1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఒక కొత్త ఉత్సాహం

ఒక కొత్త ఉత్సాహం

V. Dharma Suri
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : April
Issue Number : 9
Year : 2011

డిసెంబరు 31, 2010 రాత్రి అమ్మ గుడిలో పూజ అద్భుతంగా జరిగింది. హైమాలయంలో మొదటి ప్రసాదం నాకూ, ప్రేమగోపాల్గారికీ వారి సంతానానికీ. అమ్మనూతన సంవత్సరం సందర్భంగా నాకు మంచి బహుమతి ప్రసాదించింది. పూజ కాగానే గర్భగుడి ఎదుట నిలబడి పి.యస్.ఆర్ అన్నయ్య అమ్మ నామం గురించి, అమ్మ ఎందుకు అఖండ నామం ప్రారంభింపచేసిందీ, సవివరంగా చక్కటి భాషణలో చెప్పారు. మరునాడు ఉదయం 7 గంటలకు నుంచి పి.యస్.ఆర్. అన్నయ్యే స్వయంగా చాలా సేపు అఖండనామంలో పాల్గొన్నారు.

జిల్లెళ్ళమూడిలో అమ్మ ఉన్నప్పుడు అఖండ నామం 24 గంటలు జరిగేది. ఇప్పుడు ప్రయాస మీద 12 గంటలు జరుగుతోంది. మధ్యాహ్న భోజనాల తరువాత 1.00 గంట నుంచి 3.00 గంటల మధ్యలో నామంలో అప్పుడప్పుడు బ్రేక్ వస్తోంది. అన్నయ్య ఉపన్యాసం తరువాత జిల్లెళ్ళమూడిలోనే ఉంటున్న వల్లూరి హైమ వాళ్ళు ఈ విరామం వచ్చే సమయంలో నామం చేయడానికి పూనుకున్నారు. యాత్రికులుగా వచ్చే వాళ్ళల్లో నామపారాయణ గురించిన స్పృహ బాగా పెరిగింది. ఫిబ్రవరి 17 నాడు కనీసం 100 మంది నామంలో పాల్గొన్నారు. విజయవాడ నుండి వచ్చిన శారద, (పి.యస్.మూర్తిగారి కుమార్తె ధాన్యాభిషేకానికి భూరి విరాళాలు సమర్పించి, అఖండనామంలో అరగంట పాలు పంచుకుని వెళ్ళింది. వసుంధరక్కయ్య, సరస్వతక్కయ్య, సుబ్బలక్ష్మి అక్కయ్యగారు గంటల తరబడి నామం చేస్తారు. బోళ్ళ వరలక్ష్మిగారు జిల్లెళ్ళమూడి షిఫ్ట్ కావడం నామపారాయణ ప్రీత ఐన అమ్మకి అత్యంత ప్రీతిపాత్రం. మోహనకృష్ణగారు, రుక్మిణి అక్కయ్య 10, 11 రోజులు జిల్లెళ్ళమూడిలో ఉంటూ నామంలో బాగా పాల్గుంటున్నారు. నేను ఎలుగెత్తి నామం చేస్తే మిగతావాళ్ళు ఇబ్బంది పడతారని భయమున్నా, గట్టి గొంతుకతోటే నామం చేస్తున్నాను. అమ్మ సహిస్తుందన్న ధైర్యంతో.

హైమక్కయ్య కోరిక తీర్చడానికి అమ్మ ఏర్పాటు చేసిన ఈ నామ పారాయణ కార్యక్రమంలో అందరం పాల్గొంటే ఎంత బావుంటుంది. అమ్మ నామం 21 అక్షరాలు, 21 నిమిషాలు అఖండ నామంలో  కూర్చుందామా! 

