(గత సంచిక తరువాయి)
‘జన్మలు లేవు’ – అను అమ్మ అభిప్రాయమెట్టిదో తెలిసి కొనుటకు ప్రయత్నం చేద్దాం :-
“న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వాం భవితా న భూయఃI
అజో నిత్యః శాశ్వతో2 యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥ (భ.గీ. 2-20)
“వాసాంసి జీర్ణాని యధా విహాయ నవాని గృహోతి నరో పరాణి I
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీII” ( భ.గీ. 2-22)
‘అను శ్లోకాలలో ఆత్మకు జనన మరణములు లేవనీ ఆత్మ జీర్ణ దేహములను వదలి నూతన దేహములను ధరించుననీ చెప్పిన శ్రీకృష్ణభగవానుడు –
‘బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ॥’ (భ. గీ. 4-5)
అజో పి స న్నవ్యయాత్మా భూతానా మీశ్వరో పి సన్ I
ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవా మ్యాత్మమాయయా I ( భ.గీ. 4–6).
– అను శ్లోకాలలో తనకు చాల జన్మలు గడచినవనియు, అవి తనకు తెలియుననియు అర్జునునకు తెలియవనియు చెప్పి, “నేను జన్మరహితుడను, మార్పు లేని ఆత్మరూపుడను, సర్వభూతములకు నియామకుడను అయినప్పుటికి త్రిగుణాత్మకమయిన నా ప్రకృతిని వశీకరించుకొని నా మాయా ప్రభావము వలన జన్మించుచున్నాను.”- అని చెప్పినాడు.
ఆది శంకరభగవత్పాదులు ఇక్కడ తమ భాష్యంలో – “సంభవామి దేహవానివ భవామి జాత ఇవ ఆత్మమాయయా ఆత్మనో మాయయా న పరమార్ధతో లోకవత్” – అని వివరించారు. అనగా ఆయన (శ్రీకృష్ణుడు) దేహము గలవాడు వలె పుట్టినవాడు వలె ఉన్నాడు. యథార్థముగా ఆయన లోకము వంటివాడు గాడు. ఇది ఆయన వైష్ణవమాయా ప్రభావము.
సర్వాంతర్యామి అయిన భగవానుడు మనకు రూప సహితుడుగా కనిపించినప్పటికి యథార్థముగా రూపము లేనివాడే అని భావము.
(సశేషం)