“భ్రూమధ్యే నవకుఙ్కుమం మృదుగలే గ్రైవేయకం మఙ్గలం
హస్తామ్భోజయుగే సువర్ణకటకాన్ చేలం విలీనం తథాI
చోలం శుభ్రతరం తనౌ చ దధతీం స్త్రీ పూరుషైః సంవృతాం
దేవీ మర్కపురామ్బికాం హృది భజే శ్రీ రాజరాజేశ్వరీమ్ II”
- పావకప్రభ
మన మందరమూ ఆప్యాయంగా ‘అమ్మ’ అని పిలుచుకొనే జిల్లెళ్ళమూడి అమ్మ గుంటూరు జిల్లాలోని పొన్నూరు గ్రామంలో శ్రీమన్నవ రంగమాంబా సీతాపతిశర్మ దంపతుల తపః ఫలంగా రుధిరోద్గారి నాను సంవత్సర చైత్రమాస శుక్ల పక్షంలో ఏకాదశీ బుధవారం రాత్రి ఆశ్లేషా నక్షత్రంలో (28-3-1923) జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అనసూయ. ఆమెయే విశ్వవిఖ్యాతి గాంచి విశ్వజననిగా విశ్వారాధ్య అయింది. మూడేళ్ళ వయస్సునందు కన్నతల్లిని గోల్పోయిన ఆమె అనంతమయిన వాత్సల్యామృతమును అఖిల ప్రాణులకు అందిస్తూ ‘అందరమ్మ’ అయింది. కాలక్రమంలో శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారి ధర్మపత్ని అయి బాపట్ల సమీపంలో గల జిల్లెళ్ళమూడిలో నివసించింది.
అనసూయాదేవిలో ఒక విధంగా గూఢంగా ఎన్నో గాఢమయిన విశ్వజననీ భావం క్రమంగా విశ్వతోముఖంగా విస్తరింపసాగింది. సాంసారిక జీవితం గడుపుతూనే సర్వప్రాణి హితకారిణిగా ఆమె పరిణతి చెందింది.
సకల జీవులకు ఆహారం అత్యంతావశ్యకం. సహజ వాత్సల్య సముజ్జ్వల హృదయ అయిన అమ్మ ఆకలి బాధనూ ఆహారపు విలువనూ గమనించి తాను క్షుధార్తులకు అన్నం పెడుతూ తన చుట్టూ ఉన్న బిడ్డలకు ఆదర్శంగా నిలిచింది. ప్రతిదినము ప్రతిగృహిణి వంట చేయటానికి ముందు ఒక పిడికెడు బియ్యం వేరుగా తీసి అలా ప్రోగయిన బియ్యముతో ఆకలిబాధతో ఉన్నవారికి అన్నం పెట్టటానికి ఉపయోగించవలసినదని అమ్మ గృహిణులకు బోధించింది. అన్నపూర్ణాదేవి రూపాంతరముయిన అమ్మ వాత్సల్యం కాలాంతరంలో అన్నపూర్ణాలయంగా ఆవిర్భవించింది. అది నేటి అశేష ప్రజాసందోహానికి ఆకలిబాధను తీరుస్తున్నది.
మానవునకు ఆకలితీర్చే అన్నమేకాక గుడ్డ, గూడు కూడ ముఖ్యములే. ఈ విషయంలో గూడ అమ్మ ఆదర్శంగా భాసించింది. తన దర్శనం కోసం వచ్చిన బిడ్డలకు నూతన వస్త్రాలను ప్రసాదిస్తూ సంపన్నులయిన తన బిడ్డలు శక్తివంచన లేకుండా వస్త్రహీనులయిన సాటి సోదరులకు వస్త్రాలను ఇమ్మని అమ్మ ప్రబోధించింది. తన నివాసానికి ‘అందరి యిల్లు’ అని నామకరణం చేసి ఆశ్రితులకు ఆశ్రయమిచ్చి నిరాశ్రయులకు ఆశ్రయం అందించవలసినదని అమ్మ ఆదేశించింది. అమ్మ చేసిన ఈ సూచనలు పలు తావులలో ఆచరణ రూపం ధరిస్తున్నాయి.
