ఏ సందర్భంలో చెప్పిందో తెలియదు. ఒకసారి అమ్మ అన్నది “బాబూ! నీవు కావాలని అనుకున్నవి, వద్దని అనుకున్నవి, అన్ని నీ పాత్రలో వేస్తున్నా. అవన్నీ నువ్వు స్వీకరించాల్సిందే. సంతోషం కలిగించినా, దుఃఖం కలిగించినా ఆ అనుభవాలన్నీ నా వరాలని ఆనందంతో అనుభవించు. గెలిచినా, ఓడినా, పొంగవద్దు, క్రుంగవద్దు. ఎందుకంటే నేనే ఆ అనుభవాలన్నీ ఇచ్చా.”
అమ్మ చెప్పినవి, చేయమన్నవి సునాయసంగా అర్ధమవుతాయి. అర్థం అనాయాసంగా తెలుస్తుంది. కాని ఆచరణలో పెట్టటం కష్టం. ఎందుకు ఆచరించటం కష్టం? అది కష్టమని అనుకున్న వాళ్ళని (వీళ్ళలో నాదే మొదటి పేరు! ఉద్దేశించి కొన్ని ఆలోచనల పర్యవసానం ఈ నాలుగు మాటలు.
మొదట: “నేనే” అన్ని అనుభవాలని ఇచ్చాను అని అమ్మ ఏ సందిగ్ధం లేకుండా చెప్పింది. తానే ఇచ్చానని ధృవీకరించినపుడు అమ్మ ఇచ్చినవి అన్నీ అంగీకరించాలి కదా! ఇంగ్లీషులో “You have to take them all” అని ఉంది. “have to” అంటే కేవలం అంగీకరించాలి అనటం కన్నా, “అంగీకరించాల్సిందే” అని నొక్కి చెప్పే అర్థం గ్రహించాలి అనిపిస్తుంది. అమ్మే ప్రసాదిస్తే కాదని అనగలమా? లేక అనగలిగే అవకాశం కాని, ధైర్యం కాని ఉన్నదంటే ఏమనుకోవాలి?
మరొక సూక్ష్మం: “have to” తోపాటు “take them all” అంటుంది అమ్మ. ఏది ఇచ్చినా, అది అంగీకరించాలి. ఇంగ్లీషులో Mother of all అని అన్నప్పుడు విశ్వజనని, అందరి అమ్మ అన్న అర్ధంతోపాటు giver of all అన్నీ అమ్మ అని కూడా అనుకోవటం అవసరం. ఆమె సంకల్పంలో ఆమె దృష్టిలో “అనుకున్నవన్నీ” ఇదీ ఒక అర్ధమే. All అన్నీ వుంటే అన్ని అనుభవాలు, విభజనకి తావిచ్చి మన “బుద్ధి” ప్రకారం వాటిలో ఎంచుకునే అవకాశం లేనివి; అవకాశం లేదనే స్పష్టంగా అమ్మ చెపుతోంది. అమ్మ ప్రసాదించిన వాటిని మన స్పందనలతో ముడిపెట్టకుండా యధాతధంగా అంగీకరించాలి.
మనకి కావాలని మనం అనుకున్నవి. మనకి అవసరమని అమ్మ అనుకున్నవి. రెండూ ఒకటైతే మంచిదే. కాకపోతనేనే దిగులు, చికాకు. ఇవి కూడా చికాకు పెట్టినా ఆ దిగులు లోంచే, ఆ చికాకు నుంచే అంగీకరించే శక్తి ఆవిర్భవించేటట్లు చేయగలిగే శక్తి, సహనం కూడా ఆ శక్తిపీఠం నుంచి రావల్సిందే! గొంగళిపురుగు నుంచి సీతాకోకచిలుక వచ్చినట్లు స్థూలంగా కనిపించే నిరుత్సాహం, దిగులు నుంచే ఆచరించే శక్తి వస్తుంది. ఆమె అది కూడా ప్రసాదించే మూలవిరాట్.
మరి కొన్ని అనంగీకారంగా తోచటం ప్రకృతి సహజధర్మమే. మామిడి పిందె వగరుగా ఉంటుంది. మామిడికాయ పుల్లగానూ, మామిడిపండు తియ్యగానూ ఉంటాయి. దేని ఉపయోగం దానిదే. దేని పాత్ర దానిదే. పండు ఊరగాయకి పనికిరాదు. కాయ తినటానికి కాక సంవత్సరం పొడుగునా పనికివచ్చే ఊరగాయకి అవసరం. బహుశః అనంగీకారంగా కనిపించే అమ్మ చేష్టలు మరింత విలువైనవి. జీవితం పొడుగునా “పనికి” వచ్చేవి ఇవ్వే అనుకొనటం మరింత వివేకంతో కూడినది అనిపిస్తుంది.
