1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కన్నీటిలోని దివ్యత్వం

కన్నీటిలోని దివ్యత్వం

Ekkirala Bharadwaja
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : March
Issue Number : 8
Year : 2022

అమ్మను ఒకసారి చూచిన తరువాత మనం ఎందువలన అమ్మ సాన్నిధ్యానికి మళ్ళీ మళ్ళీ నిర్నిరోధంగా చేర్చబడతాం? అమ్మను చూడకముందు మన జీవితం తెలియని దాని కొరకై పరిశోధన. జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ ప్రథమ దర్శన మయిన తరువాత ఆమె చెంగట మనం అనుభవించిన ఆత్మ సంతృప్తికై వెదుకులాటగా జీవితం తయారవుతుంది. మరెక్కడా మనం అనుభవించలేని, మనకు తెలిసిన ఒక తృప్తికోసం అన్వేషణగా మారుతుంది. ఆమె పవిత్రచరణ సీమలో మన జీవితాలు బరువు బాధలనుండి విముక్తమయినట్లు అనుభూతమవు తుంది. మొట్టమొదటి సారిగా మన వ్యక్తిత్వం శూన్యం వలె సువిశాలమవుతున్నట్లు, ఆకాశంవలె స్వచ్ఛమవు తున్నట్లు, నవశిరీషపేశలమై ఆనందమయ మవుతున్నట్లు భావించటం జరుగుతుంది. మనసు నిర్వాత దీపకళికవలె నిశ్చలం గాను, ఉదయభాస్కర ప్రభాభాసమానంగాను ఉన్నట్లు గమనిస్తాం. అమ్మ దగ్గర పవిత్రమూ, పరమానందమూ అయిన మన స్వస్వరూపాన్ని చూడగలుగుతాం. అమ్మను చూడక పూర్వము ఎలా ఉన్నామో చూచిన తరువాత ఎలా ఉన్నామో ఆ భేదం గూడా స్పష్టంగా గుర్తిస్తాం. అందుకై పునః పునః అమ్మ దర్శనానికి పరుగెత్తుతాం. “గురువు మౌనంగా ఉన్నాడు అందరిలోనూ శాంతి పరిఢవిల్లుతోంది. చాలా సకృత్తుగా లభ్యమయ్యే ఏ ఒకానొక మహర్షిలోనో విరాడంతరంగం ఆవిష్కారమయినప్పుడు అది వ్యక్తి మనస్సును ఆత్మతో జోడింప గలుగుతుంది” అని రమణుల ఉపదేశామృతం గుర్తుకు వస్తున్నది.

