేసి వినూత్న చైతన్యదీప్తులతో సమస్త విశ్వాన్ని జాగృతంచేసింది. కనుమరుగవుతున్న మానవతా విలువలను పునరుద్ధరించి మంచిని మించిన మహిమ లేదని నిరూపించింది. వసుధైక కుటుంబ భావనతో ఎల్లలులేని ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించి నవశకానికి నాంది పలికింది. ఒక దృక్పథంతో సమీక్షిస్తే – ‘అమ్మ అవతరణం ఒక సామాజిక అవసరం’ అనిపించక మానదు.

అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు అయిన కలియుగ మానవులను ఉద్ధరించటానికి తల్లి ధర్మం నిర్వర్తించటానికి ప్రేమను ఆయుధంగా చేపట్టింది. సమతామమతలే ఉచ్ఛ్వాసనిశ్వాసాలుగా దివ్య మాతృత్వమే దివినుండి భువికి దిగివచ్చింది. పంచకృత్య పరాయణ అయిన జగదధీశ్వరి సమాజ సంక్షేమం కోసం కారుణ్యవారాశియై కరచరణాదులతో కదిలివచ్చింది. సమస్త ప్రాణికోటిని వాత్సల్యామృత వాహినిలో ఓలలాడించి ప్రతి ఎదను మమతల గర్భగుడిగా మలచాలనీ సమాజాన్ని వర్గంలేని స్వర్గంగా రూపొందిచాలనీ అమ్మ సంకల్పం. ఆశయ సాధనలో వ్యక్తి నిర్మాణం ద్వారా సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. సమాజమంటే అమ్మ దృష్టిలో మానవ సమాహారం మాత్రమేకాదు. ఆబ్రహ్మకీటజననికి సమస్తప్రాణికోటి బిడ్డలేకదా! “కంటేనే కాదు కనుగొంటేనూ బిడ్డలే”నని “మీరంతా నా బిడ్డలే కాదు నా అవయవాలు కూడా” అని మనందరితో తాదాత్మ్యాన్ని ప్రకటించింది.

సంస్కరణ అంటే మంచివైపు మరలించటం అస్త వ్యస్తమైన ఆలోచనలను, విరుద్ధంగా తోచే భావాలను దారితప్పిన ప్రవర్తనలను చక్కదిద్ది అవగాహనను పెంపొందించటం. సంకుచిత భావాలతో స్వార్థ చింతనతో తనమనస్సే తనకు శత్రువు కాగా సంక్షుభిత సాగరంలా మారిన మనిషి హృదయతాపాన్ని చల్లార్చి ప్రశాంత సుందర సరోవరంలా రూపొందించటం ఇది మనిషి మనుగడకే కాదు సమాజ సంక్షేమానికీ అత్యావశ్యకం. మనిషి వైజ్ఞానికంగా సాంకేతికంగా ఎంతప్రగతిని సాధించినా సమన్వయం, సామరస్యం సౌహార్దం లోపిస్తే సాగించిన పురోగమనం తిరో గమనంగా పరిణమించక తప్పదు అనటానికి గత చరిత్రయే తార్కాణం.

సహనం, త్యాగం వంటి పదాలు అర్థ విపరిణామం చెంది, వంచన ఒక నైపుణ్యంగా ‘హింసావాదం హీరోయిజమ్’గా చలామణి అవుతున్న నవనాగరిక సమాజంలో తరాలఅంతరాలలో మానవ సంబంధాలు మృగ్యమై వృద్ధాప్యానికి శరణాలయాలే చిరునామాగా మారిన తీరుతెన్నులను నేడు చూస్తున్నాం. కాలం వేసిన గాలంలో మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ‘జగమంత కుటుంబం నాది – ఏకాకి జీవితం నాది’ అన్న సిరివెన్నెల పాట ఈనాటి సామాజిక స్థితిగతులకే కాదు కుటుంబ పరిస్థితులకూ అద్దంపడుతోంది.

ఇది నిత్యప్రస్థానం …

ఎగుడుదిగుళ్ళు తప్పవు

ఇది నిత్యప్రయోగం!

ఎదురు దెబ్బలూ తప్పవు.

ఎంతగా దిగజారిన పరిస్థితులలోనైనా సామాజిక మానసిక రుగ్మతలనుండి మనిషిని కాపాడే దివ్యౌషధం ప్రేమ ఒక్కటే అన్న పరిష్కారం నైరాశ్యోపహతమైన మనస్సుకు చీకటిలో చిరుదివ్వెలా అనిపిస్తోంది. “పువ్వువాడిపోతుందని తోటంతా ఒకటే పుకారు. పరిశీలిస్తే తెలిసింది అది పండుగా మారుతుందని’ అన్న ఆశావాదంతో మనస్సు జతకడుతోంది.

A wise Physician said, “The best medicine for human is care and love.”

Someone asked, “If it does not work?” He smiled and answered “Increase the dose”.

మనుషులు వేరయినా మమత ఒక్కటే. భాషలు వేరయినా భావమొక్కటే. ప్రేమ అన్నపదానికి ఎందరు మేధావులు ఎన్ని నిర్వచనాలు చెప్పినా మాటలకు అందని నిసర్గసుందర ప్రేమబంధం అది తల్లీబిడ్డల అనుబంధం. జగన్నాథ రథానికి మూలాధారం ప్రేమ. ఎందరో మనస్తత్వశాస్త్రవేత్తలు, శిక్షణ శిబిరాలు, ప్రణాళికా రచనలు సాధించలేని ఘన విజయాన్ని పరిమితులులేని మమకారంతో విచక్షణలేని తన వీక్షణంతో అమ్మ కైవసం చేసుకుంది. దశదిశా పరివ్యాప్త దివ్యప్రభలతో భాసించే మానవతా మణిదీపమై వెలుగులు పంచింది.

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!