(గత సంచిక తరువాయి)
అమ్మంటే లాలన పాలన క్షాళన దుఃఖ నివారణలు అన్నారు శ్రీరామకృష్ణ అన్నయ్య. ఈ చరాచరజగత్తునే తన బిడ్డగా భావించిన జగన్మాత మనుష్యులనేకాదు పశుపక్ష్యాదులను కూడా తన అకారణ కారుణ్యంతో సేదతీర్చి లాలించింది. జీవనాధారం లేక దిక్కుతోచని అయోమయస్థితిలో చిక్కుకున్నవారిని చేరదీసి ఆశ్రయమిచ్చి దారీతెన్నూ తానై చేయిపట్టి నడిపించింది. నేనున్నానని అభయమిచ్చి పునరుజ్జీవితులై వారు జీవనపథంలో సాగిపోయేలా ప్రేమతో పాలించింది. సంసారంలో సమస్యల సుడిగుండంలో తల్లడిల్లిపోతూ నీవు తప్ప ఇతఃపరంబెరుంగనని శరణుకోరిన ఆర్తులను అక్కునచేర్చుకొని ఆదరించి కష్టాలకడలి దాటించి సమాజంలో ఒక సుస్థిరస్థానాన్ని కల్పించిన సన్నివేశాలు ఎన్నో … స్వయంకృతమో విధివిలాసమో తెలియని స్థితిలో తప్పులు చేసి వాటి దుష్పరిణామాలను అనుభవిస్తూ సమాజం దృష్టిలో నేరచరితులుగా మిగిలిపోయిన వారిపట్ల అమ్మ కారుణ్యం చూపి కర్కశమైన లోకరీతులను నీతులను ప్రస్తావించకుండా “పొరపాట్లతో కూడినదే మానవత్వ”మని, ఎవరైనా “తప్పని తెలిసీ తప్పించుకోలేక తప్పు చేస్తా”రని అపరాధ భావనతో తపించిపోతున్నవారి మనస్సులకు ఊరటనిచ్చింది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదని మీ పాపాలను నాకు వదిలిపెట్టి సన్మార్గంలో పురోగమించమని వెన్నుతట్టి ప్రోత్సహించింది. అవ్యాజమైన అమ్మ వాత్సల్యస్పర్శతో కురిసిన కన్నీటి ధారలతో వారిమనస్సులను ప్రక్షాళితంచేసిన సంఘటనలు విశ్వజననిగా అమ్మ ప్రకటితం కాక పూర్వమే పట్టుమని పదేళ్ళు లేని బాల్యంలోనే దర్శనమిస్తాయి. శిక్ష కాని శిక్షణతో ప్రవర్తనలను పరిస్థితులను చక్కదిద్ది పరివర్తన దిశగా మరలించి సంస్కరణకు అమ్మ చిరుతప్రాయంలోనే శ్రీకారం చుట్టింది. ఇది మన దృష్టిలో ‘సామాజిక స్పృహ కావచ్చు’. అమ్మభావనలో తల్లీబిడ్డల బాంధవ్యం -తల్లిగా తన బాధ్యత. అమ్మ మరో అడుగు ముందుకువేసి ‘తల్లికి తప్పే కనిపించదు’ అని తీర్మానం చేసింది. అదేమిటన్న ప్రశ్న తలెత్తక ముందే ‘రావణాసురుడు దుర్మార్గుడని అతని తల్లి ప్రేమించకుండా ఉంటుందా?’ అన్న ప్రశ్నతో నిరుత్తరులను చేసింది. మన ఊహకు అందని అభ్యుదయ భావాలకు ఆలవాలం అమ్మ అంతరంగం. సంఘసంస్కర్తలుగా ప్రఖ్యాతి గాంచినవారు ఎవరైనా ఎంతటి ఉదార హృదయులైనా కులమతభేదాలను ఆర్థిక అసమానతలను నిరసించారే కాని గుణభేదం లేదన్నవారు లేరనేది వాస్తవం.
