1. Home
  2. Articles
  3. Mother of All
  4. ఒక చిన్న అనుభవం

ఒక చిన్న అనుభవం

Pothuri Vijaya Lakshmi
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 8
Month : October
Issue Number : 4
Year : 2009

అది 1965-66 మధ్యకాలం. మా నాన్నగారు శ్రీ వల్లూరి క్రిష్ణమూర్తిగారు. పెదనందిపాడులో ఉద్యోగం చేస్తూండేవారు. ఆయన P.W.D. లో ఇంజనీర్. మేమంతా అక్కడే వుండేవాళ్లం. జిల్లెళ్ళమూడి అమ్మ గురించి అప్పుడప్పుడే ప్రజలకు తెలుస్తున్నది. ఎవరో ఒకరు వస్తూనే వుండేవారు.

నాన్నగారి ఆఫీసుకి సంబంధంచినవారు, బంధువులు జిల్లెళ్ళమూడి వెళ్ళాలంటే మా ఇంటికి వచ్చేవాళ్లు. అప్పటికి రవాణా సదుపాయాలు ఇంకా వృద్ధిచెందలేదు. పెదనందిపాడు బాపట్ల మధ్య అరకొరగా నడుస్తూవుండేవి. బస్సులు. మా నాన్నగారికి గవర్నమెంట్ వారిచ్చిన జీప్, మా స్వంత కారు రెండూ వుండేవి. కాబట్టి మా ఇంటికి వస్తే మా వాహనంలో జిల్లెళ్ళమూడి వెళ్ళిరావడం సులువు అవుతుంది. ఆ కారణాన జిల్లెళ్ళమూడి వెళ్ళాలంటే మా ఇంటికి రావడం తప్పనిసరి.

ఒకసారి ఒక ఆఫీసరుగారు జిల్లెళ్ళమూడి రావాలనుకున్నారట. ఆయన ఉత్తర భారతీయుడు. బొంబాయిలో వుంటాడు. మరి ఆయనకు అమ్మ గురించి ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో అమ్మ దర్శనం చేసుకోవాలనిపించిందట. హైదరాబాదు ఏదో పనిమీద వచ్చినప్పుడు ఇటువచ్చి అమ్మ దర్శనం చేసుకోవాలని అనుకున్నారట.

ఆయన చాలా పెద్ద పదవిలో వున్నారు. నాన్నగారిని గుంటూరు పిలిపించి ఆయన ఫలానా రోజుకి వస్తారు, ఏర్పాట్లన్నీ జాగర్తగా చేయించమన్నారట నాన్నగారి పై అధికారి. వారు ఉత్తర భారతదేశం వాళ్ళు. వాళ్ళ ఆహారం వేరు. అందుకే ముందురోజు గుంటూరునించి, ఒక వంటవాడిని పంపించారు. ఆయన వంటకి కావలసిన పదార్ధాలు ఇచ్చి మరీ పంపించారు.

ఆయన మరునాడు తెల్లవారేసరికి మా ఇంటికి వచ్చేశారు. బస మా ఇంట్లోనే ఏర్పాటు చేశారు. రాగానే టీ ఇచ్చాడు ఆ వంటవాడు. బ్రెడ్ కాల్చి వెన్నరాసి ఇచ్చాడు. వేసవికాలం అవటంవలన పెదనందిపాడులో కరెంటులేదు. పెందలాడే ఎండెక్కకుండా జిల్లెళ్ళమూడి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఆయనకు భోజనం పెట్టి గుంటూరు పంపించాలి అదీ ప్రోగ్రాం.

“భోజనానికి వచ్చేస్తాం వంట చేయించమని చెప్పారు”.

“మరి అక్కడ అమ్మ భోజనం చెయ్యమంటుందిగా?” అంది అమ్మ.

“ఆ భోజనం ఈయనేం తింటారు? ఏదో చెప్పి వచ్చేస్తాం” అన్నారు నాన్నగారు.

తొమ్మిది గంటలకు ఆయన వచ్చిన కారులోనే బయలుదేరారు. ఎవరైనా జిల్లెళ్ళమూడి వెళ్తుంటే వెంట వెళ్ళడం నాకు సరదా. కాబట్టి నన్నూ బయలుదేర దీశారు నాన్నగారు.

జిల్లెళ్ళమూడి చేరుకున్నాం. కాసేపు కూర్చున్న తర్వాత అమ్మ దర్శనానికి

తీసుకువెళ్ళారు నాన్నగారు. నేనూ వెళ్ళి అమ్మ పాదాలకు దణ్ణం పెట్టుకున్నాను.

“అమ్మా! ఈయన ఫలానా. బాంబే నుంచి వచ్చారు” అని పరిచయం చేశారు నాన్నగారు. ఆయన తను తెచ్చిన పళ్ళు అమ్మకు ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకున్నారు. అమ్మ తన పాదాల దగ్గరే కూర్చోబెట్టుకుంది ఆయనని.

