మన దేశం పుణ్యభూమి కర్మభూమి. ఎందరో అవతార మూర్తులు ఈ భూమిపై జన్మించారు. కారణజన్ములు అయిన వారందరూ తమ కరుణ, వాత్సల్యంతో ఎంతో మందిని తరింప చేశారు. మానవ జన్మమే ఉత్తమమైనది. అపురూపంగా లభించిన ఈ జన్మలో దైవంపై భక్తి విశ్వాసం కలిగి ఉండి జన్మ సార్థకం చేసుకోవటమే ఒక వరం. ఇక ఒక అవతార మూర్తిని దర్శించుకుని వారి మాటలు విని వారి పాదసేవ చేసుకుంటూ వారికి సన్నిహితంగా వారి సమక్షంలో మెలగటం అంటే సామాన్యం కాదు. మహద్భాగ్యం. ఆటువంటి మహద్భాగ్యం కుటుంబంలో ఏ ఒక్కరికో కాకుండా ఎంతోమందికి లభిస్తే! ఇక ఆ అదృష్టం వర్ణించటం ఎవరికి సాధ్యం అవుతుంది! అటువంటి అపురూపమైన అదృష్టాన్ని సొంతం చేసుకున్న కుటుంబాలు మావి.
మా అందరికీ అవతారమూర్తి అయిన అమ్మతో అనుబంధానికి పునాది వేసింది సుశీలత్తయ్య. అది మొదలు. ఇక వరస పెట్టి ఎంతో మంది ఆ మార్గాన్ని అనుసరించారు. నా పుట్టింటి వారు వల్లూరు వారు. వల్లూరు వారి కుటుంబం నుంచి పాండురంగారావు, బసవ రాజు, రమేష్, జగన్నాథ రావు గారు, రామ్మూర్తి గారు, పార్థ సారథి గారు, వెంకట రమణ, వల్లూరు వారి ఆడపడుచులు సుశీలత్తయ్య, సరోజిని అక్కయ్య, మాణిక్యాలు అక్కయ్య బుజ్జక్కయ్య (మధు బావ భార్య లలిత) నేను.
అటు యల్లాప్రగడ వారు మా అమ్మమ్మ పుట్టింటి వారు. సుశీల అత్తయ్య కు అత్తవారు. వారి కుటుంబం నుండి మధు గారు, రమణయ్య తాతయ్య గారు వారి కుటుంబం మొత్తం. వారి ముగ్గురు కుమారులు, శివ సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, శ్రీరామ్మూర్తి గారు, కుమార్తె భవాని గారు, కోడళ్ళు, అల్లుడు, మనవలు, మనవరాళ్ళు అందరూ అమ్మ ను స్వయంగా దర్శించుకుని ఆమె సన్నిధిలో అపరిమితమైన ఆనందాన్ని పొందిన ధన్యులు.
మా అత్తవారు పొత్తూరి వారు. ఆ కుటుంబం నుండి పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబం. లలిత కుమారి (యల్లాప్రగడ శ్రీరామ్మూర్తి గారి భార్య) పొత్తూరి వారి ఇంటి ఆడపడుచు. మా కుటుంబం. మా సరోజిని అక్కయ్య భర్త పమిడిపాటి రంగారావు గారు ఎన్నో సంవత్సరాలు హైమవతీ దేవికి అర్చన సేవ చేసుకున్నారు. వారి కుమారుడు పమిడిపాటి గిరిధర కుమార్, కుమార్తె హైమ ప్రస్తుతం తండ్రి బాటను అనుసరిస్తున్నారు. ఇంతమంది అమ్మ చెంత చేరటం ఓహ్ అపూర్వం. ముఖ్యంగా పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, మధు బావ, రంగడన్నయ్య, శ్రీరామ్మూర్తి అన్నయ్య గారు, రమేష్, హైమ, గిరిధర్ కుమార్ అమ్మకు అత్యంత ప్రియులు. అమ్మకు, అమ్మ ప్రతిరూపం అయిన సంస్థ కు ఎనలేని సేవ చేసుకున్న ధన్య జీవులు.
ఒక వ్యక్తికి ఒక అవతారమూర్తి పట్ల నమ్మకం, భక్తి ఏర్పడినా వారి జీవిత భాగస్వామి అందుకు వ్యతిరేకించిన సందర్భాలు చాలా చూశాం. ఇక్కడ మాత్రం అట్లా కాదు. ఆయా వ్యక్తులే కాకుండా వారి జీవిత భాగస్వామి, వారి సంతానం కూడా అమ్మే సర్వస్వం అని నమ్మడం విశేషం. అది కూడా అమ్మ దయే. శ్రీరామచంద్రుడు అవతార పరిసమాప్తి గావించి తిరిగి వైకుంఠానికి వెళుతూ అంతకాలం తనని నమ్ముకుని సేవించుకున్న ప్రజలను అందరిని తనతో పాటు తీసుకు వెళ్ళాడు. తనవారి కోసం సముచిత స్థానాన్ని ఏర్పాటు చేయవలసిందిగా బ్రహ్మదేవుని కోరాడు. వైకుంఠవాసుని కోరిక ప్రకారం వారందరి కోసం ఒక లోకాన్ని సృష్టించాడు. బ్రహ్మదేవుడు.
అందరూ నా బిడ్డలు. అందరికీ సుగతే అని అమ్మ స్వయంగా చెప్పింది. అమ్మ ఆదరణకు నోచుకున్న వారిలో అయిదారు బస్సులకు సరిపడా మా కుటుంబ సభ్యులే వున్నారు అని తల్చుకున్నప్పుడు నాకు చెప్పలేనంత ఆనందం తృప్తి కలుగుతాయి. ఎన్ని జన్మల పుణ్యమో ఇది అనిపిస్తుంది.