నేను 1982 84 వేసవి సెలవులకు జిల్లెళ్ళమూడిలో కొన్ని రోజులు గడిపేవాడిని. నేను 8/ 9 తరగతిలో చదివే రోజులు. అమ్మ గది చుట్టూ కట్టిన వట్టివేరు తడికలకి ఆరినప్పుడల్లా బయటకి వెళ్లి నీళ్లు పోస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా నైనా అమ్మ గదిలో లేక చుట్టుపక్కల చాలా సేపు సమయం గడిపే అవకాశం దక్కేది. అప్పుడు నేను చిన్న వాడినైనా అమ్మ అన్న మాటలు కొన్ని గుర్తుండి పోయాయి. ఆ రోజుల్లో అమ్మ ఒకసారి సరదాగా ఇట్లా అన్నది ‘వీడు ఎండలోకి వెళ్లి నీళ్లు పోస్తున్నాడని తెలిస్తే దుర్గ (మా అమ్మ) నన్ను కోప్పడుతుంది” అని. ఆ రోజుల్లో చల్ల బడిన తరువాత దక్షిణ వసారాలో మంచం మీద కూర్చొని అమ్మ దర్శనం ఇచ్చేది. అప్పట్లో ఒక సాయంత్రం (year సరిగ్గా గుర్తులేదు) అమ్మ దగ్గర 10- 15 మంది ఉన్నారు. అప్పుడు PSR అన్నయ్య అమ్మ దగ్గర ఒక పద్యం చదివాడు. అది విని అమ్మ “ఇది ఏ పద్యం రా?” అని అడిగింది. అన్నయ్య శార్దూలమ్ అనో, చంపకమాల అనో చెప్పాడు (నాకు సరిగ్గా గుర్తులేదు). అప్పుడే నేను స్కూల్లో తెలుగు ఛందస్సు నేర్చుకుంటున్నానేమో, నేను గట్టిగా “అన్నయ్య – ఏది చదివినా మత్తేభం లాగానే ఉంటుంది” అని అన్నాను. అక్కడ ఉన్న కొంత మంది నవ్వారు. అమ్మ వెంటనే నన్ను సమర్థిస్తూ అన్నది – “నువ్వు (PSR అన్నయ్య) ఏది చదివినా ఏనుగు నడుస్తున్నట్టు ఉంటుందని వాడు అట్లా అని ఉంటాడు” అని. దాని తరువాత అన్నయ్యని కలిసి క్షమాపణ చెప్పాను. దానికి అన్నయ్య “ఓరి భడవా!” అని నవ్వి నన్ను భుజం తట్టాడు. ఇది అన్నయ్య తో నాకు జరిగిన, గుర్తున్న మొదటి సంఘటన. PSR అన్నయ్య నా జీవితంలో ఒక ప్రధాన పాత్ర వహించాడు. కొమరవోలు గోపాల రావు గారి కుమారై మణి గారు ఒకసారి హైద్రాబాద్లో జరుగుతున్న అనసూయావ్రతంలో PSR అన్నయ్యని – తన కూతురి వివాహానికి అబ్బాయిలెవరైనా ఉంటే చెప్పమని అడిగితే, దుర్గ పిన్ని కొడుకు కృష్ణ ఉన్నాడని చెప్పాడట. అదే నా వివాహానికి మూలం.
PSR అన్నయ్య ఎప్పుడు చూసినా నన్ను చాలా ప్రేమతో పలకరించేవాడు బాగోగులు కనుక్కునే వాడు. మనందరికీ (వయస్సు తో సంబంధం లేకుండా) ఇంత ఆప్తుడైన అన్నయ్య మన మధ్య, భౌతికంగా దూరమైనా, ఎప్పుడూ మనతోనే ఉంటాడని భావిస్తున్నాను.
మధుర మధురాలు మంజుల మంజులాలు
కరుణ కిరణాలు అమ్మ దృంగంచలాలు
భావభరితాలు సౌజన్య భాసురాలు
అమ్మ చరితలు చదువుడో అనఘులార!
– శ్రీ పి.యస్.ఆర్