సనాతన భారతీయ సంప్రదాయంలో వైయక్తిక సామాజిక జీవనగమనంలో ధర్మానికి ఉన్న ప్రాధాన్యం ప్రాశస్త్యం అందరికీ తెలిసిందే. పురాణ ఇతిహాసాది సమస్త వాఙ్మయ ప్రబోధసారం ధర్మమే. ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న మాట వినని వారుండరు. ‘ధరతి విశ్వం ఇతి ధర్మః’ – జగత్తుకు ఆధారభూతమైనది ధర్మం. అసలు ధర్మమంటే దైవమే. దైవం, ధర్మం ఒకే నాణానికి బొమ్మా బొరుసూ లాంటివి. విశ్వపరిభ్రమణం, ఒక నిర్దిష్ట ప్రణాళికాబద్ధంగా సాగటానికి దోహదం చేసేది ధర్మం. వ్యష్టి జీవితానికి సమష్టి జీవితానికీ సమన్వయ సూత్రం ధర్మమే. అనూహ్యమైన మలుపుతో అరణ్యవాసానికి బయలుదేరుతున్న శ్రీరామచంద్రునితో తల్లి కౌసల్య ‘ధర్మస్త్వాం అభిరక్షతు’ అని ఆశీర్వదిస్తుంది. ఆచరణలో ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే నియమపాలన అవసరం. అందుకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా వీగిపోని స్థిరచిత్తం ధీరత్వం కావాలి.
ఆకృతి ధరించిన ధర్మమే రాముడు. ఆయన ధర్మపత్ని సీతమ్మ ఒక సందర్భంలో సమస్త ప్రయో జనాలూ ధర్మం వల్లనే లభిస్తాయని అసలీ ప్రపంచమే ధర్మసారమని విస్పష్టంగా ప్రకటించింది. ధర్మానికిగాని ఏర్పడినప్పుడు తద్రక్షణకై తానే దిగివస్తానని పరమాత్మ తన అవతరణ ఆంతర్యాన్ని ఆవిష్కరించాడు. ఈ నేపథ్యంతో పర్యాలోచన చేస్తే జీవితంలో ఏ దశలోనూ అవిస్మరణీయమైన అంశం ధర్మం. అమ్మ జీవితం ప్రేమసూత్రానికి రసవత్తర వ్యాఖ్యానమే. కాని ‘తల్లి ధర్మం నిర్వర్తించటానికే వచ్చా’నని, ‘ప్రేమకంటే ధర్మం గొప్పది’ అని అమ్మ చేసిన ప్రకటన ధర్మప్రతిష్టను ఇనుమడింప చేస్తూ మన ఆలోచనకు పదును పెడుతోంది.
‘అక్షరం నా నిధి
అంబరం నా అవధి
సముద్రాలు దాటొచ్చినా
సమాజం నా పరిధి’ అంటారు’ సినారె.
ఆకాశపుటంచులు తాకేలా విహరించిన పక్షి ఏ వేళకయినా సొంతగూటికి చేరక తప్పదు. మనిషికి ఎన్ని ఆశయాలు, ఆదర్శాలు ఉన్నా ఆచరణ విషయానికి వస్తే సాముగరిడీ సమాజమే. సంస్కరణ దిశగా అమ్మ సాగించిన ప్రస్థానాన్ని – మడమతిప్పని మార్తాండునిలా వెలుగులు పంచుతూ నింగిలో నెలపువ్వులా వెన్నెలలు కురిపిస్తూ సాగించిన శోభాయాత్రని అవలోకిద్దాం.
అప్పుడు అమ్మకు అయిదు సంవత్సరాల వయస్సు. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ తెలియని పసితనం. కాని ఆ దశలో అమ్మ లోకం పోకడ జీవితంలోని మిట్టపల్లాలు చవిచూసిన అనుభవశాలిలా ప్రవర్తించేది. ఒకరోజు సాయంత్రం సంధ్యా సమయం దాటి చీకటిపడుతున్న వేళ… అమ్మ బాపట్లలో ఇప్పుడు మున్సిపల్ ట్రావెలెర్స్ బంగళా ఉన్నచోట మట్టిచెట్టు కింద కూర్చోబోతూ వుంది. ఇంతలో ఒక పోలీసు అమ్మ వెనుకనే వచ్చి ‘ఏ అమ్మాయ్! నీ పేరేమిటి? అని అడిగాడు. పదిసార్లు పిలిచినా అమ్మ పలుకక పోవడంతో శ్రుతిపెంచి కర్కశత్వం నిండిన కంఠంతో నీపేరేంటి? అని అరిచాడు. అమ్మ ఏమాత్రం చలించకుండా ‘పిలిచావుగా! అదే నా పేరు అబ్బాయ్” అన్నది నిర్లిప్తంగా. అబ్బాయ్ అన్నమాటకు అతనికి కోపం వచ్చి ‘జాగ్రత్త! నీకు జైలు కావాలా?’ అన్నాడు. ‘జైలు కొడతావా? (జయ జయ ధ్వానాలు అనే అర్థంతో). అప్పుడే వద్దులే’ అంది అమ్మ. ఆ మాటలలోని చమత్కారం, గాంభీర్యం అతనికి అర్థం కాక ‘ఆ’ అన్నాడు. అమ్మ ‘ఈ’ అంది. ‘అదేంటి?’ అన్నాడు. అమ్మ ఏదో వివరించబోతుండగా సహనం కోల్పోయి అమ్మ మెడలోని పులిగోరు పట్టుకు లాగాడు, అది రాలేదు. అతడు ఎంతగా ప్రయత్నించినా మెలితిప్పినా అది రాలేదు. చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించక పోయినా తన మనస్సులోనే ఏదో తెలియని అలజడి మొదలయింది. ఏం చెయ్యాలో పాలుపోక కంగారు పడ్డాడు. శరీరమంతా స్వేదంతో నిండి పోయింది. అప్పుడు అమ్మ “నీ చెయ్యి నొప్పి పుడుతుంది. నేనే ఇస్తాను కాని ఒక సంగతి అడుగుతాను చెబుతావా?” అంది. ‘ఇస్తానంటే చెబుతా’నన్నాడు. అందుకు అమ్మ “మాట అంటే మారుమాట లేని మాట. దానినే మంత్రమంటారు. ఉత్తములకు మంత్రం మామూలు విషయమే. వారికి సంఘంతో ఏ తంటా లేదు. తంటాలు పడుతున్నామనేది నీలాంటి మారుమాట గలవారే’ అంటూ పులిగోరు తీసి అతని చేతిలో పెట్టి ‘అసలు నీ ఉద్యోగమేంటి? వివరించి చెప్పు నాయనా!’ అని అడిగింది. ‘ఎవరు ఏ లోపాలు చేసినా కనిపెట్టి వారిని పట్టుకొని జైలులో పెట్టడం’ అన్నాడు. ‘లోపమంటే…?” అమ్మ అర్థం కానట్లే అడిగింది. ‘దొంగతనం చేసినా, ఒకరిని కొట్టినా, చంపినా ఇంకా చాలావున్నాయిలే నీ కర్థం కావు’ అన్నాడు భరోసాగా.