అమ్మ ఉన్నప్పుడు ఎంఎంసి భవనం వెనకాల వున్న స్థలం ఒక ‘శాకంభరీ దేవాలయం’ ఎన్ని కూరగాయలు పండేవి! మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవటానికి ఆ తోట తహతహలాడుతోంది. పాండురంగారావు అన్నయ్య వేయించిన ఆ కొబ్బరి మొక్కలు, ఆకుపచ్చని కొబ్బరి కాయలతో తళతళలాడుతున్నాయి. మతుకుమల్లి శారద సంరక్షణలో 22 గులాబీ మొక్కలు పూలతో గుబాళిస్తున్నాయి. సంపెంగ, నందివర్ధనం, మందారం లాంటి పూలమొక్కలతో పాటు కరివేపాకు మొక్కలు, టమోటా మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి. మేము కంద మొక్కలు వేయిద్దామని విశ్వప్రయత్నం చేస్తే ‘సీజన్ అయిపోయింది’ అన్నారు. ఆశ్చర్యమేమిటంటే ఎంఎంసి వెనకాల బావుచేయిస్తూ ఉంటే నెలక్రితం పాతినట్లు 20 కందపిలకలు దొరికాయి. జిల్లెళ్ళమూడిలో ఎవరూ ఆ మొక్కలు పాతలేదు. ఇది అమ్మ మిరకిల్ ! ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఎంఎంసి దగ్గర టమోటో మొక్కలు, కరివేపాకు మొక్కలు, కందపిలకలు మనం వేసినవి కావు. అమ్మ మొక్కలు తనే వేసి తనే పెంచుకుంటోందా!

జిఎంఆర్ దగ్గర సుబ్బలక్ష్మి అక్కయ్యగారి సంరక్షణలో కనీసం నాలుగు రోజులకి ఒకసారి అన్నపూర్ణాలయానికి కావలసిన ఆకుకూరలు పండుతున్నాయి. రామబ్రహ్మంగారు కాలేజీ ఆవరణలో వేయించిన గుమ్మడికాయలు, సొరకాయలు అన్నపూర్ణాలయానికి హాయిగా లభ్యమౌతున్నాయి. హైమక్కయ్యకి ఇష్టమని బోళ్ళ వరలక్ష్మిగారి ద్వారా, కడియం నుండి వచ్చిన దబ్బకాయ మొక్కలు, నారింజకాయ మొక్కలు, నిమ్మకాయ మొక్కలు పాతించారు. కడియం నుంచి వరలక్ష్మిగారి ద్వారా 200 మొక్కలు జిల్లెళ్ళమూడి చేరాయి. అమ్మ సంస్థ ఎదుగుదల గురించి మాట్లాడుతూ…  లక్ష్మీనారాయణగారితో అంది ‘నీకు ములగ చెట్టులాంటి పెరుగుదల కావాలా? మర్రిచెట్టు లాంటిదా ? అని మర్రిచెట్టు 1000 సంవత్సరాలు ఉంటుంది. ఈ రోజు జిల్లెళ్ళమూడి ఒక సాగర. అమ్మ కరుణారససాగర. మనం ఏ ఉపయోగకరమైన పని ఐనా చేసుకోవచ్చు. సంస్థ నుంచి మనకి పరిపూర్ణమైన సహకారం అందుతుంది. అందరింటి ఆవరణ గురించి చెప్తూ అమ్మ అంది ‘ఇక్కడ 108 రావిచెట్లు ఉండేవి’ అని. అది ఎంత గొప్ప తపఃస్థలి. నమ్మకంతో పరమేశ్వరుణ్ణి ‘వృక్షేభ్యో’ అని నమస్కరిస్తున్నాం. ఈ రోజు అమ్మ సాన్నిధ్యంలో ఒక హరిత విప్లవం కదం తొక్కుతుంది. మల్లన్నయ్య నేల బాగు చేయించటం, నీళ్ళు ఏర్పాట్లు తోటమాలులపై యాజమాన్యం చక్కగా నిర్వహిస్తుంటే శారద, సుబ్బలక్ష్మి, వరలక్ష్మి అక్కయ్యగారు, హైమ యధాశక్తి వృక్షసంరక్షణలో మునిగిపోయారు. మొక్కల పెంపకం విషయంలో నాకు తోచిన అల్లరి నేనూ చేస్తున్నాను.

మీకు గార్డెనింగ్లోనూ, మొక్కల విషయంలోనూ అనుభవంకానీ, ఆలోచనకానీ ఉంటే, జిల్లెళ్ళమూడి వారితో మాట్లాడండి. అమ్మ సేవకి ఆలస్యమెందుకు!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!