1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘ఎరుక లేక ఎరుగ లేరు’

‘ఎరుక లేక ఎరుగ లేరు’

K. B. G. Krishna Murthy
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 7
Month : October
Issue Number : 4
Year : 2008

అమ్మను వేదాంతం అంటే ఏమిటి? అని అడిగితే “చెప్పేవాడికి వినేవాడికి తెలియనిది” అని సమాధానం చెప్పారు. మరి ఇంతకీ చెప్పేవాడికి తెలియదా? మరి ఎందుకు చెప్పుతున్నట్లు? తెలిసింది అని అనుకొని. ఏమి తెలిసింది? భగవంతుని గురించి, ఆయన తత్వాన్ని గురించి. ఆయన తత్త్వాన్ని గూర్చి చెప్పటమే ఫిలాసఫీ. ఇంతకు ఆయన ఎవరు? ఆయన దేవుడు. “దేవుడంటే దేవులాడినా దొరకని వాడు” అంది అమ్మ. ఎందుకు దొరకదు?” ఎందెందు వెదకి చూచిన అందందే కలడు” అన్నాడు ప్రహ్లాదుడు. వెదకటానికి ఎక్కడకన్నా పోతేగదా? మరి ఎందుకు కనపడడు? “ఈ సృష్టిలో ఏది చూచినా, ఏది తాకినా, ఏది విన్నా ‘అది’ తప్ప నాకేదీ కనపడటం లేదు నాన్నా” అన్నది అమ్మ. ఇంతకి “అది” ఏది? ఈ సర్వసృష్టి అన్నమాట. ఇది భౌతికమైనది. నశించేది, మారేది అంటారు. ఏది సర్వకాల సర్వావస్థలయందు వుంటుందో, ఏది సర్వవ్యాప్తమైనదో, ఏది సర్వమునకు ఆధారంగా వుంటుందో, ఏది సర్వము తానైయుంటుందో అదే పరబ్రహ్మము. అదే పరమాత్మ. అదే ఆ “అది”. “అది” “ఇదే” అని అన్నది అమ్మ తన వంక బొటన వ్రేలు చూపుతూ.

అమ్మ అంటే ఈ జిల్లెళ్ళమూడిలో ఈ మంచం మీద కూర్చొన్న అమ్మే కాదు. అమ్మ అంటే ‘అంతులేనిది, అడ్డులేనిది. అంతా అయినది. సర్వమునకు ఆధారమైనది. అర్థము కానిది’ అని నిర్వచనము ఇచ్చింది. అటువంటి అమ్మను తెలుసుకుంటానికి ఆమె తెలియచేయవలసిందే కాని మనము తెలుసుకోవటం మన “నేను వల్లకానిపని. అందుకే అమ్మ అమ్మను మీరు బిడ్డలు. అంతే కాదు మీరు నాకు అవయవాలు కూడా. మీకే కాకుండా ఈ సర్వచరాచర సృష్టికి నేను అమ్మనే” అని తెలియచేసుకుంది. అంటే ఆమె విశ్వజనని, సర్వసృష్టికారిణి, అని అవగతం అవుతున్నది. అటువంటి విశ్వజననికి మనం బిడ్డలము. రాజరాజేశ్వరి అవతారంట కదా అంటే “మీరు కానిది నేను ఏదీ కాదు” అంది. అమ్మా ! నీవు అంటే మీరంతా “అదే” అని స్ఫురింప చేస్తుంది. కాని “లడ్డు అవడం కంటే రుచి చూడటంలోనే ఆనందం వుంది” అంది. అందుకే ఆ లడ్డు రుచి చూపించటానికే మీరు నాకు బిడ్డలు అంది. ఒక చెంప లడ్డు కూడా మీరు కాకపోలేదు అని స్ఫురింప చేస్తూ. మీరు నా నుండి ఉద్భవించి, నాలోనే పెరిగి, నాలోనే లీనమౌతారు. మీరు నాఒడిని విడిచి ఎక్కడకు పోలేరు” అని అమ్మ assurance మనకు Insurance. ఇంత ఘంటా పథంగా చెప్పిన అవతారము ఎవరున్నారో ఆలోచించండి. ఎవరిని చూచినా కర్మలు, జన్మలు, జన్మపరంపరలు. And పరమపద సోపానము నుండి ఎప్పటికి బయట పడతారో? ఎన్ని అవతారాలు రావలసి యున్నదో? అంచనా వేయలేని విషయము.

అటువంటి తరుణంలో తల్లిగా మనల్ని తరింప చేయటానికే, మనము అసలు ఎవరమో తెలియ చేయటానికే, అమ్మ అవతరణ.