అభ్యుదయపథంలో తొలి అడుగుజాడ గురజాడ కూడ
‘మంచి చెడులని ఎంచి చూడగ
మనుజులందున రెండె కులములు’ అన్నారు. అమ్మ కులభేదమే కాదు గుణభేదమూ తనకు లేదని స్పష్టపరిచింది. మనలాంటి వారికి ధర్మసందేహం వస్తే ‘మంచి చెడులతో కూడిన ప్రవర్తనకు మనిషి బాధ్యుడు కాడని సమర్థించింది. ‘చెడ్డవాళ్ళు అనుకునేవారికి నాబళ్ళో అయినా చోటులేకపోతే ఎలా?’ అని సానుభూతితో కాదు సహానుభూతితో స్పందించింది. కరుడుగట్టిన నేరస్థులు సైతం అమ్మప్రేమకు పాదాక్రాంతులై కరిగి కన్నీరై తమ చరిత్రను తిరగరాసుకున్న సన్నివేశాలు మహోజ్జ్వలమైన అమ్మ ఉద్యమస్ఫూర్తికి సజీవసాక్ష్యాలు.
ఒక దొంగ తనసొమ్ము దోచేస్తే ఆవిషయం అమ్మకు మొరపెట్టుకుంటున్న సోదరునితో ‘వాడికెంత అవసరమయిందో నాన్నా!’ అని అమ్మ తప్ప వేరెవరైనా అనగలరా? సొమ్ము కోల్పోయిన సామాన్యుడు ఆ మాట విని సహించగలడా? అంటే – అనన్యమైన అమ్మ ఔదార్యానికి అమ్మ సన్నిధి నేర్పిన సముదాత్త సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఈ సన్నివేశం. తనబిడ్డ తప్పుచేస్తే లోకం దృష్టిలో అది తప్పే కావచ్చు, కన్నతల్లికి మాత్రం అది తప్పుగా అనిపించదు. బిడ్డ ప్రవర్తనలోని లోపాలను తల్లి ఎలా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందో అదే దృష్టితో సమాజంలోని పతితులు దీనులు హీనుల గురించి ఆలోచించగలిగితే తప్పులు కనిపించవు. కనిపించినా దానికి తగిన కారణాలుంటాయి, ఆ నేపథ్యంతో ఆలోచించాలి – అన్న అవగాహన కలుగుతుంది. పరిస్థితుల ప్రభావం నుండి వారి మనస్థితిలో మార్పు ఎలా తీసుకురాగలం అన్న అంశం మీదనే మనస్సు కేంద్రీకృతమౌతుంది. రాగద్వేషాలకు అతీతంగా మన ఆలోచనలకు పదునుపెట్టి విశాల దృక్పధాన్ని అలవరచటం అంటే అరుణోదయ ప్రభలతో అంధకారాన్ని పారద్రోలటమే. ఇది వ్యక్తిత్వ నిర్మాణానికి తద్వారా సమాజశ్రేయస్సుకు బీజావాపనమే కదా! ఒక పిల్లవాడు బురదలో జారిపడితే అయ్యో! అని సానుభూతి ప్రకటించేవారు కొందరైతే చేయూతనిచ్చి నిలబెట్టేవారు మరికొందరు. అమాంతం ఎత్తుకుని ఓదార్చి తర్వాత బురద కడిగే ప్రయత్నం చేసేది తల్లి. ఈ తారతమ్యానికి మమకారమే – అంటే నాది అనుకోవటమే కారణం. ‘ఈ సృష్టి అనాది నాది’ అని ప్రకటించిన అమ్మ మమకారం ఆకాశంలా అనంతం. కనుకనే ‘మీరు బురదతో ఉన్నా ఒడిలోకి తీసుకోవటం తల్లిగా నా కర్తవ్యం’ అని చెప్పింది. ఆచరించి చూపింది. అమ్మ అంటేనే ‘అంతులేనిది అడ్డులేనిదీ అన్నింటికీ ఆధారమైనది’ అని కదా!
