- చల్లని చూపులు కరుణ చక్కని మాటల తీరు చూడగా
ఎల్లలులేని ప్రేమ యది ఎవ్వరికైనను పంచు అమ్మయై
సల్లలితానురాగ పరిసర్పిత సుందర మందహాసమున్
పెల్లగు వర్షమోయనగ పెక్కు విధంబులు వ్యాప్తమయ్యే గా.
- ఆ కారుణ్యము మేరలేనిది కదా! ఆ మూల చూడంబుగా;
సాకారంబుగ భూమిపైని మనలెన్ సంచార దైవంఐనన్;
ఏ కాలంబయినస్ ప్రమోద మొకటే ఎవ్వారికైనన్ మదిన్
చేకూర్చుని మన అమ్మ అర్కపురిలో; జేజేయనన్ లోకమే.
- అందరు మేలు పొందగను అందరు వాసము చేయునట్లుగా
ఎందరు వచ్చినన్ మరియు నే సమయంబుననైన వీలుగా
పొందగ గల్గినట్లు కదు పూర్ణముగా సుఖమొందునట్లు రూ
పొందిన అన్నపూర్ణ అట భోజనమున్ సమకూర్చు అమ్మయై.
- అమ్మ నిరంతర స్మరణ అవ్యయమైన మనోవికాసమున్
కమ్మని దివ్య భావనల కామితముల్ సమకూర్చు నెప్పుడున్
దమ్మును ధైర్యమున్ కలిమి దానగుణమ్మును ప్రేమ నిచ్చుచున్
కిమ్మనకుండగా మనకు వీప్పిత సౌఖ్యము కూర్చు నిండుగా
- గురువను మాట కర్ధమది గుర్తునుచూపిన వాడటంచు తా
సరళము సుందరమ్ము నగు సత్యము తెల్పేడు లోకమాతయై
పరమ సుబోధకం బగుచు భాసురమౌ పరమార్థ సంపదన
కరతలమైన అమ్మకముగా నిడి ముచ్చట గొల్పు నెల్లెడన్.
- వాత్సల్యం పొక రూపు దాల్చి యిలలో వర్ణింపగా రానిదై
ప్రోత్సాహంబును నింపి మానసమునన్ పూర్ణత్వ మింపార ని
త్యోత్సాహంబును గూర్చి అమ్మ కడు సంతోషంబు చేకూర్చుచున్
మాత్పర్యంబును రూపుమాపి యిలు సన్మార్గంబు చూపించెడిన్.
- మహిత సముజ్జ్వలాకృతియు మాటలకందని మందహాసమున్
సహన సమంచితంబయిన సద్గురు బోధయు మంగళత్వమున్
బహుళ విశేష లాభమిడు భావన నిండిన పత్రియావళుల్
మహిమము గల్గు అర్కపురి మాతను ఏగతి ప్రస్తుతించెదన్.
- అంతట నిండినదయి అంతము ఆదియు లేనియట్టిదా
సంతతమైన జ్ఞానమది సాక్షిగ వెల్గుచు దివ్యతేజమై
చెంతకు వచ్చి ప్రేముడిని చేరెడు వారికి భుక్తి ముక్తులన్
సంతయు బాధతీర కడు చోద్యముగా నొనగూర్చు నమ్మ యే
– (సశేషం)