“అమ్మా! నువ్వంటే నా కెంతో ఇష్టం
నీవు తప్ప ఇంకేమీ చూడలేనంత ఇష్టం కావాలి
నీవు తప్ప ఇంకేమీ లేదనంతగా ఇష్టపడాలి
నిన్ను వదలలేక వదలలేక వెళుతుంటే ఈ విరహంతో
పొంగి వచ్చే దు:ఖం లాంటి ఇష్టం కావాలి
నది సముద్రంలో కలిసి తన అస్తిత్వం కోల్పోయినట్లు
నేను నీలో కలిసి పోయేంత ఇష్టంకావాలి” – అని అమ్మే సర్వస్వంగా అమ్మే ప్రపంచంగా ఉండాలని బలంగా కోరుకుని అమ్మలో ఐక్యమైన ధన్యజీవులు శ్రీ పి.యస్.ఆర్. అన్నయ్య గారు.
జిల్లెళ్ళమూడిలో ప్రత్యణువులో ప్రతిధ్వనించే ఆ కంఠస్వరం నేడు నిశ్శబ్దమయి పోయింది. వేదశాసనంలా ఆదేశించే ఆ గళం వినిపించని ఈ సందర్భంలో ఏమి వ్రాయాలన్నా కలం కదలటం లేదు. కానీ వ్రాయకుండా ఉండలేని స్థితిలో అన్నయ్యను స్మరిస్తూ రెండు మాటలు ప్రస్తావిస్తాను.
అలనాటి రామ చరిత్రలో వాయు సుతుడి పాత్ర ఎంత ప్రధానమైనదో ఈనాటి అమ్మ జీవిత మహాదథిలో అన్నయ్య గారికి అంత ప్రత్యేక స్థానమున్నది. ప్రారంభం రోజుల నుంచి ఈనాటి వరకు ఎంతో నిబద్ధతతో అందరింటి కార్యక్రమాలలో తాదాత్మ్యం చెందుతూ ఎందరికో ఆచరణ స్ఫూర్తిని కలిగించిన మార్గదర్శకులు. అంతేకాదు. జిల్లెళ్ళమూడిలో జరిగిన ఎన్నో మహెూత్సవాలలో సూత్రధారి పాత్రధారి అన్నీ తామే అయి నిర్వహించిన కార్యదక్షులు. నాన్నగారి శతజయంతి ఉత్సవాలు, హైమక్కయ్య 75వ జయంతి ఉత్సవాలు ఇంకా మన కళ్ళముందు కనిపిస్తూనే ఉన్నాయి.
జిల్లెళ్ళమూడిలో జరిగే ఉత్సవాలలో ధాన్యాభిషేక మహెూత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్నపూర్ణాలయ నిర్వహణకు ప్రధాన భూమిక వహిస్తోంది. ధాన్యాభిషేకమేనని అందరికీ తెల్సిన విషయమే. మరి ఇంతటి మహోత్సవమైన ధాన్యాభిషేకానికి రూపశిల్పి ఎవరు? ఎవరి సంకల్పంతో ప్రారంభమై ఇంతింతై వటుడింతయై అన్న చందంగా ఇంత అభివృద్ధి పథంలో నడుస్తోంది? ఎవరి మనస్సులో కలిగిన ఆలోచన ఇది? అని అందరూ అనుకుంటూ ఉంటారు. ధాన్యాభిషేక కార్యక్రమం సంకల్పించడమేకాదు, అన్నీ తామే అయి ప్రారంభించి తుది శ్వాస వరకు తపించి తరించిన ఆదర్శమూర్తి అన్నయ్యగారు.
