అచంచల విశ్వాసం, అంకితభావం, ఆర్జవం ముమ్మూర్తులా మూర్తీభవిస్తే శ్రీ పి.యస్.ఆర్. అన్నయ్యగారు. నిరాడంబర వ్యక్తిత్వానికి నిలువెత్తు రూప వారు. శరణాగతి వారికి | స్థితప్రజ్ఞత ఉ నిశ్వాసాలు. త్రికరణశుద్ధి వారి విజయరహస్యం. తాను నమ్మిన సత్యాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించటం వారి నైజం. కొన్ని సందర్భాలలో అవసరం మేరకు వారి మాటలలో పదును కనిపించినా అది కార్యశూరుని అంతరంగలోని అభినివేశమే – నిండైన వారి మనస్సు నవ్య నవనీతం అనేది జగమెరిగిన సత్యం. మాటలో – మన్ననలో, ఆలోచనలో – ఆచరణలో, పద్యరచనలో – ప్రణాళికారచనలో అనన్యమైన విలక్షణ శైలి వీరిది. పత్రికా సంపాదకులుగా, సభాసంచాలకులుగా, భవిష్యత్కార్యాచరణ పథనిర్దేశకులుగా గురుతర బాధ్యతను నిర్వహిస్తూ … కష్టసుఖాలనే కాదు ప్రశంసను విమర్శను సమచిత్తంతో స్వీకరించగల కర్మయోగి శ్రీ పి.యస్.ఆర్. గారు.
తొలిదర్శనంలోనే అమ్మను శ్రీ వాణీగిరిజా సమన్వయ స్వరూపంగా, ముగ్గురమ్ముల మూల పుటమ్మగా సందర్శించి, అమ్మ సేవయే జీవిత పరమార్థమని విశ్వసించి సర్వసమర్పణ భావంతో మాతృశ్రీ చరణ సన్నిధిలో జీవితాన్ని పండించుకున్న పుణ్యచరితులు శ్రీ పి.యస్.ఆర్. గారు. ‘ఒక పనిలో ఎంతో కొంత నైపుణ్యం సాధిస్తేనే అడుగు పెడదాం’ అనుకునే వారు కొందరు. ‘ప్రయత్నం విజయానికి తొలిమెట్టు’ అని భావించేవారు మరికొందరు. ప్రయత్నశీలమే అసలైన విజయమని నమ్మి అవసరమైనపుడు ఏ రంగంలోనైనా కర్మవీరులై కర్తవ్య పరాయణులై ముందుకు సాగగల స్థైర్యం శ్రీ పి.యస్.ఆర్.గారికి ఆ జన్మసిద్ధం. ‘కర్మణ్యేవాధికారస్తే’ అన్న ప్రబోధం వీరి ఆత్మవిశ్వాసానికి అంతస్సూత్రం.
అనసూయావ్రతాన్ని అక్షరపరబ్రహ్మ సమర్చనంగా ‘బ్రహ్మార్పణం బ్రహ్మహవి ర్బహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్’ అన్నట్లు అన్నీ తానైన ఒక తాదాత్యస్థితిలో నిర్వహించేవారు. మాతృశ్రీ జీవిత మహోదధిలోని సన్నివేశాలను శ్రోతలముందు సాక్షాత్కరింప జేసేవారు. తన గళమాధుర్యంతో భావాను గుణమైన స్వరవైవిధ్యంతో, బహుపాత్రాభినయం చేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేయటం – అందరింటి సభ్యులందరికీ అనుభవసిద్ధమే.
అది 2016 ఆగష్టు నెల. నేను అమెరికా నుండి తిరిగి వచ్చి ఆ ముందురోజే బాపట్ల వచ్చాను. సుగుణ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తోంది. “రేపు రామకృష్ణ అన్నయ్య వర్ధంతి సభ. మీరు రాగలరా!” అని ఫోన్ చేసింది. నేను బయలుదేరి వెళ్ళాను. కాలేజీకి చేరగానే పి.యస్.ఆర్. అన్నయ్యగారి నుంచి నాకు ఫోన్ “వరలక్ష్మీ! నేను వద్దామనుకున్నాను. అనివార్యంగా రాలేని పరిస్థితి. నా బదులు సభాధ్యక్షతను నువ్వు నిర్వహించు” అని. బాధ్యత పడే మనస్తత్వం తప్ప ఇసుమంతైనా తూష్టీభావం వారిలో కనిపించేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే అడగటం అన్నయ్యకు అలవాటు లేదు – ఆదేశించటమే. అన్నయ్య ఏది చెప్పినా చేయటానికి శతథా ప్రయత్నించేవాళ్ళం. ఎందుకంటే ఆ శాసనంలో ఆత్మీయత ధ్వనించేది. ఆత్మీయతకు నేపథ్యం – అన్నయ్యకు అమ్మపట్ల గల అచంచల విశ్వాసం. మాతృసంస్థ పురోగమనం పట్ల నిశ్చలమైన నిబద్ధత. ఈ బంధమే కాలక్రమంలో అనుబంధంగా రూపుదిద్దుకున్నదని చెప్పాలి.