ఒకసారి అమ్మ నాకిచ్చిన అనుభూతిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అది దాదాపు 1964-65 సంవత్సరము. అమ్మ ఆలయం పునాదులు వద్ద యున్నది. అమ్మ స్నానానికి చెరువు నుండి కావిళ్ళు వేసుకొని నీళ్ళు తెచ్చి అమ్మ స్నానం అయిన తర్వాత ఆ నీళ్ళను మేము ఆ పునాదుల మీద స్నానాలు చేసేవాళ్ళం. ఇప్పుడు హైమాలయం వెనుక నున్న అమ్మ పూరింటి హాలులో అమ్మకు ఎదురుగా గోడకు ఆనుకొని కూర్చున్నాను. అమ్మను రెప్పపాటు లేకుండా తదేక దృష్టితో అమ్మముఖము వంక అమ్మ కుంకుమ బొట్టు కేంద్రంగా చూస్తున్నాను. హాలు నిండా జనం క్రిక్కిరిసి కూర్చున్నారు. ఒకసోదరి అమ్మకు పూజ చేసుకుంటున్నది. కొంత సేపటికి అమ్మ ముఖము వ్యాకోచించింది. అది మెల్లగా మెల్లగా వ్యాకోచం చెందుతూ పోతున్నది. ఆ ఎర్రని బొట్టు ముఖముతో సహా పెద్దది అయిపోయి ఆరంగు dilute అవుతూ అమ్మ అసలు కనపడకుండా పెద్దదిగా శూన్యమై పోయింది. ఆ శూన్యమైన స్థితిని వర్ణించటము అవాజ్మానస గోచరము, ఎవరి వల్ల కాదు. అట్లా ఎంత సేపు వున్నానో తెలియదు. కొంత సేపు అయిన తర్వాత ఆ రూపము మరల సంకోచమై మెల్లగా మామూలు అమ్మ రూపంలోకి వచ్చింది. అప్పటికి గాని నేను హాలులో వున్నట్లు అవగతము కాలేదు. హాలులో అమ్మకు హారతిస్తూ ఆ పూజ చేసుకొన్న సోదరి లేచింది. హాలులో ఎవ్వరూ లేరు.

అన్నపూర్ణాలయం గంట కొట్టారో ఏమో అందరూ వెళ్ళారు. ఆ సోదరిని కూడా అమ్మ భోజనము చేసి రమ్మనమని సంజ్ఞ చేసింది. ఆమె కూడా వెళ్ళింది. నేను మెల్లగా లేచి అమ్మకు పాదుకలు అందించి అమ్మను స్నానాల గదికి పంపి వచ్చాను. అది యొక అలౌకికమైన ఆనందం. ఆ ఆనందం మా సోదరుడు రామకృష్ణకు కూడా పంచాలని ప్రయత్నించాను. దీనికి ఏమైనా spiritual significance వున్నదా అని వాడిని అడిగాను. వాడు అమ్మనే అడగమన్నాడు.

అమ్మస్నానము చేసి వచ్చి లోపలి గదిలో మంచం మీద కూర్చున్నది. నేను మెల్లగా అమ్మగదిలో ప్రవేశించాను. అమ్మ ఒడిలో తలపెట్టి అటు ఇటు త్రిప్పుతున్నాను. అమ్మ “ఏమిరా? ఏమిటి మహాబ్రహ్మానందంలో వున్నావు. ఏమిటి విషయం” అన్నది. విషయం చెప్పాను. “దీని అంతరార్థం ఏమిటమ్మా!” అని అడిగాను. “అదే విశ్వరూప సందర్శనం” అంటే అన్నది. ఈ పరిమితమైన రూపం అపరిమితమైనదిగా చూడటమే అన్నది. “కృష్ణుడు అర్జునుడికి విశ్వరూప దర్శనం ఇవ్వటంలో కారణం వున్నది. మరి దీని అంతరార్థమేమిటి?” అన్నాను. “ఏమో ఇద్దాం అనుకున్నాను. ఇచ్చాను” అన్నది. ఇంతటి సర్వసృష్టి, స్థితి, లయకారిణి అయిన అమ్మను వర్ణించటానికి ఏ వాజ్ఞ్మయం చాలుతుంది. అందుకే శాస్త్రాలు అనుభవం ఇవ్వలేవు. “సాహిత్యంతో రాహిత్యం రాదు” అన్నది అమ్మ.

ఒకసారి అమ్మ పూరింటి వరండాలో స్తంభాన్ని అనుకొని నిలుచున్నది. ఆ స్తంభాన్నే ఆనుకొని మదరాసు సోదరులు పార్థసారధి అయ్యంగారు క్రింద కూర్చొని పుస్తకము చదువుకుంటున్నాడు. అప్పుడు అమ్మ అన్నది “పాపం వీడు కావలసిన వాడిని ప్రక్కనే పెట్టుకొని పుస్తకాలలో వెతుక్కొంటున్నాడురా?” అని.

అందుకే కాబోలు రాజమ్మగారితో సంభాషణలో గురువు అవుతామనుకొన్న రాజమ్మగారికి కూడా తన నిజ దర్శనాన్ని యిచ్చి తానెవరో తెలియ చేసింది. అమ్మ కనుక తానెరుక చేసుకుంటే తప్ప మనము ఎరుగలేము. అందుకే “వేదాంతం అంటే చెప్పేవాడికి తెలియదు. వినేవాడికి తెలియనిది” అన్నది అమ్మ.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!