ఆయన హిందీలో, అమ్మ తెలుగులో ఇంచుమించు అరగంటసేపు మాట్లాడుకున్నారు. రెండు భాషల్లో మాట్లాడుకుంటున్నా ఒకే భాషలో మాట్లాడుకుంటున్నట్లే సునాయాసంగా మాట్లాడుకున్నారు. “ఇక వెళ్తాం అమ్మా” అని చేతులు జోడించారు ఆయన. అమ్మ బొట్టుపెట్టి ఆశీర్వదించింది.

నాన్నగారూ నేను కూడా వెళ్ళి శెలవు తీసుకున్నాం. మాకూ బొట్టుపెట్టింది అమ్మ. భోజనం చేసి వెళ్ళండి అని అంది అమ్మ అలవాటు ప్రకారం!

‘ఆయన అన్నం తినలేడమ్మా. మా ఇంట్లో ఏర్పాటుచేశాం. ఇంటికెళ్ళి భోజనం చేస్తాం’ అన్నారు నాన్నగారు. ‘ఏదో ప్రసాదంగా తినివెళ్ళండి నాన్నా” అంది అమ్మ.

“ఇంటికెళ్ళి తింటాంలేమ్మా. ఎంత అరగంటలో వెళ్ళిపోతాం” అన్నారు నాన్నగారు.

అమ్మ ఇంకేమి మాట్లాడలేదు.

అందరం బయటికి వచ్చాం. ఈ భోజనం విషయము ఆయనకేమీ అర్థం అయివుండదు అనుకున్నారు నాన్నగారు. తిన్నగా కారు వైపు వెళ్తుంటే ఆయనే పిలిచారు.

“అమ్మ భోజనం చెయ్యమన్నారుగా ఎక్కడుంటుంది భోజనం?” అని అడిగారు.

“ఇక్కడే పెడతారు అందరికీ పెడతారు. చాలా మామూలుగా వుంటుంది. మీరు తినలేరు” అన్నారు నాన్నగారు.

“అమ్మగారు చెప్పారుగా తినివెళ్లాం!” అన్నారాయన.

“ఇంటి దగ్గర వంట చేయిస్తున్నాం. పూరీలూ, వెజిటబుల్ పలావు” అంటూ ఆ పదార్థాల లిస్టు చదివారు నాన్నగారు.

“మరి అమ్మగారు ఇక్కడ తినమన్నారుగా?” అన్నారాయన

 “సరే ఇక్కడ కొద్దిగా ప్రసాదంలాగా తినండి. ఇంటికెళ్ళి మామూలుగా భోజనం చెయ్యచ్చు” అని నాన్నగారే రాజీకి వచ్చారు.

వెళ్ళి కూర్చున్నాం. ఆ వేళ భోజనంలో కూర కూడా లేదు. చింతకాయ పచ్చడి, పసుపు నీళ్ళలాంటి చారు, తెల్ల నీళ్ళలాంటి మజ్జిగ.

“ఇవ్వాళ మరీ మామూలుగా వుంది భోజనం. ఓ ముద్ద ప్రసాదంగా తినండి. అరగంటలో ఇంటికెళ్ళిపోతాం!’ అని మరోసారి గుర్తు చేశారు నాన్నగారు.

తను గుప్పెడన్నం పెట్టించుకున్నారు. ఆయన మాత్రం మొదటిసారి వడ్డించిన అన్నం అంతా పచ్చడి కలుపుకుని తిన్నారు. మళ్ళీ అన్నం పెట్టించుకుని చారుతో తిన్నారు. మళ్ళీ అన్నం పెట్టించుకుని మజ్జిగ పోయించుకుని జన్మలో మొదటిసారి భోజనం చేస్తున్నంత తృప్తిగా పరవశంగా తిన్నారు. నాన్నగారు నాలుగు మెతుకులు తిని వూరుకున్నారు.

భోజన కార్యక్రమం ముగిసింది.

తిరుగు ప్రయాణం అయ్యాం! కారెక్కగానే నిద్రలోకి జారుకున్నారు ఆయన. “బాగానేవుంది సంబరం. ఈయన వస్తాడని మర్యాదలన్నీ ఘనంగా చెయ్యమని నన్ను గుంటూరు పిలిపించి మరీ ఆర్డర్లు వేశారు.”

“జాగర్త జాగర్త అని ఊదర పెట్టి చంపేశారు. నానా హడావిడి చేశారు. ఇక్కడి సరుకులైతే నాణ్యంగా వుండవని, బియ్యంతో సహా అక్కడనుంచే పంపించారు. ఇప్పుడు వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఈయనగానీ గుంటూరు వెళ్ళి అక్కడ పచ్చడిమెతుకులు తిన్నానంటే వాళ్ళంతా నామీద విరుచుకుని పడతారు.’

