ఆ మహిమోజ్జ్వలంబులగు నానన సుందర దీప్తు లెల్లెడన్
కామిత దాయకంబులయి కన్నుల ముందట వెల్గుచుండగా
ఆమెకు సాటి ఈ ధరణి యందున గానగ రాదు చూడగా
ఏమియు చెప్ప జాలమిక యెల్లలు లేనిది అమ్మ ప్రేమయే.
అన్నము విద్యయు న్నొసగి ఆర్తిని బాపుచు నాదరించగా
ఎన్నగరాని మోదమున నెల్ల జనావళి మేలు పొందగా
కన్నుల కాంతిరేఖలను గాంచును సంతస మొందుచుండి తా
కన్నది నేనె’ యంచనెడి కామితదాయిని అమ్మ మ్రొక్కెదన్.