(గత సంచిక తరువాయి)
ఒకసారి ఈ వ్యాసరచయిత అమ్మతో జన్మల చర్చ సుదీర్ఘముగా జేసినప్పుడు, “శరీరం వదలటం, మరొక శరీరమును గ్రహించడమే – జన్మలు – అనుకొంటే నాకు అభ్యంతరం లేదు” అని స్పష్టంగా చెప్పింది. అనగా మన దృష్టిలో జనన మరణాలు అమ్మ దృష్టిలో లేవని బోధ పడుతుంది. ఈ సందర్భంలోనే అమ్మ ఎదుట ఉన్న గోడను చూపి – “ఆ గోడకు అవతల ఉన్నది నీకు కనపడటం లేదు. మరొకరికి కనిపిస్తున్నది. అపుడు ఆ గోడ ఉన్నట్లా లేనట్లా?” – అని ప్రశ్నించింది. అనగా అవతలి వస్తువును చూడలేని వానికి గోడ అడ్డు, చూడ గల్గిన వానికి గోడ ఉండి కూడ లేనట్టే కదా! దేహమునకు దేశకాలాదులకు పరిమితుడయిన జీవుని దృష్టి పరిమితమయినది; పరిమితుడు కాని జ్ఞాని దృష్టి అఖండమూ, అపరిచ్ఛిన్నమూ అవుతుంది. సర్వమూ తానయి సర్వాతీతమూ తానయిన పరచితిరూపిణి అగు పరమేశ్వరికి పరిమితత్వమును ఆపాదించే జనన, మరణాదులు వేఱుగా భాసింపవు. ఆ పరమేశ్వరి ప్రతీక అని మనం భావించే అమ్మ – “జన్మలు లేవు” అంటే మరణాలు గూడ లేవనే మనం అర్థం చేసికోవాలి.
ఈ స్థితి దేహంలో ఉంటున్నాయని భావించే జీవునకు అర్థంకాని చిక్కు సమస్య. అమ్మ చెప్పిన క్రింది వాక్యాలను చక్కగా పరిశీలించి అవగతం చేసికొంటే – ‘జన్మలు లేవు’ – అని అమ్మ ఎందుకు అన్నదో కొంతమేరకయినా మనకు సందేహ నివృత్తి జరుగుతుంది:-
- “అంతా అదే (బ్రహ్మమే) అనిపిస్తుంది.”
- ‘మీ ఆరాధ్య దైవం ఎవరమ్మా?’ అని ఒకరు అడిగితే “మీరే నా ఆరాధ్య దైవాలు” అన్నది అమ్మ.
- శ్రీ విఠాల రామచంద్రమూర్తిగారు అమ్మ పాదాలను కడుగుతూ – “బ్రహ్మ కడిగిన పాదములు” . అనగా, “అవును, మీ రందరూ బ్రహ్మ కాక పోతేగా!” – అని అమ్మ సమాధానం.
- “సృష్టి అనాది నాది.”
- “మీరందరూ నా అవయవాలు.”
సృష్టి నాది (ఆత్మది). ఆత్మరూపమయి, అది అనాది అయి, కనిపించేదంతా అదే (బ్రహ్మమే) అయి, మనమంతా అమ్మ ఆరాధ్య దైవాలమే అయి, మన మందరమూ బ్రహ్మ రూపులము అయితే పుట్టేది ఎవరు? గిట్టేది ఎవరు?
“అంతా ఆత్మగా తోచటమే ఆత్మ సాక్షాత్కారం – అని ఆత్మ సాక్షాత్కారాన్ని నిర్వచించిన అమ్మకు అపరిచ్ఛిన్న
పరమ చితికి ప్రతీక అయిన అమ్మకు – జన్మలూ లేవు, మరణాలూ లేవు అని అర్థం చేసికోవాలి.
(సశేషం)