శ్రీయుతులు సత్యప్రసాద్ గారు క్లిష్ట పరిస్థితిలో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నయ్యగారు వచ్చి నన్ను పలకరించి ధైర్యం చెప్పి ‘వెయ్యి కొబ్బరికాయలు ఆలయాలలో కొట్టుకుందాం’ అన్నారు. సరేనని తల పంకించాను నేను. ఒకటి రెండు రోజుల తర్వాత శోకసంద్రంలో మునిగిపోయిన నన్ను చూచి “మనం ఒకందుకు మొక్కుకున్నాం. అమ్మ మరొకందుకు అంగీకరించింది” అన్నారు ఓదార్పుగా. ఏం జరిగినా అది అమ్మ అనుగ్రహమేనని చెప్పాలని అన్నయ్య ప్రయత్నం. ఆ సమయంలో నా అల్పబుద్ధికి అర్థం కా అంటే అనుభవానికి అందక తికమక పడ్డ మాట నిజం.
పరోపదేశ వేళలోనే కాదు, స్వానుభవంలోనూ పి.యస్.ఆర్. అన్నయ్య పండితులే. కలిమిలేములలో వెంట నడిచిన ఇల్లాలిని, వృద్ధాప్యంలో చేయి అందుకొని ముందుకు నడిపించే కన్నబిడ్డని కోల్పోవటమంటే మాటలు కాదు. ఈ సన్నివేశాలు ఎంతటి వారినైనా విచలితులను చేయకమానవు. ఇది అమ్మ నిర్ణయమని శిరసావహించారు పి.యస్.ఆర్. గారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. అమ్మ సేవకు పునరంకితమయ్యారు. ఇది వారి సంపూర్ణ శరణాగతికి, స్థితప్రజ్ఞతకు నిదర్శనమనేది కాదనలేని సత్యం. ఈ దృష్టితో అవలోకిస్తే అమ్మ అన్నయ్యకు ఆరాధ్యమూర్తి మాత్రమే కాదు “ఇష్టదైవం”.
కాలగమనంలో కల్లలు లేని వారి అంతరంగం ఎల్లలు లేని ప్రేమకు ఆలవాలంగా అన్నయ్య అనసూయత్వాన్ని భజించారు, అంతటా అమ్మనే దర్శించారు అనటానికి ఎన్నో నిదర్శనాలు. సన్నిహితంగా పరిశీలిస్తే అన్నయ్య జీవనగమనమే ‘నిష్కామకర్మయోగం’ అనిపించక మానదు.
ఇటీవల సమయమే లేదన్నట్లు నెలకొక వేడుకను సంకల్పించి తన చేతులమీదుగా ఎన్నో సన్మానాలు సత్కారాలు జరిపించారు. ఏమిటా! ఈ హడావుడి!! అని వెనుదిరిగి చూచేంతలో ‘నా జీవన సాఫల్యపురస్కారమిదేనని చెప్పకనే చెబుతూ అమ్మ ఒడిని చేరిపోయారు.
అన్నయ్య స్మృతికి అంజలి ఘటిస్తూ.
అఖిల జీవాళికి అమ్మయై నిలచిన
అతివ యెవ్వరు చూడ అవని యందు
అవని యందు సహన మాకారమెత్తిన
పుత్తడిబొమ్మ యే పూతచరిత పూతచరిత
యౌచు పుత్రపుత్రికలకు
సుగతి నిచ్చుచు మెచ్చు సుదతి యెవరు
సుదతి యెవరు భుక్తి చొక్కగా లక్షలు
స్వర్ణోత్సవమ్ముల జరుపుకొనియె
జరుపుకొనియెను తన మాట సత్యముగను
సత్యమునను నాగేశు సాంగత్య గరిమ గరిమ
సౌభాగ్య మాంగల్య కాంతిపథము పధము
జూపును సర్వసంపదలు గూర్చి
– శ్రీ పి.యస్.ఆర్U