అమ్మ విశ్వజననీత్వంలో విద్యావైద్య సౌకర్యాలు అత్యావశ్యకములైన ఎంత ఇచ్చినప్పటికీ తరగకుండా పెరిగేది విద్యాధనం. అందుకే భర్తృహరి మహాకవి. “విద్యా నా ప్రచ్ఛన్న గుప్తం” అనీ, “వాగ్భూషణం భూషణం’ అనీ విద్యా విశిష్టతను కీర్తించారు. ‘విద్య’ అనే పదానికి ‘సర్వవిధ లౌకిక జ్ఞానదాయిని’ అనే అర్థమున్నప్పటికీ ‘ఆత్మ జ్ఞానమే’ యధార్థమైన విద్య అనబడుతుంది. ఇటువంటి ఆత్మజ్ఞానానికి దారి తీసే విధంగా ఉచిత భోజన వసతి సౌకర్యాలతో ఒక ఉన్నత సంస్కృత పాఠశాలని, సంస్కృతాంధ్ర కళాశాలని జిల్లెళ్ళమూడిలో అమ్మ స్థాపింప జేసింది. మూర్తీభవించిన ఆత్మజ్ఞానమయన అమ్మ విశ్వజనీన తత్త్వమును విద్యార్థులు చక్కగా ఆకళింపు జేసికొని నానా విధ సుఖ దుఃఖ మిశ్రితమయిన జీవితమును ధీరగంభీరంగా గడుపుతూ ఆదర్శపౌరులుగా రూపొందవలెనని విద్యాలయ స్థాపకుల ఆకాంక్ష. ఈ లక్ష్యసాధనకై కృషి చేస్తున్న అధ్యాపకులు తాము స్వయంగా నిరంతరం అధ్యయన శీలురుగా ఉండి అధ్యాతలకి ఆదర్శప్రాయంగా నిలిచి విశ్వజననీ విశ్వజనీన భావాలకు ప్రతిబింబాలుగా విద్యార్థులను తీర్చిదిద్దాలనీ అటువంటి శక్తియుక్తులను వారికి అమ్మ అనుగ్రహింపవలెననే మాతృశ్రీ విద్యాపరిషత్తు యొక్క అభ్యర్ధన.
మానవునకు విద్యతో బాటు ఆరోగ్యం గూడ ఆవశ్యకమే. ఎంత విద్యావంతుడయినా చక్కని ఆరోగ్యం లేకపోలే జన్మతారకమయిన ఆధ్యాత్మిక సాధనలను చేయజాలరు. ఈ కారణంగానే కవికుల గురువు – అయిన కాళిదాస మహాకవి “శరీర మాద్యం ఖలు ధర్మసాధనం” – అని ఉదోషించారు. ఇటువంటి ఆరోగ్యమును పరిరక్షించటం కోసం అమ్మ ఒక ఉచిత వైద్య కేంద్రమును జిల్లెళ్ళమూడిలో నెలకొల్ప జేసింది. ఈ కేంద్రంలో పని చేస్తున్న వైద్య బృందం ఇతర వైద్యుల సహకారంతో స్థానికుల ఆరోగ్యావసరాలను తీర్చటమే కాక పరిసర గ్రామాలలో గూడ పర్యటించి అక్కడి రోగార్తులకు తగు విధంగా సేవ చేస్తున్నారు.