‘ఇప్పుడు నీవు చేసినదేమిటి? ఇది దొంగతనం కాదా? నిన్నెవరు పట్టుకుంటారు? ఇంకొక పోలీసు పట్టుకుంటాడా? లేక అందరూ ఇంతేనా? మీకు తప్పులేదని వదిలిందా ప్రభుత్వం?” అమ్మ సంధించిన ప్రశ్న సూటిగా అతని హృదయాన్ని తాకింది. అంతవరకూ మృదువుగా ధ్వనించిన అమ్మ కంఠంలో తొణికిసలాడిన కాఠిన్యానికి ఆశ్చర్యచకితు డయ్యాడు. కరుడు గట్టిన అతని అంతరంగం భయ కంపితమయింది. అమ్మ ముఖంలో అరుణోదయ కాంతిని చూచి దిగ్భ్రామ చెంది వణికే చేతులతో పులిగోరు అమ్మ మెడలో వేసి మారుమాట లేకుండా అమ్మను ఎత్తుకొని తన ఇంటికి తీసికొని వెళ్ళాడు. అతని పేరు మస్తాన్. ఈ సంఘటన అతని జీవితంలో పెద్ద మలుపు. గతంలోని తన దురాగతాలను గుర్తుచేసుకొని పశ్చాత్తాపపడ్డాడు. ఆ తర్వాత మస్తాన్ అతని మిత్రుడు అంకదాసు ఇద్దరూ అమ్మ సన్నిధిలో ఎన్నో అనుభవాలు పొందారు. అప్పటి నుండి ‘నీతి నిజాయితీయే దేవుడు” అన్న అమ్మమాట వారికి మంత్రమే అయింది. వారు వృత్తి ధర్మాన్ని నిష్ఠగా అనుసరించటానికి నిశ్చయించు కొని అమ్మ పాదాలు తాకి ప్రమాణం చేశారు.
అయిదేళ్ళ పిల్లలు సహజంగా పోలీసుల పేరు చెబితేనే భయపడతారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరయినా వచ్చి తమ వస్తువు బలవంతంగా లాక్కుంటే బెంబేలెత్తి ఏడుస్తారు కాని ప్రతిఘటించలేరు. అలాంటి సందర్భంలో తొణుకూ బెణుకూ లేకుండా నిశ్చలంగా నిలబడి అతని తప్పు అతనికి అర్థమయ్యేలా నిలదీసి ప్రశ్నించటం చెక్కుచెదరని ఆ ఆత్మవిశ్వాసం సామాన్యుల ఊహకు అందని విషయాలు. ఆ ఆ స్థితిలో ఎవరైనా సాధ్యమైతే తన నగను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ‘తల్లికి బిడ్డ సొమ్ము. బిడ్డకు డబ్బు సొమ్ము’ అని చెప్పిన అమ్మ తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేసింది. నిస్వార్థమూ, ప్రేమపూరితమూ అయిన అమ్మ ప్రబోధం నిద్రాణమై నిస్తేజమైన అతని అంతరాత్మను జాగృతం చేసింది. సంస్కారాన్ని ప్రదీప్తం చేసింది. ఇది నిశ్చయంగా అమ్మ గెలుపు. నేరానికి పాలుపడిన వ్యక్తి తన తప్పు తెలుసుకోవటమే కాక అమ్మను తన ఇంటికి తీసుకొని వెళ్ళాలని క్షణంలో నిర్ణయించుకోవటానికి కారణం కనిపించదు. ఇది అమ్మ చెప్పిన తరుణమే.
ఆనాడు కాదు ఈనాడైనా ఉన్నతపదవులను అధిరోహించి సమాజంపట్ల బాధ్యత వహించవలసిన పెద్దలు సాగిస్తున్న దోపిడీలు దురాగతాలు వారికి కొమ్ముకాసే ఉన్నతోద్యోగులు ప్రభుత్వ యంత్రాంగం తెల్లవారి లేచింది మొదలు మనం చూసే సమాజ ముఖచిత్రమిది. కంచే చేను మేస్తే …అడిగే వారెవరు? ఆదుకునే వారెవరు? అమ్మ చేపట్టిన కార్యాచరణ చీకటిలో చిరుదీపం. లోకబాంధవుడు లేనిలోటు తీర్చేవి చిరుదీపాలే కదా మరి.