ఆనందంతో అమ్మని తలుచుకున్నా, “నువ్వు చెప్పినవి ఆచరించలేక పోతున్నా’ అన్న బెంగతో భావించినా అమ్మ మన భావనా స్రవంతిలో ఉన్నట్లే కదా! ఒకటి ప్రకృతి, మరొకటి వికృతి అనుకుంటేనే సమస్య. ఆ విధంగానే ఆలోచిస్తాం అంటే అదీ అంగీకారమే. “ఏదీ మన చేతిలో లేదు” అని అనుకొని, జీవించటం కష్టమని మనకి అనిపించినా, మన శక్తిని మించిన దాన్ని మోయమని ఏ తల్లి అనదు. అమ్మకి ఆ ఆలోచనే ఉండదు. (అని అనుకుంటున్నా).
అమ్మ ఒక సందర్భంలో మరో సూక్ష్మం చెప్పింది. “It is I who must give you everything at all times” “I” ని ‘నేను’ అని చెప్పకుండా “నేనే” అని చెప్పుకోవాలి. “నేను మాత్రమే” అని చెప్పటం మరింత అర్ధవంతం. “I alone” అనచ్చు. మరి “everything” అంటే? “ప్రతీది” అని చెప్పొచ్చా. అపుడు మనం కాంక్షించే (ఒక్కొక్కసారి “కాంచే” ప్రతీది అని అనటానికి లేదు. ఎంచేతంటే ఎంతెదిగినా (అని భావించినా) అమ్మ ఒడిలో ఉన్న బిడ్డలం మనం అన్న స్పృహ స్థిరంగా ఉన్నపుడు, “అడక్కుండానే అన్నీ ఇచ్చే వ్యక్తే అమ్మ” అన్న వాస్తవాన్ని సరిగా జీర్ణించుకుంటాం. మనం “కోరినవి కాదు మనకి “కావలసినవి” ఇస్తుంది. ఒకసారి ఎవరో “మీరు ఏమైనా ధ్యానం చేస్తారా?” అని అడిగితే “మీ ధ్యానమే” అన్నది అమ్మ.
ఈ విధంగా ప్రవర్తించటానికి ఆస్కారం, ఆధారం అమ్మ చెప్పనే చెప్పింది. ఆమె ఇచ్చేవన్నీ “వరాలు” మంచి చెడు అన్న విభజన మనసు చేసే విభజన. వాస్తవానికి తొడిగిన మన ఆవేశ, కావేశాల ముసుగు. ఒకసారి గజేంద్రమోక్షం ఘట్టం వివరిస్తూ శ్రీరామసర్ అన్నారు. తనను హింసిస్తున్న మొసలి కూడా ఆయన సృష్టే అనుకుంటే ఆ విచక్షణ, వివేకం ఉంటే – గజేంద్రుణ్ణి రక్షించటానికి పరుగు పరుగున శ్రీ మహావిష్ణువు రావలసిన అవసరం ఉండేది కాదు కదా! అమ్మ “ఇందుగలదు, అందులేదని” అనుకోగలమా? గజేంద్రుడు ఆ విపత్తుకి ఎన్నుకున్న నిమిత్తమాత్ర పరికరం ఆ “మకరం”. అమ్మ మనకి సృష్టి అంతా తానే అన్న వాస్తవం మనలో స్థిరంగా నాటుకొనటానికి ఏ పరికరాలు ఎన్నుకుంటుందో మనకి తెలియదు. అది మన పనికాదు.
ఇదంతా మంచి, చెడుల విభజన మన మనస్సు అనారోగ్యం అని – ఈనాటి మానసిక శాస్త్రజ్ఞులు ఏనాడో ఎనుక్కున్న సత్యం అని ధృవీకరిస్తున్నారు. ఈ రకంగా ధృవీకరించి చెప్పటం అమ్మ స్వభావం కాదు. ఒక ప్రశ్నకి జవాబు చెపుతూ అమ్మ అన్నది ఈ ద్వంద్వాలకు ఏ పేరైనా పెట్టుకుందాము. దీని పేరు పుణ్యపాపాలనుండి, మంచి చెడ్డలనండి. ద్వంద్వమే అనేకమైంది కనుక అందులో అనేక రకాలుగా వస్తుందని భిన్నత్వం లేకపోతే సృష్టేలేదని, భిన్నత్వం లేని మనస్తత్వం ఎక్కడుంటుందో అదే దైవత్వం అని నా ఉద్దేశం…. మేడలో వున్నవాడూ బాధపడుతున్నాడు. ఒకడొక రకంగా బాధపడ్తుంటే ఇంకొకడు ఇంకొక రకంగా బాధపడ్తున్నాడు.”
ఈ అంశాన్ని మరింత “పదునుగా” చెప్పింది అమ్మ. “ఆనందమనగా ఎట్టిది?” అని ఒకరు అడిగితే, అమ్మ అన్నది. “ఆనందమంటే దుఃఖము, సంతోషము రెండింటికి సంబంధించినది. రెండింటి కలయికే. దుఃఖము కాని, సంతోషము కాని వద్దని ప్రయత్నము చేయక, ఏది వచ్చినా స్వీకరించి అనుభవించే స్థితియే ఆనందము.” ఇంత విస్పష్టముగా చెప్పినా, ఈ రెండూ ఎక్కణ్ణించి వస్తున్నాయో కూడా స్పష్టం చేసింది. ఆ మూలం “తానే” అని చెప్పి, ఏ వెంపర్లాలు, శాస్త్ర జ్ఞానాల గందరగోళం లేకుండా వాటిని అంగీకరించటం తేలిక చేసింది.