పలు భౌతికావసరాలతో బాటు ఆధ్యాత్మిక సాధకుల ఉపయోగార్థం అనసూయేశ్వరాలయం, హైమాలయం, మొదలయిన ఆరాధన మందిరాలను అమ్మ జిల్లెళ్ళమూడిలో స్థాపింప జేసింది. నిరాశ్రయులయి ఆత్మీయులకు దూరమయిన వృద్ధుల కోసం ‘ఆదరణాలయం’ అమ్మ ప్రణాళిక లోనిదే. అది గూడ అనతికాలంలో రూపుదిద్దుకొన బోతున్నది. ఈ కార్యక్రమాలన్నీ శ్రీ విశ్వజననీ పరిషత్ – మాతృశ్రీ కార్యనిర్వహణ విద్యాపరిషత్తుల సంయుక్త పర్యవేక్షణలో చక్కగా జరుగుతున్నాయి. కార్యకర్తలందరూ నిస్వార్థంగా జగజ్జననీ సేవగా కార్య నిర్వహణ చేస్తున్నారు. అనతి కాలంలో జిల్లెళ్ళమూడిని సర్వాంగ సుందరమయిన ఆదర్శప్రాయమయిన ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా రూపొందింపవలెనని కార్యనిర్వాహకుల పరమాశయం. ఈ ఆశయ విజయానికి అప్రతిహతమయిన అమ్మ అనుగ్రహశక్తి అండగా ఉన్నది, ఫలితంగా భక్త పుత్రుల సహకారం అద్భుతంగా అందుతున్నది. ఇది జిల్లెళ్ళమూడిలో ప్రస్తుతం జరిగే వివిధ సేవాకార్యక్రమాల సంక్షిప్త స్వరూపం.
మానవజన్మ చరితార్థతకు పయి కార్యక్రమాలన్నీ బాహ్యమయిన ఉపకరణాలు. కాగా మానవులకు, ముఖ్యంగా ముముక్షువులకు, అమ్మ తన సూక్తుల ద్వారా ప్రసాదించిన సందేశ సారమును స్థాలీపులాకన్యాయంగా తెలిసికొనటానికి ప్రయత్నిద్దాం. వాస్తవంగా అమ్మ జీవితమే సర్వమానవజాతికి ఒక దివ్య సందేశం.
“నీకున్నదానిని తృప్తిగా అనుభవించి, ఇతరులకు ఆదరణలో పెట్టుకో” – సూక్తి సాధారణమయినదిగా అనిపించినా వ్యక్తి యొక్క ఆలోచనా పాటవాన్ని అనుసరించి అనేకమయిన అర్ధాలు గోచరిస్తాయి:-
నీకు దైవదత్తమయిన ధనధాన్యాదులను తృప్తిగా – అనగా – కార్పణ్యరహితంగా అనుభవిస్తూ లేనివారికి ఆదరణతో అనగా- ఆత్మీయతా భావంతో వానిని అందించాలి అని సామాన్యార్థం..
నీకున్నది అనగా- పురాకృత సుకృత, దుష్కృత కర్మ ఫలితంగా ఈ జన్మలో సంభవించిన సుఖ – దుఃఖ పరం పర అని మరియొక అర్ధము. అజ్ఞానంతో మనం చేసిన కర్మలే మనం అనుభవించే సుఖదుఃఖాలకు మూలం. వీనికి ఇతరులెవ్వరూ బాధ్యులు కారు. కానీ అనుభవసమయంలో- విశేషించి కష్టానుభవ కాలంలో అజ్ఞానం – వలన అన్యులను ద్వేషించి తెగడుతూ ఉంటాము; కొన్ని సమయాలలో దైవదూషణకు గూడ పాల్పడతాము. ఈ సందర్భంలో అధ్యాత్మ రామాయణంలోని యీ శ్లోకం సావధానంగా పరిశీలింపదగినది
‘సుఖస్య దుఃఖస్య న కో పిదాతా
పరో దదాతీతి కుబుద్ధిరే షాI
అహం కరోమీతి వృథాభిమానః
స్వకర్మ సూత్రే గ్రధితో హి లోకః ॥” – “సుఖమును, దుఃఖమును ఇచ్చువారు ఎవ్వరును లేరు; ఇతరుడు ఇచ్చుచున్నాడు అనుట దుర్బుద్ధి: నేనే చేసికొనుచున్నాను అనుకొనుట వ్యర్ధమయిన అభిమానము. ఏలననగా లోకము తన కర్మసూత్రము చేత బద్ధమయినది” అని పై శ్లోక భావము.
- (సశేషం)