(గత సంచిక తరువాయి)
- డా.పన్నాల రాధాకృష్ణశర్మ
“నిగ్రహం కోసమే విగ్రహారాధన” అనేది ఆలోచనామృతమయిన మఱియొక సూక్తి.
ఇక్కడ ‘నిగ్రహము’ అనగా మనోనిగ్రహము అది అర్థం. మనోనిగ్రహం కోసం మానవునకు విగ్రహారాధన అవశ్యకమవుతుంది. నామరూపరహితమూ నిర్గుణమూ అయినది పరతత్త్వము. అట్టి పరతత్త్వం మీద మనస్సును నిల్పటం దేహాభిమానం కల సాధకునకు అసాధ్యం. అందువలన అతడు నామరూప సహితమైన సగుణ తత్త్వమును భగవంతునిగా లేక భగవతిగా ఆరాధించాలి. భగవన్నామ జపం, భగవద్విగ్రహారాధన, భగవద్గుణ కీర్తనం వలన మనస్సు భగవన్మయమై తన ఉనికిని కోల్పోతుంది; అనగా సాధకుడు అహంకార విరహితుడవుతాడు. మనస్సునకు మరొక పేరు అహంకారం. మనోనిగ్రహమనగా అహంకార రాహిత్యమే. అహంకార రూపమగు మనస్సు నశించినపుడు కేవల ‘చిత్’ రూపమగు ఆత్మయే మిగులుతుంది. ఆ ఆత్మయే పరమాత్మ. ఆ స్థితిలో నిరాలంబమైన ఎఱుక మాత్రమే ఉంటుంది. అదే కైవల్యస్థితి. “వైకల్యం లేనిదే కైవ్యలం” – అనే అమ్మ సూక్తికి ఇదే అర్థమనిపిస్తుంది.
కాబట్టి సర్వవ్యాపకమయిన పరతత్త్వమును (ఆత్మను) తెలిసికొనటానికి విగ్రహారాధన ఒక సాధన మాత్రమే. తీవ్రజిజ్ఞాసతో నిరంతరాత్మాను సంధాన పరాయణులయిన మహాత్ములకు విగ్రహారాధనతో నిమిత్తం లేకుండా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అనగా అమ్మ చెప్పిన ” అంతా ఆత్మగా తోచటమే ఆత్మ సాక్షాత్కారం” అనే సూక్తి ఆ మహనీయునిపట్ల సార్థకమవుతుంది.
“సర్వ భూతస్థ మాత్మానం సర్వ భూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥ (భ. గీ.6-29)
“యోగసిద్ధుడయిన మహాత్ముడు సర్వభూతముల యందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను దర్శించుచు నానాత్వమునందు ఏకత్వమును, ఏకత్వమందు భిన్నత్వమును దర్శించుచు సమదృష్టి జ్ఞానదృష్టి కలిగి ఉండును” అని పై శ్లోక తాత్పర్యము. ఇట్టి సమదృష్టి తన బిడ్డలకు కలుగవలెనని అమ్మ “నిగ్రహం కోసమే విగ్రహారాధన” అను సూక్తిద్వారా బోధిస్తున్నదని గ్రహించాలి.
ఈ సందర్భంలో శ్రీమద్భాగవతము నందు శ్రీమన్నారాయణాంశ సంభవుడయిన శ్రీ కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి చేసిన క్రింది ఉపదేశభాగం స్మరింపదగినది.
“అహం సర్వేషు భూతేషు భూతాత్మా వస్థితః సదా|
త మవజ్ఞాయ మాం మర్త్యః కురుతే ర్చా విడమ్బనమ్ || (శ్రీ భా.3-29-21)
యో మాం సర్వేషు భూతేషు సన్తమాత్మాన మీశ్వరమ్ |
హిత్వా ర్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహెూతి సః॥ (శ్రీ భా.3-29-22)
ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః | (శ్రీ భా.3-29-23)
భూతేషు బద్ధ వైరస్య న మనః శాన్తి మృచ్ఛతి॥
అహ ముచ్చావచై ర్భవైః క్రియ యోత్పన్నయా 2 నఘే|
సైవ తుష్యే- ర్చితో ర్యాయాం భూతగ్రామావమానినః || (శ్రీ భా.3-29-24)
అర్బాదావర్చయే త్తావదీశ్వరం మాం స్వకర్మకృత్ ||
యావన్నవేద స్వహృది సర్వభూతేష్వవస్థితమ్॥ (శ్రీ భా.3-29-25)
ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యన్త రోదరమ్ |
తస్య భిన్నదృశోమృత్యు ర్విదధే భయ ముల్బణమ్ || (శ్రీ భా.3-29-26)
“నేను సర్వభూతముల యందు నిరంతరము ఆత్మగా ఉన్నాను; అట్టి నన్ను అవమానించి మానవుడు అర్చన అను మోసమును జేయును. సకలభూతములందు ఆత్మరూపమున ఉన్న ఈశ్వరుడనగు నన్ను వదలి మూఢత్వముతో విగ్రహమును భజించువాడు బూడిదలో హెూమము చేయువానితో సమానుడు. గర్వముతో – సర్వాంతర్యామి ఒక్కడే అన్న దృష్టి లేక పరుల శరీరములందున్న నన్ను ద్వేషించుచు భూతములందు వైరము గల వానికి మనశ్శాంతి లభింపదు. ప్రాణి సమూహమును అవమానించువాడు నానావిధ ద్రవ్యములతో విగ్రహము నందు నన్ను అర్చించినను నేను తృప్తిచెందను.”
అట్లయినచో విగ్రహారాధనము వ్యర్థమా? అని యెడల, కాదు అని దాని ప్రయోజనమును వివరించినాడు. “సర్వభూతముల యందున్న నేను (పరమాత్మ) తన యందున్నట్లు తెలిసి కొననంత వరకు మానవుడు భగవదర్పితముగా స్వకర్మానుష్ఠానము గావించుచు విగ్రహాదులను అర్చింపవలెను”.
సాధకుడు తనకు ఇతరునకు మధ్య కొంచెము భేదము జూపినను భిన్నదృష్టి గల అతనికి మృత్యుభయము గల్గును. సర్వభూతములయందు అంతర్యామిగా ఉన్న నన్ను సమదృష్టితో ఆవశ్యక వస్తువులను ఇచ్చి, మన్నించి అర్చింపవలెను; అనగా గౌరవభావముతో జూడవలెను” అని పై శ్లోకముల సారాంశము. స్థలాభావము వలన ప్రతి శ్లోకమునకు ప్రత్యేకమయిన వివరణమును ఇవ్వలేదు. ఇట్టి ఉదాత్త భాగవత భావముల నుండియే ‘మానవసేవయే మాధవసేవ’ అను సూక్తి పుట్టిన దనిపించుచున్నది.
(సశేషం)