(గత సంచిక తరువాయి)
పరమాద్వైత స్థాపనాచార్యులగు ఆదిశంకర భగవత్పాదులకు పరమ గురువులయిన శ్రీ గౌడపాదాచార్యుల వారు తమ మండూక్య కారికలలో –
“న నిరోధో న చోత్పత్తిః న బద్ధో న చ సాధకః |
న ముముక్షు : న వై ముక్తః ఇత్యేషా పరమార్థతా ॥ (మాం-కా. 2-32)
– “ప్రళయము లేదు; జననము లేదు; బద్ధుడు లేడు; సాధకుడు లేడు; ముముక్షువు లేడు; ముక్తుడు లేడు – ఇదే పరమ సత్యము” అని పై కారిక యొక్క భావము.
ఈ కారికను వివరిస్తూ శ్రీ శంకరులు తమ భాష్యంలో
“కథ ముత్పత్తి ప్రలయయో రభావఇత్యుచ్యతే |
ద్వైతస్య అసత్త్వాత్ “యత్ర హి ద్వైత మివ భవతి”||
“య ఇహ నానేవ పశ్యతి”, “ఆత్మైవ ఇదం సర్వం”|
“బ్రహ్మైవ ఇదం సర్వం”, “ఏకమేవ అద్వితీయం”||
“ఇదం సర్వం యదయ మాత్మా” – ఇత్యాది నానా శ్రుతిభ్యః ద్వైతస్య అసత్యం సిద్ధమ్”.
“జనన- మరణములు లేకపోవుట ఎట్లు ? ఈ ప్రశ్నకు సమాధానము ఇది; ద్వైతము లేదు గనుక. ‘ద్వైతము వలె ఉన్నది’, ‘అనేకమును వలె దర్శించును’, ‘ఇది అంతయు ఆత్మయే’, ‘ఇది అంతయు బ్రహ్మమే’, “అద్వితీయమయినది ఒక్కటే, “ఇది అంతయు ఆత్మ” – ఇటువంటి వివిధ శ్రుతివాక్యముల వలన ద్వైతము లేదని నిరూపితమయినది” అని వివరించిరి.
“ఒక్కటిగా ఉండి రెండుగా కనిపిస్తున్నది” – అని అమ్మ చెప్పింది.
అజ్ఞానమయ మయిన అహంకారమే జీవుడు. ఈ జీవుడు సుషుప్తి, సమాధులలో లేడు; జాగ్రత్, స్వప్నావస్థలలో ఉన్నాడు. అవస్థాత్రయ సాక్షి అయిన ఆత్మ సర్వదా ఉన్నాడు. అనగా మిథ్యారూపుడయిన జీవుడు జనన మరణములకు వశుడు గాని, ఆత్మ జనన మరణాతీతము.
ఈవిషయమును సిద్ధాంతంగా చెబుతూ శ్రీ గౌడపాదులు
“న కశ్చి జ్జాయతే జీవః సమ్భవో స్య న విద్యతే |
ఏతత్త దుత్తమం సత్యం యత్ర కించిత్ న జాయతే|” (మా.కా.4-71) –
“ఏ జీవుడు పుట్టుట లేదు; ఆ పుట్టుటకు కారణము లేదు. ఎవ్వడు పుట్టుట లేదన్నది పరమ సత్యము” అని పై కారికా భావం.
కాబట్టి పరమాత్మ స్వరూపిణి అయిన అమ్మకు జననమూ లేదు, మరణమూ లేదు. జీవభావం తొలగని అస్మదాదులకు జనన-మరణ బాధానుభవం తప్పదు. “అనుభవం లేకపోతే మహావాక్యాలు మన వాక్యాలే అవుతాయి” అని అమ్మ చెప్పినట్లు “అహం బ్రహ్మాస్మి” మొదలగు వాక్యముల ఉచ్చారణ గూడ మనకు సహకరింపదు. అందువలన అమ్మ సూచించిన విధంగా ఏకాగ్రచిత్తంతో శ్వాసను గమనించటం ద్వారా గానీ, నిరంతరమయిన ఆత్మవిచారం వలన గానీ, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునకు సంపూర్ణ శరణాగతి చేయటం వలన గానీ, అనన్యభావంతో భగవన్నామజపం ద్వారా గానీ తీవ్రసాధన చేయు వ్యక్తి మాత్రమే జీవభావ విముక్తుడయి జనన మరణ విముక్తుడవుతాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణభగవానుడు –
“మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే |
యతతా మపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ||” (థ.గీ.7-8)
“ఐహూనాం జన్మనా మర్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వ మితి స మహాత్మా సుదుర్లభః ॥ (భ.గీ.7-19)
“వేలకొలది మానవులలో ఒకానొకడు యోగసిద్ధికై ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే సాధకులలో ఒకానొకడు మాత్రమే నన్ను యధార్థముగా తెలిసికొనును.”
“అనేక జన్మల తరువాత మానవుడు జ్ఞాని అయి, నన్ను పొందును; సర్వము వాసుదేవమయము (సర్వము బ్రహ్మమయము) అని భావించునట్టి మహాత్ముడు అత్యంత దుర్లభుడు” అని భగవద్గీతలో చెప్పిన వాక్యముల తాత్పర్యమును సత్యసాధకుడు చక్కగా గ్రహించి సాధన గావింపవలెను.
వివిధ సాధకులకు అనుకూలంగా అమ్మ సన్నిధిలో కార్యక్రమాలు రూపొందింపబడినాయి. నిష్కామంగా భగవతీ సమర్పణ బుద్ధితో సేవించి మనశ్శుద్ధిని సంపాదించి తరించటానికి విద్యా, వైద్యకేంద్రాలు, అన్నపూర్ణాలయం ఉన్నాయి. అనన్యభక్తితో సర్వభూతహితంగా ఆరాధించి నిర్మలాత్ములయి తరించటానికి ఆలయాలున్నాయి. ఏకాగ్రచిత్తంతో ధ్యానం చేసికొనే వారికై ధ్యాన మందిర మున్నది. ఇవి అన్నీ – నిస్స్వార్థంగా నిరహంకారంగా విశ్వజననీ సమర్పణ భావంతో సేవించి ఆరాధించి పరస్పరాశయాలను గౌరవించుకొంటూ అన్ని కార్యక్రమాలూ అమ్మ ఆరాధనా విధానాలే అన్న విశ్వాసంతో పురోగమించే వారికి ‘అందరిల్లు’ పరమశ్రేయః; ప్రాప్తి సాధనం కాగలదని నిరూపిస్తాయి. అపుడు మన జన్మలు “జ్ఞానార్థ సంస్కారా శ్రయాలయి,” సర్వమూ వాసుదేవమయము లేక పరమేశ్వరీమయము అను భావన మనకు అనుభూతమయి మన మానవజన్మ చరితార్థమవుతుంది.
“ఎవరీ అమ్మ?” అనే ప్రశ్నకు ఇదే సమాధానం అనిపిస్తుంది. విశ్వజనని అయిన అమ్మ సాధక సోదరులందరికీ సమదృష్టిని సహనశక్తినీ సర్వప్రాణి శ్రేయస్కర బుద్ధినీ సర్వభూతాత్మతాసిద్ధినీ ప్రసాదింపవలసినదని సాంజలి బంధంగా ప్రార్థిస్తున్నాను.