1943లో శ్రీ స్వభాను నామ సంవత్సర కార్తీక బహుళ షష్ఠినాడు హైమ జన్మించింది. అందరి అమ్మగా అనసూయమ్మ వాత్సల్యామృత వృష్టిని కురిపిస్తే హైమక్క మనందరి సహోదరిగా రక్తసంబంధ బాంధవ్యానికి ప్రతీకగా గొప్ప సంస్కారంతో నడయాడింది. ‘అమ్మగారి కూతురు’ అని ఎవరైనా అంటే “అదేంలేదు, నన్ను హైమక్క అనిపిలవండి అంటూ దగ్గరకు తీసేది.
తనను గురించి కాక అందరి కష్టాలు – కన్నీళ్ళను చూసి విలవిలలాడేది. నేరుగా అమ్మ దగ్గరకు పోయి మన కష్టాలు నశించి శాంతియుత జీవనం చేయాలని అమ్మకు మొరపెట్టుకునేది, కన్నీళ్ళు పెట్టుకునేది, పోట్లాడేది.
అట్టి పరహితార్థ కామన, పారమార్థిక నిర్మల తత్వం హైమలో చూసి అమ్మ ఆనందించింది; దైవత్వాన్నిచ్చి కల్పవృక్షంగా కామధేనువుగా ప్రతి ంచింది.
దయగల హృదయం దైవనిలయం అట్టి మూర్తీభవించిన కరుణే హైమ. ఒకసారి హైమ నిద్రిస్తోంది. చీకటిలో తన మూడు వ్రేళ్ళకు తేలు కుట్టింది. చెయ్యి జాలు వేరే చెప్పనక్కరలేదు. అంత బాధలో ఉండి కూడా హైమ ఆ సందర్భంగా “దానిని ఏమీ చెయ్యొదు. నా చేతివేళ్ళు దానికి అడ్డము వచ్చాయేమో” అన్నది.
హైమ శ్రీ బుచ్చిరాజు శర్మనే ‘రాజుబావ’ అని సంబో ధించేది. తంగిరాల వారిని, అడవులదీవి వారిని పుట్టింటి వారుగా సంభావన చేసి, వారి తోబుట్టువుగా నిలిచింది. ఆచార్య ఎక్కిరాల భరద్వాజను కన్నబిడ్డలా ఆదరించింది. రాజుపాలెపు శేషగిరిరావు, తంగిరాల రాధ ఎందరో అన్నయ్యలకు సుదీర్ఘంగా లేఖలు వ్రాసేది. ఆ లేఖలన్నీ హైమ ఆత్మీయతను అనురాగాన్ని ప్రతిబింబించేవి.
భద్రాద్రి తాతగారి వద్ద సంస్కృత భాష నేర్చుకున్నది. హైమ ఆలయప్రవేశం చేసిన తర్వాత గురువు గారే శిష్యురాలిని మహేశ్వరిగా దర్శించి అభిషేకములు అర్చనాదికములు నిర్వహించారు. ‘కలశాబ్ది కన్యకామణి’ ‘మణిద్వీపవాసిని’ అని కీర్తించారు. హైమవతీశ్వరి కృపవలన సర్వులు సకల శుభములను లాభములను పొందగలరని మంగళాశాసనం చేశారు.
ఒకసారి హైమ నడచివస్తుంటే, ఆ కాలిగజ్జెల సవ్వడి విని శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ‘అమ్మా! దేవత నడచి వస్తున్నట్లు ఉందమ్మా” అన్నారు. వారి పలుకుల్ని నిజం చేసింది అమ్మ.
శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ, శ్రీ బుద్ధిమంతుడు, శ్రీ రావూరి ప్రసాద్ వంటి అనేకులు హైమను అర్చించుకుని సకలార్థసిద్ధిని పొందారు. హైమ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత శ్రీ ఎమ్.దినకర్, శ్రీరాజుపాలెపు శేషగిరిరావు, శ్రీ నాదెండ్ల భ్రమరాంబ వంటి సోదరీ సోదరులకు ప్రత్యక్ష దర్శనాల్ని అనుగ్రహించింది.
అమ్మ వలుమార్లు ఉద్ఘాటించింది – “హైమాలయంలో 11 రోజులు అభిషేకాలు చేసుకున్నా, 40 రోజులు లలితా పారాయణ చేసుకున్నా ఫలం ఉన్నది” అని.
కనుకనే హైమమ్మ కోరిన వరాల నిచ్చే కల్పవల్లిగా, ఆశ్రిత పారిజాతంగా, ఐహిక ఆముష్మిక సౌఖ్యాలను అనుగ్రహిస్తోంది. కామితార్థ ప్రదాయిని హైమవతీశ్వరి శ్రీ చరణాలకు శతసహస్రాధిక వందనములు.
ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