1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఎవరీ అమ్మ ?

ఎవరీ అమ్మ ?

Pannala Radhakrishna Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : May
Issue Number : 10
Year : 2022

(గత సంచిక తరువాయి)

అహంకారమయుడయిన జీవుని కర్మక్షయం కోసము నియతి సుఖదుఃఖాదులను కల్పిస్తుంది. నియతి అనగా పరచితి అయిన పరమేశ్వరియే అని గ్రహించాలి. అయితే సర్వకారణములకూ కారణరూపిణి అయిన పరమేశ్వరికి విషయబుద్ధి నిర్ణయత్వము ఆపాదింపబడినట్లే కదా! అని ఆక్షేపం తలయెత్తుతుంది. ఈ ఆక్షేపానికి శ్రీ శంకరభగవత్పాదులు “వైషమ్య నైర్ఘృణ్యేన సాపేక్షత్యా త్తథాహి దర్శయతి” (బ్ర. సూ. 2-1-34) అను బ్రహ్మ సూత్రమును వివరించే తమ భాష్యంలో విపులంగా చర్చించి చక్కని సమాధానమును అనుగ్రహించారు. వారి పూర్వపక్ష చర్చను వదలి సిద్ధాంత వాక్యములను మాత్రమే ఇక్కడ ఉదాహరిస్తున్నాను :- ‘అతః నాయ మీశ్వరస్య అపరాధః I ఈశ్వరస్తు పర్జన్యవత్ ద్రష్టవ్యఃI యథాహి పర్జన్యో వ్రీహిం యవాది సృష్ణా సాధారణం కారణం భవతి, వ్రీహి యవాది వైషమ్యేతు తత్త ద్బీజగతాన్యేవ అసాధారణాని సామర్థ్యాని కారణాని భవన్తి, ఏవమీశ్వరో దేవ మనుష్యాది సృష్ణా సాధారణం కారణం భవతి. దేవ మనుష్యాది వైషమ్యేతు తత్త జీవగతాన్యేవ అసాధారణాని కర్మాణి కారణాని భవన్తి, ఏవమీశ్వరః సాపేక్షత్వాత్ న వైషమ్య నైర్ఘృణ్యాభ్యాం దుష్యతి”. కావున ఇది ఈశ్వరుని దోషము కాదు. ఈశ్వరుడు మేఘము వంటి వాడని తెలిసికొనవలెను, మేఘము వరి, యవధాన్యాదుల ఉత్పత్తికి సాధారణ కారణమగును. కానీ ఆ ధాన్యాదుల భేదనమునకు మాత్రము ఆయా బీజములందున్న అసాధారణములగు సామర్థ్యములే కారణములగును. ఇట్లు ఈశ్వరుడు దేవ, మనుష్యాదుల సృష్టికి సాధారణ కారణమగును. ఈ విధముగా ఈశ్వరుడు సాపేక్షుడు. కావున విషమబుద్ధి, నిర్దయత్వములు అని పయి భాష్య వాక్యములు భావము.

‘ఈశ్వరుడు సాపేక్షుడు’ – అనగా, ‘ఈశ్వరుడు కర్మాపేక్ష గలవాడు అని అర్ధము. ఈశ్వరుడు సాపేక్షుడై నీచ- మధ్యమ – ఉత్తమ రూపమయిన సంచారమును నిర్మించునని ఎట్లు తెలియును? అని ప్రశ్నించుకొని శ్రీ భగవత్పాదులు – “ఏషహ్యేవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య: ఉన్ని నీషతే ఏష ఉ ఏవ అసాధు కర్మ కారయతి తం య మధో నినీషతే”- అను కౌశీతకీ బ్రాహ్మణ వాక్యములను ఉదాహరించిరి. “ఈ లోకములనుండి ఉద్ధరింపవలెనని తాను అనుకొన్న వానిచే ఈశ్వరుడు సత్కర్మలను చేయించును; అధోగతిని పొందింపదలచిన వానిచే అసత్కర్మలను చేయించును” – అని పయి కౌశీతకీ బ్రాహ్మణ వాక్య భావము. కావున ఈశ్వరుని అనుగ్రహ, నిగ్రహములు జీవుల కర్మ విశేషములు కథనములగుచున్నవి. ఈ విషయమును

“యే యధా మాం ప్రపద్యస్తే తాం స్తథైవ భజామ్యహమ్,

మమ వర్మాను వర్తన్తో మనుష్యాః పార్థ! సర్వశః (భ. గీ.4-11) అను శ్రీ భగవద్గీతా వాక్యము గూడ సమర్థించుచున్నది. కానీ యిక్కడ ఒక చిక్కుముడి ఉన్నది. అది ఎట్టిది? “స దేవ సోమ్యేదమగ్ర ఆసీ దేక మేవారి ద్వితీయమ్” అను (ఛాం. 6-2-1) ఛాందోగ్యోపనిషత్తు సృష్టికి ముందు ఏకము, అద్వితీయము అయిన సద్వస్తువు మాత్రమే ఉన్నది” – అని చెప్పుట చేత సృష్టికి పూర్వము కర్మ లేక పోవుట వలన శరీరాది విభాగము కర్మాధీనము గావున ఈశ్వరుడు కర్మాపేక్ష గలవాడు. అనుట ఎట్లు పొసగును? అను ప్రశ్న ఉదయించును. దీనికి సమాధానము సంసారము (సృష్టి) అనాది అనియే.

