బ్రహ్మాండ వంశసాగరుడు, అర్కపురి సుధాకరుడు, సుకృతుడు మన నాన్నగారు.
నవనీత హృదయుడు మన నాన్నగారు.
నిరాడంబరుడు మన నాన్నగారు.
నిర్లిప్తమైన జీవితం నాన్నగారిది.
అర్కపురిలో వారికి అన్ని అధికారాలూ వున్నాయి. అయినా వారు ఏ అధికారమూ కోరలేదు.
లక్ష్యశుద్ధితో ప్రతిపని చేయాలనే తపనా, ఏ పనిలోనూ అజాగ్రత్త కూడదనే ధోరణి వారి మాటల్లో ద్యోతకమౌతుంది. 1969లో AGAMANI అనే పేరుతో అర్కపురిలో వున్న NAGAMANIకి T.M.O. వస్తే, అర్కపురి పోస్టుమాస్టరుగిరి చూస్తున్న నాన్నగారు – es T.M.O. యివ్వడానికి నిరాకరించారు. ఈ T.M.O. మాదేనండి. నా భార్యకు హైదరాబాదు నుండి మా అన్నగారు పంపారు. టెలిగ్రాంలో ‘N’ అనే అక్షరం పొరపాటున పోయి వుంటుంది. అని యెంత మొత్తుకున్నా- ససేమిరా అని AGAMANI అనే పేరుతో అర్కపురిలో ఎవరూ లేరని రూఢిచేసుకొని – ఆ తర్వాత సాక్షుల సంతకాలు వగైరాలు తీసికొని ఆ T.M.O. బట్వాడా చేశారు – నాన్నగారు. – విధినిర్వహణలో మొగమాటములకు తావులేదు నాన్నగారి దగ్గర.
పరమాత్మ “అమ్మ”కు రాచపుండు యేర్పడినప్పుడు, నెల్లూరులో నాన్నగారు గడిపిన ఆ రోజుల్ని – అమ్మ ఆరోగ్య విషయంలో నాన్నగారి సున్నిత హృదయం పొందిన ఆవేదనను – నాతో వెళ్ళగ్రక్కుకుంటూ, మా సాన్నిహిత్యాన్ని
ఆత్మీయతగా మలచారు నాన్నగారు. “అమ్మ” రాచపుండును ‘అమ్మ’ వ్యక్తపరచే బాధను నాన్నగారు వర్ణిస్తూ ఉంటే, చెమ్మగిల్లిన నా కళ్ళను చూసి వారి హృదయం ద్రవించేది.
ఏ వూరు వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, నిరాడంబరంగా – తాను కేవలం జిల్లెళ్ళమూడి కరణంగానే చెప్పుకునేవారు. ఎవరైనా తెలుసుకొని “ఓ ! మీరు నాన్నగారు కదూ!” అని అంటే – చిరునవ్వు నవ్వేవారు. ఆ నవ్వులో ఎంత అమాయకత్వం !!
“సత్యనారాయణగారూ – మీ అమ్మ చూశారా ? ఆమె ఆరోగ్యం ఎలా వుందో అడిగారా?” అని గుచ్చి, గుచ్చి మరీ అమ్మ ఆరోగ్యం గురించి ప్రతిక్షణం అడిగి తెలుసుకునేవారు – హైద్రాబాదులోనూ, అర్కపురిలోనూ.
డాక్టర్లు, “ఫర్వాలేదు – అమ్మ ఆరోగ్యంలో చాలా ప్రోగ్రెస్ వుంది అంటున్నారు” – అని నేనంటే.
“డాక్టర్ల విషయం కాదండీ – మీ అమ్మగారు ఏమంటున్నారు?” అని మళ్ళీ ప్రశ్నించేవారు.
అమ్మ తనకు కులాసాగా వున్నది – అని చెప్పాలనీ, అమ్మ నోటివెంట ఆమాట వచ్చినట్లు వినాలనీ – నాన్నగారు ఎంత తపించేవారో !
విశ్వకుటుంబిని మన ‘అమ్మ’ను కళ్యాణమాడి – జగత్తులోని సర్వప్రాణికోటి నుండీ “నాన్నగారూ” అని పిలిపించుకున్న మన నాన్నగారు కారణజన్ములు, మహామనీషి.