అమ్మ సాన్నిధ్యంలోని అనుభవాన్ని సూక్ష్మ పరిశీలన చేస్తే, దైనందిన జీవనంలో చికాకు కలిగించే అసంఖ్యాక మయిన సమస్యలు, అనుదినమూ మనస్సు నిష్ప్రయోజనంగా నిర్మించుకునే ఊహాసాధాలు, ఏర్పరచుకొనే అభిప్రాయాలు అన్నీ అదుపులో పెట్టబడతాయని గమనిస్తాం. చీకటి తెరలు దింపగానే ప్రశాంతత ఆవరించిన మహానగరంవలె మనస్సు నిర్మల మవుతుంది. నిశ్చల శాంతి నిలుస్తుంది. తరువాత అయినా ఆలోచనలు వస్తూనే వుండవచ్చు. మనస్సీమలో నగరంలోని కొద్దిమంది నిశాచరులవలె అయినా ఆ ఆలోచనలు అమ్మ గురించి, ఆమె దివ్యత్వాన్ని గురించి, ‘అందరిల్లు’ లోని కార్యకలాపాలగురించి మాత్రమే అయివుంటాయి. మనం స్వయంగా సాధించలేక పోతున్న ఏకాగ్రతకు మనకు తెలియకుండానే మనస్సు చేరువవుతుంది. మన నివాసం పవిత్రత, నిశ్చలత, ఆనందముల త్రివేణి సంగమమే అవుతుంది. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే సాధన దానంతట అది జరుగుతూనే వుంటుంది. పరమాద్భుతమయిన అమ్మ దివ్య స్వరూపం, అతులితమయిన మధుర భాషణలు, ఆమె పూర్ణమౌనము, ఆమె ఆనందము, ఆగంతుకుల మనస్సుని మంత్రముగ్ధం చేస్తాయి. ఒకే ఒక్క ఆలోచన సార్వభౌమత్వం చేస్తుంది వారిలో – ‘ఆశ్చర్యకర వాత్సల్యాం వందేమాతర మద్భుతాం’. వచ్చే వారిలో అధికాధికుల కనుభూతమయిన అసాధారణమైన విశేషమేమి టంటే, విచిత్రము అనిర్వచనీయమూ అయి అకస్మాత్తుగా పెల్లుబికే ఒకానొక భావావేశం వల్ల కంటివెంట అశ్రువులు కారటం, కంఠం గద్గదం కావటం, పెదవులు చుబుకము వణకటం. మరికొన్ని సమయాల్లో అమ్మ ఒడిలో నున్నప్పుడో పాదాభివందనం చేస్తున్నప్పుడో పెద్దగా విలపించటం. ఈ అనుభవానికి గురి అయినవారు కూడా కారణం వివరించలేరు సరికదా తరచు యిట్టి భావావేశానికి గురి అవుతూనే వుంటారు. తన దర్శనార్థం వచ్చే చాలామంది ఎందుకు తన ఎదుట విలపిస్తారని అమ్మని అడుగ సాహసించాను. చాలాసార్లు సమాధానం దాటవేసింది అమ్మ. ‘ఎదుటి వ్యక్తిలో మంచితనాన్ని చూస్తే ఏడుపొస్తుంది’ అని ఏదో ఒక సమాధానం యివ్వడానికి చెప్పినట్లుగా అనేది. అసలు కారణం చెప్పమని నేను గట్టిగా ప్రాధేయ పడినప్పుడు ‘పుట్టగానే పసిబిడ్డ ఎందుకు ఏడుస్తుందో అదే కారణం’ వీరికి కూడా నన్నది. అంటే నీ దర్శనంతో వారి అంతర్యం పునరుద్భవించినట్లా?” అని ఒకరు ప్రశ్నిస్తే “అవును, నిజానికది విచారం కాదు. సామాన్యంగా దుఃఖాని కొక కారణమంటూ వుంటుంది. కానీ యిది అకారణం. అది నిజంగా ఏడవటం కాదు. అంతకన్న మంచి పదం దొరకక దాన్ని ఏడవటం అంటారుగాని” అని ప్రత్యుత్తరమిచ్చింది. అమ్మ ఆ రహస్యమయానుభూతిని స్పృశించి హృదయ కవాటాలు తెరచినప్పుడు ఎదుటివాని వయస్సు, స్థాయి, మనోనిబ్బరం యివేవీ పనిచేయవు ఆ భావనా విశేషాన్ని అదుపులో నుంచటానికి. ఆ విచిత్రానుభవం తరువాతి క్షణాలు సమాధిగతుడైన వాని అనందానికి చేరువగా ఉంటాయి. డగ్గుత్తికతో వణకటం, శరీరం వణకటం, కంట అశ్రువులు కారటం తీవ్రభక్త్యావేశ చిహ్నాలని నారదభక్తి సూత్రాలలో చెప్పబడే వుంది.