‘ఈ కలిలో నాకు ఆకలి లేదు’ అంటూనే అమ్మ ఆకలిమీద యుద్ధం ప్రకటించింది. తల్లి మనస్సుకు బిడ్డల ఆకలిని మించిన తపన వేదన ఏముంటుంది? ప్రపంచంలో ఏ మూల ఆకలి అర్తి కనిపించినా అవి అమ్మ మనస్సును కార్చిచ్చులా దహించేవి. ఒకసారి ఒక జ్యోతిష్కుడు వచ్చి అమ్మను ‘ఏదయినా ప్రశ్న అడుగమ్మా!’ అని అభ్యర్థించాడు. అప్పుడు అమ్మ “నాన్నా! ఈ ప్రపంచంలో ఆకలిబాధ లేనిరోజు ఎప్పుడొస్తుంది?” అని అడిగింది. అతడు తెల్లబోయి కాస్త సర్దుకుని ‘నీ రాశి ఏమిటమ్మా!’ అని అడిగాడు. ‘బియ్యపురాశి’ అన్నది అమ్మ. ఈ స్థితిలో అమ్మ అంతరంగాన్ని వ్యాఖ్యానించాలంటే మాటలకు అందని పరిస్థితి. అహరహం అనుక్షణం అమ్మ ఆలోచన ఆవేదన, తపన 1 పరితాపం బిడ్డల ఆకలి గురించే. లక్షమంది భోంచేసినా ఒక్కరు భోజనం చేయలేదంటే అమ్మ పడే వేదన అంతా ఇంతా కాదు.
వ్యక్తి జీవితం సమస్యల తోరణమైతే సమాజ జీవనం సమస్యల వలయమే. ఎంతటి అవతారమూర్తికి అయినా సమూలంగా సమాజ ప్రక్షాళన సాధ్యంకాని పని. ఆకలితో ఆర్తితో అనారోగ్యంతో అలమటించేవారి కన్నీరు తుడవటానికి విరాడ్రూపిణి అయిన అమ్మ సహస్ర బాహువులతో ఉద్యమించింది. “మీరంతా నా బిడ్డలే కాదు నా అవయవాలుకూడా” అన్న ప్రకటన వెనుక ఉన్న ఆంతర్యం అదే. “మీకు పెట్టటం మీ చేత పెట్టించటానికే” అని ఒక వినూత్న పథకరచనకు శ్రీకారంచుట్టింది. సామాజిక అసమానతలకి పంచియిచ్చే లక్షణమే ఏకైక పరిష్కారం- అది డబ్బు కావచ్చు అన్నం కావచ్చు ఆదరణ కావచ్చు. ఉన్నవాడు లేనివాడి గురించి ఆలోచించగలిగితే కలిగినంతలో ఆసరా అందించాలనే భావం అందరి మనస్సులలో కలిగించగలిగితే ఈ ప్రపంచపటంలో దారిద్ర్యం అన్నది మచ్చుకైనా మిగలదు” అన్నాడు ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర వేత్త అమర్త్యసేన్. ప్రేమను తిరుగులేని ఆయుధంగా మలచుకొని తన బిడ్డల గుండెలలో గుడికట్టుకుని, అమ్మ సామాజిక రుగ్మతలపై సమరశంఖం పూరించింది.
‘సర్వసమ్మతమే నా మతం’ అంటూ తన నివాసానికి ‘అందరిల్లు’ అని చేసిన నామకరణం అమ్మ సంకల్పించిన మాతృయాగానికి అంకురారోపణం.
డ్రస్సుని అడ్రస్సుని బట్టి కాక అన్నపూర్ణా లయంలో భోజనం చేయటానికి ‘ఆకలే అర్హత’ అన్నమాట వర్గంలేని స్వర్గానికి అమ్మ పరచిన రాచబాట.
జగన్మాత అంటే జగత్తే మాత అని సమన్వయించే అమ్మ దృష్టిలో లోకకల్యాణమే లోకేశ్వరుని కల్యాణం.
ఎవరు జిల్లెళ్ళమూడి ఏపనిమీద వచ్చినా భోజనం చేసి వెళ్ళాలనేది అమ్మ నిర్దేశం. ఎవరయినా జిల్లెళ్ళమూడి ఆకలితో రావచ్చు కాని ఏ ఒక్కరూ ఆకలితో వెళ్ళకూడదు అనేది అమ్మ ఆదేశం.
‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో’ అన్నది మనందరికీ అమ్మ అందించిన సందేశం.
‘ఎల్లలోకం ఒక్క యిల్లై
వర్ణభేదములెల్ల కల్లై’ అని ప్రగతికాముకులు కలలుగన్న సమసమాజ స్థాపనయే అమ్మ లక్ష్యం. దానికి మూల్యం ప్రేమ – ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ, ఇది మాతృయాగం. ఇది కర్మయోగం. ఇది అమ్మ చేసిన వినూత్న ప్రేమ ప్రయోగం.