‘ఇక్కడ కాస్త తినవయ్య ఇంటికెళ్ళి కమ్మగా తిందువుగాని అంటే ఈయన వినలేదు. కడుపునిండా పట్టించాడు.”

‘ఇలా జరుగుతుందని ఏ మాత్రం ఊహించినా ఇంత హడావిడి చేసేవాడిని కాదు. ఇప్పుడేం చెయ్యాలి? ఇంతటి భాగ్యానికి ఈయన తినే వంటలు మన వాళ్ళెవరూ వండలేరని ఉత్తరాది వంటలు వండే చెయ్యి తిరిగిన వంటవాడిని బ్రహ్మాండంగా రప్పించి మరీ వంట చేయించాం. ఇప్పడదంతా దండగ అయినది’ అని దారంతా తెలుగులో సణుక్కుంటూనే వున్నారు నాన్నగారు.

ఇంటికి చేరేసరికి ఆయనకోసం ప్రత్యేకంగా బల్ల, కుర్చీ వేయించి దానిమీద ఒక బట్ట పరచి భోజనం ఏర్పాట్లు చేయించివుంచింది అమ్మ.

ఇంట్లోనే గ్లాసుడు మంచినీళ్ళు తాగాడు ఆయన. “మరి నేను వెళ్తాను క్రిష్ణమూర్తీ! రేపు తెల్లారికల్లా హైదరాబాదు చేరాలి. పదింటికి బాంబే విమానం ఎక్కాలి” అన్నాడు. ‘మరి మీకోసం వంట చేయించాం కదా! క్యారేజీలో పెట్టి ఇమ్మంటారా?’ అన్నారు నాన్నగారు..

‘క్యారేజీ వద్దులే కాస్త రుచి చూస్తాను. పాపం నా మీద అభిమానంతో వంట చేయించారు? అని చెయ్యి కడుక్కుని బల్లముందు కూర్చున్నాడు.

‘ఆరాటమేగానీ ఏం తింటాడు? ఇప్పుడే అక్కడ సుష్టుగా తిన్నాడు. నాకు

ఆకలి మండుతుంది నాకు వడ్డించు” అన్నారు నాన్నగారు.

మాములుగా నేలమీద పీటవేసి నాన్నగారికి ఏర్పాటు చేసింది అమ్మ. గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన వంటవాడు, అమ్మ కలిసి చేసిన పదార్థాలన్నీ వడ్డించారు ఇద్దరికీ. ఇద్దరూ భోజనం మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయనేమో అన్ని పదార్థాలు బావున్నాయి బావున్నాయి అంటూ మళ్ళీ నికరంగా తిన్నాడు. నాన్నగారేమో ఒక్క ముద్ద తిని ఇక తినలేక ఆయాస పడడం మొదలుపెట్టారు. పాపం చాలా ప్రయత్నించారు తను మనసుపడి చేయించిన పదార్థాలన్నీ తినాలని. ముద్ద నోట్లో పెట్టగలిగితే ఒట్టు.

భోజన కార్యక్రమం ముగిసింది. అందరకీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుని ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు అంది మా అమ్మ.” ఇందాక ఆఫీసరుగారి కంగారులో మీరు నాకు తప్పుగా సమాచారం ఇచ్చారు. ఆయన సుష్టుగా తిన్నాడు. నాకు ఆకలిగావుంది అన్నారు. తీరా చూస్తే సుష్టుగా తిన్నది మీరు. ఆకలిలో వున్నది ఆయనా!’ అంది ఎగతాళిగా.

‘కాదు నేను చెప్పింది నిజమే. ఆయనే సుష్టుగా తిన్నాడు. నేనే మొక్కుబడిగా నాలుగు మెతుకులు తిన్నారు. అన్నారు నాన్నగారు.

అమ్మ ఆశ్చర్యపోయింది. “పోనీ ఆయన భోజనప్రియుడేమో అందుకే మళ్ళీ తిన్నాడు అనుకున్నా మీ ఆకలంతా ఏమైపోయింది?” అని అడిగింది.

“అదే నాకు అర్థం కావడంలేదు. అంతా అయోమయంగా వుంది!” అన్నారు నాన్నగారు.

“అసలేం జరిగింది. అమ్మ దర్శనం బాగా జరిగిందా?” అడిగింది అమ్మ. పూసగుచ్చినట్లు జరిగినది అంతా చెప్పారు నాన్నగారు.

“”అదీ అసలు విషయం? అమ్మ ప్రసాదం తినివెళ్ళమంటే బుద్ధిగా తినిరాక మధ్యలో మీ పెత్తనం ఎందుకంటా? అమ్మ దగ్గర అతి తెలివి ప్రదర్శిస్తే అంతే మరి!” అంది అమ్మ. 

అంతే అంటూ అమ్మని తల్చుకుని చెంపలు వేసుకున్నారు. నాన్నగారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!