అమ్మ ఒకసారి “ఈ సృష్టి అనాది; నాది” అని చెప్పింది. ఈ వాక్యమునకు ఇట్లు అర్థము చెప్పవచ్చును. “సృష్టి నాది అనగా ఆత్మ సంబంధమయినది. ఆత్మ శాశ్వత తత్త్వముగావున సృష్టి గూడా అనాదియే”. సృష్టి అనాది అనుటకు “అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి” (ఛాం.ఉప.6 – 3 – 2) అను ఛాందోగ్యోపనిష ద్వాక్యము ప్రమాణము. మరియు

“న రూప మస్యేహ తథోపలభ్యతే,

నా న్తో న చాదిర్న చ సంప్రతిష్ఠా.” (భ.గీ. 15-3) – అని భగవద్గీత కూడ సంసారము – సృష్టి

. ‘అనాది’ అని చెబుతున్నది. అల్పజ్ఞులు, అల్పశక్తి సహితులయిన జీవులకు ఈ విచిత్ర సృష్టి విలక్షణంగా కన్పింపవచ్చు; కానీ సర్వజ్ఞుడూ, సర్వశక్తి సంపన్నుడూ, ఆప్తకాముడూ అయిన పరమేశ్వరునకు ఈ జగద్రచన కేవలం లీలమే. పరమేశ్వరుడు, పరమేశ్వరి ఒక్కరే. లింగభేదమే కానీ తత్త్వభేదము లేదు. ‘సూర్య’శబ్దము పుంలింగము; ‘సూర్యప్రభ’ స్త్రీలింగము. సూర్యరహితమైన ప్రభగానీ, ప్రభారహితుడయిన సూర్యుడు గానీ ఉండరు.

ఈ సందర్భంలో అమ్మ చెప్పిన క్రింది వాక్యాలను స్మరించుకొనటం సముచితం:-

  1. బాధలు లేనిది బ్రతుకు కాదు; అలలు లేనిది సముద్రమూ కాదు. 2. జీవితమంటే సమస్యల తోరణం – సమస్యలతో రణం.
  2. శిల్పానికి అందం రావలెనంటే ఉలిదెబ్బలు అవసరం.

కాబట్టి సుఖ దుఃఖాలను కర్మక్షయ కారకాలయిన పరమేశ్వరీ ప్రసాదంగా భావించటమే తృప్తిగా అనుభవించటమంటే. ఇక నీకు దైవదత్తంగా లభించిన సంపదను నీవు అనుభవిస్తూ పరులకు శక్తి కొలది సాయపడటమే ‘అందరికీ ఆదరణతో పెట్టుకోవటం’ అని గ్రహించాలి. కొందరు వ్యక్తులకు కొన్ని భగవద్దత్తములయిన ప్రజ్ఞా పాటవాలుంటాయి. వారు దానిని కేవలం తమ ప్రయోజనం కొఱకు ఉపయోగించుకొనటమే కాక ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి. ఉదాహరణకు విద్యావంతుడు తన విద్యను తనకు శ్రేయోదాయకం చేసికొని ఇతరుల శ్రేయస్సు కోసం వినియోగించాలి. ధనవంతుడు యథాశక్తి తన ధనమును పేదల కష్టనివారణకు ఉపయోగించాలి. వైద్యుడు బీదరోగులకు ఉచిత వైద్యసేవలను అందించాలి. ఆధ్యాత్మిక జ్ఞాని జిజ్ఞాసువులయిన సర్వసాధకులకు జ్ఞాన బోధ జేయాలి. ఇలా ఆయా రంగాలలో నైపుణ్యం కలవారు తమ తెలివి తేటలను పరుల శ్రేయస్సు కొఱకు వినియోగించాలి. ఈ వినియోగం కీర్తి ప్రతిష్ఠల కోసం కాక నిష్కామంగా భగవత్సేవాభావంతో చేయాలి. ఆదరణతో పెట్టుకోవటం అన్న వాక్యానికి ఇదే అర్థం. పరదు:ఖమును తన దుఃఖముగా, పరసుఖమును తన సుఖముగా మానవుడు భావించాలి. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు.

ఆత్మౌ పమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున,

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమోమతః (శ్రీ భ.గీ. 6-32)

– సుఖ, దుఃఖ సందర్భము లన్నింటి యందును ఇతరులను తనవలెనే చూచుకొని, అనగా, పరుల కష్టములను తనవిగానే భావించి సానుభూతితో చేతనయిన సాయము చేయువాడు యోగులలో – అని పయి శ్లోక తాత్పర్యము.

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!