ఈ అశ్రుస్రవంతికి నేను లోనుగానని, దానిని అదుపులో నుంచగలనన్న ధీమా నాకుంది. అలా నా అతిశయం ప్రకటించాను కూడా. అమ్మ బరపిన ఒక్క వీక్షణం చాలు మనలో ఆ భావావేశం కట్టలు తెంచుకు బయటపడటానికని నేను గమనించాను. ఒకసారి పూజ జరుగుతున్నది అమ్మ. వేదికపై ఆసీనురాలైంది. నేను చూస్తూ కూర్చున్నాను. ఒకసారి అమ్మ నావైపు చూసింది. వెంటనే నాకు విచార మావరించింది. నేను ఆలోచించటం యాదృచ్ఛికంగానని ఆశ్చర్యపోయాను. కావాలని అమ్మ నా యెడ దృష్టి సారించకుండా ఉంది. ఎందుకో తెలియదు. ఈ ఆలోచన నాలో సాగుతూన్న సమయంలో అమ్మ రెండోసారి చూచింది. అంతే రెండు కళ్ళనిండా నీళ్లు నిండాయి నాకు, గొంతు గద్గదమయింది. ఆశ్రువుల నరికట్టే ప్రయత్నంలో మనస్సు బిగువయింది, అప్పుడర్ధమైంది అమ్మ నా వేపు అంత సమయమెందుకు చూడలేదో, పెల్లుబికే తీవ్రావేశానికి నిగ్రహించాలన్న తీవ్రప్రయత్నానికి మధ్య నలిగిపోతున్న నేను అంతర్యంలో ఈ బాధనుంచి తప్పించి లోని భావావేశం ప్రకటితం కానిమ్మని అమ్మను ప్రార్ధించాను. అప్పుడు అమ్మ తన దృష్టి నా యెడల నిలిపింది. కళ్ళనుండి అశ్రువులు ధారగా జాలు వారాయి. నాలోని పట్టు సడలి నేను చాలా హాయి ననుభవించాను. మన భావాలు ఆమె అదుపాజ్ఞలలో ఉంటాయని గమనించాను. ఎన్నో సందర్భాలలో ఉబుకుతున్న అశ్రువులను దుఃఖాన్ని నిగ్రహించే ప్రయత్నంలో విపరీతమైన అంతస్సంఘర్షణ కొరకు గురి అయిన వారిని అమ్మ దగ్గరకు పిలిచి తల నిమురుతూండటం నేను చూశాను. అప్పుడు పొంగి పొర్లే భావాలతో అమ్మ ఒడిలోనో, పాదాలవద్దనో విలపిస్తారు. కొంతమంది అదే మానసికావస్థలో చాలా కాలం వుంటారు. మరి కొందరు అమ్మను కొద్ది క్షణాలు, నిశ్చలంగా చూస్తే చాలు. ఎడతెగకుండా కన్నీళ్ళు కారటం అనుభవిస్తారు. నియమ నిష్టలతో ఏ సాధనను చేయలేని మనను చూడగానో అమ్మను స్పృశింపగానో అమ్మ ఒక్కమాట పలికితేనో తీవ్రభక్త్యావేశం మనలో అవతరించేటంతటి ఆధ్యాత్మికోన్నతికి తీసుకు వెడు తుందంటే నిజంగా అది ఆమె అనుగ్రహమేననాలి. ఇదే కన్నీటిలోని

దివ్యత్వం (Baptism of Tears).

ఇట్టి అనుభవానికసలు ఆధారమేమిటి ? భగవాన్ రమణుల క్రింది ప్రసంగంవల్ల దాని జాడ కొద్దిగా తెలుస్తుంది. ‘గురువు మనసు అంతర్ముఖం చేస్తాడు. గురువు జిజ్ఞాసువు హృదయంలోనే తిష్ఠవేసివుంటాడు కనుక అంతర్ముఖమైన మనస్సును హృదయానికి లాగుకుంటాడు.”

‘తనవల్ల పరిపూర్ణత పొందవచ్చునా?’ అని ప్రశ్నించినప్పుడు “నా వలన పొందేదేముంది. నేను తల్లిని. నన్ను చూడటమే పొందటం” అన్న అమ్మ సమాధానం పై రమణ సూక్తికి సంక్షిప్త రూపమేగదా! రమణ మహర్షులతో ఒక శిష్యుని సంభాషణతో ఈ వ్యాసం ముగిద్దాం.

శిష్యుడు: “ఆత్మ విద్యా విలాసము, మున్నగు పుస్తకాలలో గద్గదస్వరము, ఆనందబాష్పాలు మున్నగునవి చెప్పబడి ఉన్నాయి. ఈ లక్షణాలు సమాధిలో కనిపిస్తాయా? సమాధికి పూర్వముకాని తరువాత కాని కనుపిస్తాయా ?

రమణః సూక్ష్మాతి సూక్ష్మమైన మనోవృత్తి లక్షణాలివి. సమాధి అంటేనే పరమ ప్రశాంతత. అయితే వీటికి చోటెక్కడవుంది? అనుభవించిన సమాధిస్థితి జ్ఞాపకాలు ఈ లక్షణాలకు దారితీయడం జరుగుతుంది. ఈ లక్షణాలు భక్తి మార్గంలో సమాధికిముందు ఉంటాయి.

“పుట్టినప్పుడు ఎందుకు ఏడుస్తారో అదే కారణంగా తన్ను దర్శించినప్పుడు కూడా ఏడుస్తార”ని అమ్మ చెప్పటం తన దర్శనం పారమార్ధిక పునర్జన్మ మని సూచించినట్లు, అదే సత్యాన్ని వివరిస్తూ రమణమహర్షి సచ్చిదానందమయిన ఆత్మ నుండి అహంకారం ఉద్భవిస్తూనే ఆత్మను మరచి పోవడమే జన్మ. తల్లిని తిరిగి పొందాలన్న ప్రస్తుత వాంఛ వాస్తవానికి ఆత్మను తిరిగి పొందాలన్నదే. ఆత్మ సాక్షాత్కారం పొందటం అహంకారం నశించడ మన్నమాట. ఇదే శరణాగతి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!