1997లో అనుకుంటాను. బెంగుళూరులో 8 సంవత్సరాలు వుండి మళ్లీ చిత్తరంజన్‌కి వెళ్ళి పోయాము. ఒక రోజు తెల్లవారు జామున ఒక కల వచ్చింది. జిల్లెళ్ళమూడి అమ్మ నివసించిన డాబా మీద నుంచి చూస్తే ఎదురుగుండా పచ్చని కొబ్బరి చెట్లు వాటి మధ్యన ఆలయ సముదాయం. వచ్చిన భక్తులందరికీ న్యూస్ పేపర్ లో చిల్లర నాణేలు పొట్లం కట్టి ప్రసాదంగా అందజేస్తున్నారు. ఆ మనోహర దృశ్యం నా మనసులో నాటుకుపోయింది. మెలకువ వచ్చింది. వాస్తవం లోకి వచ్చి ఆలోచిస్తే మనసు చివుక్కుమంది. అప్పటికి జిల్లెళ్ళమూడి లో హైమాలయం, అనసూయేశ్వరాలయం మాత్రమే ఉన్నాయి. హైమా లయం పక్కనే గుడిసెలు. బయటి నుంచి వెళ్ళిన భక్తులకు అరకొరగా వసతి సౌకర్యం. నాలుగురోజులు ఉందా మన్నా ఉండలేని పరిస్థితి. అమ్మ ఎంతో నిరాడంబరంగా వుండేది. అమ్మ బిడ్డలు అందరు అతి సామాన్యులు -అటువంటి పరిస్థితులలో అటువంటి ఆలయ సముదాయం నిర్మించుకోవడం కలే.
ఎంత అద్భుతమైన కల! నిజం అయితే బావుండు అని మనసులో కోరిక. సాధ్యమా అని సందేహం. కాలంతో పాటు ఎన్నో మార్పులు. ఆ తర్వాత ఎన్నో వార్తలు. జిల్లెళ్ళమూడిలో వినాయకుడి ఆలయం, నవ నాగేశ్వర ఆలయం, యజ్ఞశాల నిర్మాణం జరుగుతోందట. హైమాలయం అభివృద్ధి పనులు మొదలు పెట్టారుట. ధ్వజస్తంభాలు కూడా స్థాపిస్తారుట-అని గొప్పగా చెప్పుకున్నారు. మరో పక్క నించి ఆలయాల కంటే ముందుగా ఒక నాలుగు గదులు వేసి వచ్చిన వాళ్లకు వసతి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది కదా! క్షేత్రానికి వెళితే ఎక్కడ ఉండాలి అనేది భయంకరమైన సమస్యగా వుంది . ముందు ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. ఆ తరువాత ఆలయాలు నిర్మించుకోవచ్చు అనే విమర్శలు కూడా వచ్చాయి. నిరాటంకంగా ఆలయ నిర్మాణం సాగిపోయింది. ముందు అనుకున్నవే కాకుండా పాద మండపం నిర్మాణం కూడా ప్రారంభం అయింది. అమ్మ పాద మండపం నిర్మాణ థలో ఉన్నప్పుడు నేను వెళ్లాను. రాచర్ల కమల అక్కయ్య కూడా వచ్చారు. ”అమ్మ పాదాల మండపం. చూస్తున్నావా ఎంత బావుందో!” అన్నారు మురిపెంగా. అవును చాలా బాగుంది అన్నాను కానీ మనసులో ఓ మూల మళ్లీ ఈ మండపం ఎందుకు? అమ్మ గదిలో మంచం దగ్గర ఉన్నాయిగా అమ్మ పాదుకలు అని ఆలోచన.
మళ్లీసారి వెళ్లేసరికి మంటపం పూర్తయింది. దగ్గరకు వెళ్లి కూర్చుని పాదాల మీద చేతులు వేసాను. అంతే. గుండె ఝల్లుమంది. మనసులో నుంచి ఆనందంతో, ఉద్వేగం తన్నుకు వచ్చింది. కళ్ళ వెంట ధారగా కారిపోతున్న నీళ్ళు తుడుచుకోవాలి అని స్పృహ కూడా లేదు. అమ్మ పాదాలు శిలా రూపంలో కాకుండా మెత్తగా మృదువుగా సజీవంగా ఉన్నాయి. ఎప్పుడో చిన్నతనంలో అనుభవించిన ఆనందం అది మళ్లీ ఇంత కాలానికి. ఆ పాదాల మీద తలవాల్చికొని ఎంతసేపు ఉండిపోయానో నాకే తెలియదు. అప్పారావు అన్నయ్య గారు అటుగా వచ్చి ఎప్పుడు వచ్చారు అక్కయ్యా అని పలకరించే సరికి ఈ లోకం లోకి వచ్చాను. మళ్లీ జిల్లెళ్లమూడి విషయానికి వస్తే అందరి ఇల్లు కొత్త భవన నిర్మాణం తల పెట్టారు. నమూనా ఫోటో చూసి మనసులో భయం.. అమ్మో చాలా పెద్ద ఎత్తున తల పెట్టారు. సాధ్యమా అని సందేహం. అనుకున్నదాని కంటే గొప్పగా నిర్మాణం పూర్తి అయ్యింది. కామరాజు అన్నయ్య బంగారం పూలు చేయిస్తారుట. అవుతుందా? అని అనుమానం. అయింది. ఆ గోశాలట. మళ్లీ అనుమానం. సాధ్య మేనా?? అయింది. బాలికల హాస్టల్. అవుతోంది. ఏ పని తల పెట్టారు అన్నా ఏమీ చెయ్యక పోయినా కంగారు భయం నాకు. అమ్మో ఎట్లా పూర్తి అవుతుంది అని ఆదుర్దా, ఎన్ని సార్లు అనుభవం అయినా ప్రతిసారీ పరగడుపే. ఇప్పుడు అసలు విషయం చెపుతాను. రెండేళ్ల కిందట మేడ మీద నిలబడి చూసి నోట మాట రాలేదు నాకు. ఎప్పుడో 1997 లో నేను కలలో చూసిన దృశ్యం కనుల ఎదుట. అదే ఆలయ సముదాయం. పచ్చని తోటలో. అదే అద్భుత దృశ్యం. వాస్తవ రూపంలో. మనసారా అమ్మకు దణ్ణం పెట్టుకున్నాను.
ఇప్పుడు జిల్లెళ్ళమూడి ఒక అద్భుతమైన ప్రదేశం. దేనికీ కరువు లేదు. కావలసిన సౌకర్యాలు సదుపాయాలు సమస్తం ఉన్నాయి. న్యూస్ పేపర్ లో నాణాలు ప్రసాదంగా ఇవ్వటం కూడా నిజమే అయింది. అమ్మ బిడ్డలం అందరం ఆర్ధికంగా స్థిరపడ్డాం. పిల్లలు వృద్ధి లోకి వచ్చారు. మనం తిని ఇంకొకరికి గుప్పెడు పెట్టే స్థితిలో వున్నాం.
ముందు ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు తనే కలలో అద్భుతమైన దృశ్యం చూపించి తనే నిజం చేసి చూపించిన ఆ చల్లని తల్లికి శతకోటి వందనాలు. అమ్మా! కేవలం గడ్డి పోచలం. సంకల్పం కార్య భారం అంతా నీదే. నీవు నడచిన ఆ దివ్య ధామం ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత వైభవంగా, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లాలని మా అందరి కోరిక. మా అందరి కలలు ఫలించాలని దీవించు.