1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కనిపించని భక్తుడు శ్రీ గొర్ల సత్యనారాయణ

కనిపించని భక్తుడు శ్రీ గొర్ల సత్యనారాయణ

A. Kusuma Chakravarthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : February
Issue Number : 7
Year : 2012

అమ్మతత్వానికి ప్రతీక శ్రీ సత్యనారాయణగారు. ఆయన మాటల మనిషి కాక కార్యాచరణలో తనువు పండించుకున్న మనిషి. అమ్మను మనసా, వాచా, కర్మణా నమ్మి అమ్మసూక్తులను ఆచరణలో చూపించినారు.

మొట్టమొదటిసారి భవానీ ప్రసాద్, ఉమాదేవి దంపతులతో 1982 భోగిపండుగకు జిల్లెళ్ళమూడిలో అమ్మను దర్శించారు. అమ్మతో తొలుదొల్తగా భోగిపళ్ళు పోయించుకున్నారు. ఆ రోజు నుంచీ అమ్మను విడిచింది లేదు. మరచింది అంతకంటే లేదు.

విశాఖ పట్టణం వారు కట్టించిన ‘శ్రీ మాతా అతిధి గృహనిర్మాణంలో పాలు పంచుకున్నారు. కామేశ్వరరావు, సన్యాసిరావు గార్లతో కలిసి తరచూ జిల్లెళ్ళమూడి వెళ్లి వస్తూ ‘శ్రీమాతా’ కట్టించారు. అదే విధంగా ఆర్చి కట్టించినప్పుడు ఆయన ఎంతో కష్టపడ్డారు. శ్రీమాతా కట్టించే సమయంలో 1982 అక్టోబరులో కుటుంబం అంతా పదిరోజులు జిల్లెళ్ళమూడిలో వుండ గల్గటం అమ్మ ఇచ్చిన వరమే.

సరళ అక్కయ్య పిల్లలు అమ్మ దగ్గర గడపటానికే ఇష్టపడే వారు. సత్యనారాయణ గారు మాత్రం తన పనిలోనే అమ్మను చూచుకునే వారు. ‘అమ్మ’ ప్రత్యేకించి కబురు పెడితే సాయంత్రం అమ్మ దగ్గరకు వచ్చేవారు. మాతృశ్రీ అధ్యయనపరిషత్ జరిపే అన్ని కార్యక్రమాలకు, పూజలకు తప్పక వచ్చే వారు.

2001లో సత్యనారాయణగారు కోరమాండల్లో రిటైర్ అయి సొంతవూరు అయిన గిట్టుపల్లికి మకాం మార్చారు. అక్కడ దసరా పదిరోజులు లలితాసహస్రం చదివించి, రాని వాళ్ళకు స్వయంగా నేర్పించే వారు. దుర్గాష్టమికి పులిహోర చేయించి వూరంతా పంచేవారు. రాలేని వాళ్ళకు, వృద్ధులకు ఇంటికి పొట్లాలు కట్టి పంపించేవారు. సరళా పిల్లలు తరుచూ జిల్లెళ్ళమూడి వస్తున్నా తాను మాత్రం “అమ్మ నా ఇంట్లో, నా మనస్సులోనే వుంది. నేను జిల్లెళ్ళమూడి వెళ్లేటిక్కెట్టు ఖర్చు అక్కడకు పంపితే అన్నపూర్ణాలయంలో ఉపయోగపడ్తుందనేవారు.

ధాన్యాభిషేకానికి తన పొలంలో పండిన ధాన్యాన్ని ఖర్చులు పెట్టుకొని జిల్లెళ్ళమూడి కోసం వైజాగ్ మందిరానికి పంపేవారు. ఏ కష్టం వచ్చినా అమ్మతో తప్ప ఎవరికీ చెప్పుకునే వారు కాదు. 2 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయికి పెద్ద ప్రమాదం జరిగింది. కుడిచేయి మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. అమ్మ అనుగ్రహంతోనే తన కొడుకు బతికాడని లేకపోతే చనిపోవలసివాడేనని, అమ్మ చేతితో సరిపెట్టిందని, అమ్మ గురించి ప్రగాఢ విశ్వాసం ప్రకటించారు.

“అమ్మా ! నా కొడుకును బతికించమ్మా !” అని వేడుకున్నారే తప్ప “ఎందుకిలాచేశావ”ని అమ్మని నిలదీయని భక్తి విశ్వాసాలు ఆయనవి. అమ్మ సూక్తి నిదర్శనంగా “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకో” అన్నట్లుగానే నడుచుకున్నారు. ఊరిలో ఎందరికో ఉపకారం చేశారు. హరిజనవాడలో వారికి, వూరిలోవారికి, దళితులకు నీళ్ళ టాంకులు కట్టించటానికి ఎవరూ ముందుకు రాకపోతే ఆయనే ముందుకు వచ్చి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని టాంకు పనిపూర్తిచేశారు. వూరిలో ప్రతి ఒక్కరూ ఆయన్ని తలచుకుంటూనే వున్నారు.

ఆయన పంపించిన బియ్యాన్ని విశాఖ మందిరంలో ప్రసాదాలుగా వాడుతున్నామని తెలిసి ఎంతో సంతోషించే వారు. “మీరంతా అమ్మ జిల్లెళ్ళమూడిలో వుందను కొని వెళ్తారు. నాకు అమ్మ నా దగ్గరే వుందనుకుంటా”నని తరచుగాఅనేవారు.

తన సంతోషాన్ని నలుగురికీ పంచటమే తప్ప తన బాధలను ఎవరికీ తెలియ నివ్వని మనస్తత్వంతో తన అనారోగ్యాన్ని కూడా ఎవరికీ చెప్పకుండా ‘I am fine’ అంటూనే శోకసాగరంలో ముంచి అమ్మ సన్నిధికి చేరుకున్నారు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!