1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కాలప్రాధాన్యవాదిని అమ్మ

కాలప్రాధాన్యవాదిని అమ్మ

A.Hyma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : January
Issue Number : 6
Year : 2011

‘Time comes, but once and never returns. It is one of the heaven’s choicest blessings. And once lost is irrecoverable’ – అనేది లౌకిక దృష్టి.

ఐదేండ్ల ప్రాయం గల చిన్నారి “అమ్మ” ఒకసారి మన్నవలో చింతలతోపుకు వెళ్ళింది. ఒక చింతచెట్టు ఎక్కి ప్రకృతి నలుమూలలా నఖశిఖ పర్యంతం పరిశీలించింది. తనలో తాను “చింతచెట్టు ఉన్నది. చిగురు వేస్తుంది. పూలు పూస్తుంది. కాయలు కాస్తుంది. లేతకాయలు ఉంటాయి. ముదురుకాయలు కాస్తయి. పండుకాయలు వస్తాయి. కానీ అన్ని లక్షణాల్నీ ఒకేసారి చూపటం లేదు. అన్నీ కాలం మీద ఆధారపడ్డాయి” అని విచికిత్స చేసుకున్నది.

“అన్నింటినీ కాలమే పరిష్కరిస్తుంది” అంటూ అమ్మ కాలప్రాధాన్యాన్ని వివరించింది. తాను కాలస్వరూపిణిగా అర్థం కావటం లేదు. ఒకనాటికి తెరతీసి కాలమే ఆ జ్ఞానాన్ని కలుగజేస్తుందేమో !

‘అమ్మను గురించి నాకు తెలుసు’ అని అనుకునే వారికి వాస్తవంగా అమ్మ తెలియదు, ‘తెలియదు’ అని అనుకునేవారికి తెలుసు. ఈ చిత్రాన్ని శ్రీరాజుబావగారు

 ‘తెలియని వారికి తెలిసెడి నీవె

 తెలిసిన వారికి తెలియవదేమొ!

తెలిసెడి తెలివిని తెలుపుము తల్లీ!!” అంటూ ‘తెలివి’ అంటే అమ్మే అని వివరించారు. తెలుసుకునే తెలివిని అమ్మే అనుగ్రహించాలి. కేవలం శాస్త్రజన్యజ్ఞానం అజ్ఞాన హేతువే.

అనుభవంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే ‘అనుగ్రహం’ అని మురిసిపోతాం; ఎదురుగాలి వీస్తోంటే ‘ఆగ్రహం’ అని నొచ్చుకుంటాం. ఆ ధోరణి సరియైనదా ? ‘నువ్వు ఆపదుద్ధారిణివి’ అని కీర్తిస్తే అమ్మ సన్నగా నవ్వుతూ “సంహారకారిణినీ నేనే” అని సంపూర్ణత్వాన్ని దర్శింపచేసింది. భాగ్యమూ, దౌర్భాగ్యమూ, కలిమి లేములు, న్యూనతాధిక్యాలూ… రెంటికీ మూలం ఈశ్వరసత్సంకల్పమే. మాటలు వరకే పరిమితమయ్యే మనం ఆ సత్యాన్ని అనుభవంలో జీర్ణం చేసికోలేం. మహాత్ములకీ మామూలు వాళ్ళకీ తేడా అదే.

కానీ సర్వసృష్టి ధర్మాలకీ అతీతంగా అమ్మ ప్రదర్శించే మాతృప్రేమ అనితర సాధ్యం, వర్ణనాతీతం. ‘తక్కిన వేల్పుల తీరు వేరు; మా తల్లి తీరు వేరు; ‘కొంచెం విశ్లేషణ చేద్దాం. జీవరాశి వెతలకి, వ్యధలకి, భోగభాగ్యాలకి, కారణం – జనన మరణ రూపు జన్మపరంపరాగత కర్మఫలం – అనే సంప్రదాయ వాదాన్ని కూలద్రోసింది అమ్మ. “చేతలు చేతుల్లో లేవు” అని నొక్కి వక్కాణించింది; “అందరికీ సుగతే” అని బేషరతుగా సర్వులనూ ఓదార్చింది; ఒడ్డుకు ఎక్కించింది; ఉద్దరించింది. ఆస్తికులూ, నాస్తికులూ, మ్రొక్కినవారు, మ్రొక్కనివారూ…. అంతా కాలాన్ని అనుసరించి అమ్మలోనే మనుగడ సాగిస్తూ, అమ్మలోనే లీనం అవుతారు” అని వివరించింది. కనుకనే -‘కాస్త ముందు, వెనుక తేడా” అని చేర్చింది. అందరూ అన్నీ ఒక చోట నుంచే వచ్చారు, వచ్చాయి. కానీ ఒకేసారి రాలేదు. ఒకసారే పోరు, పోవు.