తెలిసి తెలిసి అమ్మ దుఃఖం కలిగిస్తుందా? అన్న ప్రశ్న అటుంచండి. ఎందుకంటే ఆమె దృష్టిలో అది దుఃఖం కాదు. ద్వైతంలో దుఃఖమే. అయితే దాని అవసరం దానికి ఉంది కదా! దీనివల్ల ప్రారబ్దాలు, పునర్జన్మలు, వాటి ఫలితాలు అనుభవించటం ఈ తికమకలను పక్కకి తొలగించే అవకాశం ఇచ్చింది అమ్మ. ఇటువంటి వాటిని అలవోకగా పక్కకి పెట్టింది అమ్మ. ఒక
స్వామి అమ్మకి “సంస్కారం వుంది. శాస్త్ర జ్ఞానం లేదు. బాగా శాస్త్రం చదువుకో” అని సలహా ఇస్తారు. అపుడు అమ్మ “శాస్త్రం అనుభవం ఇవ్వదు. అనుభవం శాస్త్రాన్నిస్తుంది” అని చెపుతుంది (చెప్పి ఆ స్వామికి కోపం కూడా తెప్పిస్తుంది).
“అనుభవం” అన్నది అతి ముఖ్యమైన మాట. ప్రధానమైన క్లూ. అనుభవం నుంచే సూక్ష్మాలు తెలిసేవి. ఆ అనుభవాలని మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్న విభజనే మనం తప్పించుకోవలసింది. కాని తమాషా ఏమిటంటే ఈ తప్పించుకొనటం కూడా ఆమె ఇచ్ఛపైననే ఆధారపడి వుంది. అయితే ఈ విధంగా ఒక భావాన్ని అక్షరబద్ధం చేయటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అమ్మ ఒక సందర్భంలో చెప్పినది మరొక సందర్భంలో దానికి విరుద్ధంగా చెప్పవచ్చు……..
మనందరికి ఒక భావం సర్వసాధారణం : దేన్నైనా తప్పించగలిగే శక్తి అమ్మకు ఉన్నప్పుడు, మనల్ని కొన్ని బలహీనతలనుంచి సునాయాసంగా తప్పించవచ్చు కదా! ఈ ప్రశ్న ఒకరు అమ్మవద్ద లేవనెత్తారు. “మానవులు దుష్కర్మ చేస్తున్నప్పుడు దుష్కర్మ సత్కర్మలు రెండింటికీ కర్తవైన తల్లివి. మీరు ఈ బిడ్డల మనస్సులు మార్చి సన్మార్గంలో పెట్టవచ్చు కదా?” చాలా నిశితం. అవసరం అయిన ప్రశ్న ఇది. మరి అమ్మ సమాధానం? “నాకు దుష్కర్మ కనపడితేగా?” oh my God ! అనిపించింది ఇది మొదటిసారి నాకంట పడినపుడు. ఈ సమాధానం నన్ను ఎంతగా కదిలించిందో అంతగా కలవరపరచింది. వెంటనే “మనకి” కనిపిస్తుంది. కదా అన్న శంక కలిగింది. ఇది కూడా అమ్మ ముందరే గ్రహిస్తుంది కదా! ప్రశ్నని కొనసాగిస్తూ అన్నయ్య అన్నాడు. “మీరు మా మనస్సులు త్రిప్పి అన్నీ సత్కర్మలే చేయిస్తే జగత్తులో ఈ సంక్షోభం తప్పుతుంది కదా?”.
అమ్మ కాదనలేదు. “అవసరమైనపుడు తిప్పుతాను’ అని చెప్పింది. ఆ అవసరం ఏమిటో ‘నేను’ (మనం) ఎట్లా తీర్మానిస్తాం? మన పరిధిలో అవసరం, ఆమె దృష్టిలో అనవసరం…
ఈ అంశాలన్నింటినీ విశ్లేషించుకున్నా సారాంశం తిరిగి మొదటికే – మూలానికే వెడుతుంది. అయితే అమ్మ చెప్పిన ఒక ప్రశ్న మీ ముందు ఉంచి ముగిస్తాను. ఒక సోదరి అమ్మని అడుతుంది ” ఈ కష్టాలు ఈ జన్మకు తప్పవా?” అమ్మ స్పందిస్తూ “అది మనస్సుకు సంబంధించినదమ్మా, తృప్తికరమైన పరిస్థితులున్నపుడు మనస్సుకు సుఖంగా హాయిగా ఉంటుంది. ఇష్టమైనవి లేనపుడు కష్టంగా ఉంటుంది. ఇష్టంలేనిదే కష్టం కదమ్మా?” మరి ఆ ఇష్టాన్ని మరింత పరిపుష్టం చెయ్యమని అమ్మని అర్ధించటంలో తప్పులేదేమో!