అమ్మ పరిపూర్ణ అనుగ్రహంతో సుమారు 6 దశాబ్దాల కాలంగా సాహిత్య ఆధ్యాత్మిక రూపకాలలో అన్ని విభాగాలకు సంబంధించి ఎన్నో భూమికలు ధరించి అనేక కార్యక్రమాలకు సంచాలకులుగా తమ ప్రజ్ఞాపాటవాలతో శ్రోతలను మైమరిపింపచేసిన మహేంద్రజాలకులు. అమ్మే సరస్వతిగా అమ్మ సన్నిధిలో ‘సరస్వతీ సామ్రాజ్యం’ మొదలైన సభలలో అమ్మ మెప్పు పొందిన అదృష్టవంతులు. అమ్మ సన్నిధిలో ఎన్నో వేల పెండ్లిండ్లు జరిగాయి. ఆ వధూవరులను ఆశీర్వదిస్తూ అన్నయ్యగారి నవరత్నాలో పంచరత్నాలో లేకుండా ఆ వివాహవేడుక పూర్తి అవదని ఆబాలగోపాలానికీ –
‘అమ్మ మాటలలోన అర్థమ్మునెరుగగా
అఆలు కూడా నాకసలురావు
కానీ భక్తితో నీదు పాదాలు పట్టుకునే రక్తి మాత్రం ఉంది. అన్నారు. భగవదనురక్తే భక్తికదా! కనుక ఉంది’ మార్జాల కిశోర న్యాయంతో అమ్మే తమను అనుగ్రహించినట్లుగా చెప్పుకున్నారు. అమ్మను గురించి పద్యగద్యగేయ వచన కవితా మార్గాలలో ‘మాతృశ్రీ దర్పణం’, ‘తులసీ దళాలు’, ‘గిరిబాల గీతాలు’, ‘విశ్వజననీ జీవేశ్వర వైభవం’ మొదలైన ఎన్నో గ్రంథాలు, మరెన్నో గ్రంథాలకు సమీక్షలు, ఎందరో అమ్మ బిడ్డలు వ్రాసిన వందలకొలది గ్రంథాలు వెలుగులోనికి తీసుకువచ్చి మాతృశ్రీ సాహిత్య నందనవనంలో పారిజాతాలను పరిమళింప చేసిన బహుగ్రంథ కర్త.
బంగారు ఆభరణానికి వజ్రాలు పొదిగినట్లు అన్నయ్యలోని మరొక విశిష్టమైన విషయం పత్రికా సంపాదకత్వం. ఏ పత్రికకు అయినా ప్రాణం సంపాదకీయం. అందులో ఆధ్యాత్మిక మాసపత్రికకు సంపాదకత్వం వహించడం అసిధారా సదృశం. ఒక అవతారమూర్తికి సంబంధించిన పత్రిక విశ్వజననీ మాసపత్రిక. అందులో అమ్మ తత్త్వం, అమ్మ ప్రబోధం, సంస్థాగత కార్యక్రమాలు ఇలా ఎన్నో విషయాలకు దర్పణం పడుతూ అమ్మ సమగ్ర స్వరూపాన్ని దర్శింపచేయాలి. దీనికి ఒక్క భక్తే సరిపోదు. భాషమీద పట్టు, భావ వ్యక్తీకరణ నేర్పు, బహు విషయపరిజ్ఞానం, ఏ విషయాన్నయినా సూటిగా చెప్పగల ధైర్యం, ఏమయినా విమర్శలు వస్తే ఎదుర్కొనే స్థైర్యం ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న సమర్థులు పి.యస్.ఆర్. అన్నయ్యగారు. రెండు దశాబ్దాల కాలం పైనే విశ్వజననీ మాసపత్రికకు సంపాదకులై భక్తులకు అమ్మకు వారధి అయి ఎన్నో విషయాలలో మార్గనిర్దేశనం చేసిన సమన్వయ సారధి శ్రీ అన్నయ్యగారు. జీవిత పర్యంతం అమ్మను ఆరాధించి అమ్మసేవకే తమ జీవితాలను అంకితం చేసుకున్న ఎందరో అమ్మ బిడ్డల గురించి ‘Mother of All’ పత్రికలో ‘ధన్యజీవులు’ పేరుతో శీర్షికను నిర్వహించి తెలియని ఎన్నో విషయాలను లోకానికి తెలియ చేశారు.
వ్యక్తిగత విషయానికి వస్తే ఎన్నో విషయాలలో నాపై ఎంతో వాత్సల్యంతో నాకు తగిన సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తూ, కొన్ని సందర్భాలలో ఆదేశిస్తూ అమ్మ గురించి నాలుగు మాటలు ప్రస్తావించుకునే అవకాశాన్నీ అదృష్టాన్నీ నాకు అందించారు అన్నయ్య గారు.
ఈ విధంగా కవి, వక్త, సభాసంచాలకులు, విశ్వజననీ మాసపత్రిక సంపాదకులు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ ఒకటేమిటి అన్నీ తామై నిర్వర్తించిన వ్యవహార దక్షులు అన్నయ్యగారు.
‘అమ్మా ఈ శరీరం నీ విచ్చిందేగా
నీలోనుండి వచ్చిందేగా
అసలు ఈ శరీరంలో వున్నది నీవేగా
నన్ను నీకు సమర్పించుకోవటం కాదు
నిన్ను నీకే సమర్పిస్తున్నాను.’ – అంటూ తనలో అమ్మనే దర్శించి అమ్మను చేరిన ఆత్మీయ సోదరులు శ్రీ పి.యస్.ఆర్ ఆంజనేయప్రసాద్ గార్కి అక్షర నివాళులు సమర్పిస్తూ జయహోూ మాతా.