“మరుగే నా విధానం” అని ప్రకటించిన అమ్మ నడక అగోచరమైనది. నడిచేది, నడిపించేదీ తానే అనే జ్ఞానాన్ని తన మాయ తెరల మాటున కప్పివేస్తుంది. అయినా “అమ్మ కరుణారసమృతత్వాన్ని తెలుసుకోవటానికి ఒక మార్గం ఉన్నది. అది మన హైమక్కయ్య. ‘ఎవరు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని నేను నీకు నమస్కారం చేసుకుంటాను’ అనే హైమప్రార్థన, అభ్యర్థన అపూర్వమైనది, అలౌకికమైనది. అదే మానవత్వానికి పరాకాష్టస్థితి. “నర్వేజనాః సుఖినోభవంతు” అనే ఆర్షవాక్యానికి సాకారరూపం హైమ; విశ్వకళ్యాణ కోసం విశ్వజననిని నిరంతరం ఉపాసించే సర్వజీవన సంజీవని హైమ.

అమ్మ ప్రవృత్తి కాలాబాధ్యమైనది. అమ్మకి త్రికాలములు లేవు; అంతా వర్తమానమే. “నాకు ఎప్పటికప్పుడు ఎప్పుడూ ఇప్పుడే” అని వివరించింది. అమ్మ చర్యలు కాలాతీతమైనవి. అమ్మరూపం పరిమితం, శక్తి అనంతం. మానవ మమకారం పరిమితం, స్వార్థంతో సంకుచితం. అమ్మ మమకారం సర్వత్రా పరివ్యాప్తం మాధవత్వ విలసితం. కనుకనే అమ్మ ప్రేమకు ఎల్లలు లేవు; అది అకారణమైనది, అక్షరమైనది.

‘ఆశీర్వదించమ్మా!’ అని అడిగితే, “అది ఎప్పుడూ ఉన్నది’ అన్నది. ‘నిన్నే నమ్ముకున్నాను, నువ్వే రక్షించాలి’ అని అంటే, “ఆ నమ్మకమే నిన్ను రక్షిస్తుంది” అన్నది. మరి ఆ విశ్వాసాన్ని కలిగించాల్సిందీ అమ్మే. ‘తల్లి అంటే తరింప చేసేది’ అని తన జగన్మాత ధర్మాన్ని అవతారలక్ష్యాన్ని నిర్వచించిన అమ్మ తప్పక కలిగిస్తుంది.

ఒక వ్యక్తి జీవనయానంలోని లాభనష్టాలు, సుఖదుః ఖాలు, పరమలబ్ది (Net gains), పరమమూల్యం (Net Value అమ్మకే బాగా తెలుసు. కనుకనే “అడగకుండా అవసరాన్ని గమనించి పెట్టేదే అమ్మ” అని అమ్మ పదానికి లోకోత్తరమైన మహోత్కృష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది. కావున మరొక ఆలోచన లేకుండా; 

“నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో!” అనీ,

‘నిన్ను ఆరాధింపగ నీయుమమ్మ, అనసూయా! 

ఆపదుద్ధారిణీ!!’ అనీ మనసారా అమ్మను ప్రార్థించటం మన వంతు; సమయం చూసి సముచిత స్థితిని ప్రసాదించడం అమ్మవంతు. ఘటనాఘటన సమర్ధ,

అనన్య సామాన్య కళ్యాణ గుణసంపన్న, 

అకారణ కారుణ్యరసోదధి అమ్మ.

‘భవితవ్యాణి భవంతి ద్వారాణి సర్వత్ర’ అన్నారు. కాళిదాసు మహాకవి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!