ప్రథమమున అమ్మను సందర్శించిన సోదరులలో నొకరు (ఆ.రా. శర్మస్వర్ణ, 1958 సెప్టెంబరులో పూరింటి దొడ్డివాకిట గల తులసి కోట దగ్గర అమ్మ యుండగా “తాము ఏ మంత్రము జపించితిరి? తమ స్థితి ఏమి?” అని ప్రశ్నించిరి. అందులకు అమ్మ తాను తరచు మీరనుకొను కాకి మంత్రము, కొంగజపము చేయుచుండగా ఎచటి నుండియో ‘ఏ’ వచ్చిపడి నందున తానే కాకి నైతి ననిరి. ఇక మంత్ర విషయములో మంత్రశాస్త్ర పీఠిక అ, ఆ, ఇ, ఈ… అం అః మాత్రము తెలియుననిరి.
సుఖ దుఃఖము లాదిగా గల ద్వంద్వములు గల జీవుడు కాకి యనబడును. అతడే ఆ విద్య యందు ప్రతిఫలించిన చైతన్యము. జీవజప్యమైన హంస మంత్రము, అప్రయత్నముగ, జననాదారభ్య అహర్నిశము జరుగుచునే యున్నది. ఇట్టి అజపా మంత్రమయిన హంస శబ్దమున “సో…హం” అను కాలమున అతడే నేను నేనే అతడు అనునది అన్యోన్య ప్రతిపాదికత్వము. జీవత్వావధిభూతమైన హంసత్వపు పరమావధి బ్రహ్మసాక్షాత్కారము (జీవన్ముక్తత్వము). ఈ రెంటికి సాక్షిభూతమైన వస్తువును వివేకియైన జీవుడు పొంది జనన మరణాదుల విడచును.
“కాకీముఖ కకారాంతం – మకార శ్చేతనా కృతిః
ఉకారస్యచలుప్తస్య కోర్ధస్సంప్రతిపద్యతే”
కాకి శబ్దము యొక్క మొదటి దైన ‘క’ వర్ణము, కడపటిదైన అకారము ప్రతిబింబమైన జీవునికి ముఖస్థానీయ బింబభూతమైన బ్రహ్మను ప్రతిపాదించును. కనుక ఆకాకీ ముఖము నందలి ‘అ’ను పొందుట కకారాంతము. బ్రహ్మాండ పిండాండ స్వరూపుడైన జీవుడు. కాకి శబ్దము యొక్క ప్రథమ ‘అ’కారంబు యొక్క అగ్రమందలి ‘ఆ’కారము పురుష బీజము కావున ప్రకృతి పురుషాత్మకమైన జీవుడు అనబడును. ‘లుప్తస్య’ అనుటలో జీవత్వ నాశనము గనుట యగును. కావున తాను అఖండానందాద్వితీయ సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మనేననుట.
అట్లగుట, హంస స్వరూపమైన జీవస్వరూపమును ఆ శివరూపము తెలిసే పర్యంతము విచారణ సేతుగా, తెలిసిన పిదప మిధ్యయగును. తెలివి, తెలుసుకొనునది తెలియబడునది ఒకటియగు త్రిపుటీ రహితస్థితి. అది ‘అ’ మాత్రము, హ్రస్వ, దీర్ఘ, ప్లుతాది రహితము. బిందు. నాద కళాతీతము. మనో, బుద్ధి, చిత్త అహంకారములకు ఉత్పత్తి స్థానమయిన ‘ఏ’ మహద హంకారము కలదో అందుకు బీజ భూతమైన మూల ప్రకృతినే పరాశక్తి బిందువందురు. ఇదియే ‘ఏ’ వచ్చిపడుట.
ఆ పరాశక్తి బిందువును ఛేదించుకొని పుట్టిన పరా, పశ్యంతి, మధ్యమా వైఖరీ రూపముల నాదమందురు. పద్మపాదాను సారము దీని కవ్వల సహితము త్రివిధావస్థలు గలవు. ఇక ‘కళ’ యన క్షేత్రజ్ఞుండు అగు జీవుడు. దీనికి అతీతము అనుటయే ‘ఏ’ వచ్చి పడుట. కావున ‘ఏకాకి’ అగుటయన సర్వవేదాంత తత్త్వజ్ఞుడగు బ్రహ్మమే తానగుట.
జ్ఞానము చేతను, జ్ఞానశేషమైన భగవత్ జ్ఞానంబు ప్రాప్తమగుటచే సర్వవేదాంత తాత్పర్య గోచరమైన బ్రహ్మ హృదయమందు ప్రత్యక్షముగా భాసిల్లుచుండగా దేహోపాధిగల జీవుడు, సంప్రాప్తమైన ఉపాధిగలవాడైనందున, వానికి యోగము ధ్యానము మొదలగు వానితో పనిలేదు. అనుభూతి స్వరూపమైన ఫలము సిద్ధించినది గాన, జ్ఞానానుభవముల గూర్చి చెప్పిన శాస్త్రాదుల వదలును. సాధన జ్ఞానమును, సాధించిన జ్ఞానమున్నూ వదలి ‘సాధ్యము’ తానై యుండును ఇట్టి తరి విధి, నిషేధాదులు లేవు.
కృతకృత్యుడైన తరి తనకుగాను చేయదగిన ప్రయోజనము లేదు, లోక సంగ్రహము కొరకు ఉండును. చేయుట అనునది లేదు. సుఖదుఃఖాది సంబంద రహితుడై, మరణ దుఃఖాద్యనుభవికాడు. కావున జీవన్ముక్త, స్థితియే ‘ఏకాకి’ యగుట.
“కాయ స్థోపి, సవిప్తస్య, కాయస్థోపిన భాత్యతే” ఇక చదువుట, శాస్త్రములు అన అక్షర పీఠికయగు అ, ఆ. ఇ, ఈ…. మాత్రము తెలియుననిరి. ప్రణవమన సర్వశబ్దములు అని ఇది వరకే చెప్పబడినది. ఈ శబ్దమునకు పూర్వము భావమగును. భావమును వెలిబుచ్చుటకు భాష ఔసరము. కావున ప్రకాశ శబ్దార్థము నెరింగిన పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల సకల చరాచర జీవుల భాష అవగతమగుట తెలియనగును.