1. Home
  2. Articles
  3. Mother of All
  4. కాలాతీత చైతన్యం

కాలాతీత చైతన్యం

V S R Moorty
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 13
Month : January
Issue Number : 1
Year : 2014

ఆధ్యాత్మ సాధనలో భాగంగా స్వాధ్యాయం, సదోష్ఠి, సదాచారం, సత్సంగం, సత్సాంగత్యం వంటి వన్నీ సాధకుణ్ణి ఎరుకవైపు నడిపిస్తయ్. గడచిన జన్మలలలోనే వీటన్నిటినీ సాధించుకున్నవాడు, చివరి జన్మగా ఒక అవకాశాన్ని పొంది మహాత్ముల దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా స్వీయసాధనా బలిమితో ఎరుక సాధిస్తాడు. ఇదంతా వ్యక్తిగత ఆధ్యాత్మసాధన. అయితే యిటువంటి వారిని నడిపించటానికి పూర్ణ చైతన్యమే సాకారంగా, సగుణంగా, స్వభావంగా అరుదుగా, అవసరమైన వేళ వసుధపై అభివ్యక్తం కావటం, కొత్తకాదు. అటువంటి వారిని అవతార మూర్తులుగా భావించటం అలవాటే. అవతార ప్రవాహంలో ఎందరెందరో మూర్తులు సాలోక్య, సామీప్య, సాన్నిధ్య స్థితులలో సంచరిస్తూ తామున్న కాలాన్ని, తమ తరువాత కాలాన్ని ప్రభావితం చేయటం తెలిసిందే. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడై వచ్చినా, శ్రీరాముడెన్నడూ తనను దైవంగా ప్రకటించుకోలేదు. దశరధనందనుడిగా, రఘురాముడుగా, విధి నడిపినట్లు నడిచే మానవుడిగా తన యాత్రను పూర్తి చేశాడు. దీనికి భిన్నంగా శ్రీకృష్ణుడు తనను దైవంగా నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. తదనుగుణంగా తన అవతార కాలాన్ని సుసంపన్నం చేశాడు. అమ్మ తనను అవతారంగా ప్రకటించుకోలేదు. ‘నేను అమ్మను. మిగిలినవన్నీ నా బిడ్డలు’ అన్నది. అంతటితో ఆగకుండా, నేను గురువును కాను. నాకున్న వారంతా బిడ్డలేగాని శిష్యులు కారు” అంటూ తన మూలాన్ని స్పష్టం చేసింది. అమ్మ, తన అవనీ సంచారమంతా వాత్సల్యమయం చేసింది.

ఆమె సాగించిన మహాకారుణ్య యాత్రలో ఎందరెందరో మహనీయులు, మహాత్ములు అమ్మకు తారసపడ్డారు. అమ్మను దర్శించుకున్నారు. అప్పటికే వారు ప్రసిద్ధులు. అనుచరగణం గణనీయ స్థాయిలో సంస్థితం. ఆధ్యాత్మ సాధకులకు మార్గోపదేశం చేయగల స్థితి వారిది. లోకరీతులను ఆకళించుకుని, శాస్త్రాధ్యయనంలో అధికారం సాధించుకుని, సమాజాన్ని సరైన దిశలో నడిపించగల సమర్థులు. అటువంటి మహనీయమూర్తి శ్రీ కళ్యాణానంద భారతి స్వామివారు. వారు, అమ్మ కలుసుకున్నపుడు, వారిరువురి మధ్య సాగిన సంభాషణం ఒక ఆధ్యాత్మ రేఖ. ఇరువురి మధ్య, వయసులో ఎంతో అంతరం. అమ్మ పసిబాల. నిరంతరానందహేల, ఆమె చలచ్చలనాలన్నీ అతిమానుషఖేల. బిడ్డను తడిమే తల్లి స్పర్శ. చూపులన్నీ దయాపరిపూతాలు. అంతరంగమంతా అనంత అనురాగ సాగరం. ఆమెది అమనస్క స్థితి.

“అమ్మా! నీవెవరు?” అని స్వామి ప్రశ్నించినపుడు, అమ్మ సమాధానం, “ఆ ప్రయత్నంలోనే యిక్కడకు వచ్చాను.”

“మీ కులం?”

“శుక్ల శోభితాలకు ఏకులమో, అది” అమ్మ జవాబు.

“నిన్ను నీవు తెలుసుకోవాలంటే మంత్రం కావాలి” స్వామి. “మంత్రమంటే?” అమ్మ మాయక ప్రశ్న.

“శక్తివంతమైన కొన్ని అక్షరాలతో, వాక్యం తయారుచేసి, మా బోటివారు మీ వంటి వారికి రహస్యంగా చెప్పేదే మంత్రం”, స్వామి వారి వివరణ.

“శక్తివంతమైన అక్షరాలను మంత్రంగా మార్చగల మీ శక్తిని గరికలకూ యివ్వచ్చుగా” అమ్మ పరిప్రశ్న.

“నువ్వు చిన్న పిల్లవు. చెప్పించుకోవాలి” స్వామి మందలింపు.

“చెప్పింది వింటాను. చెప్పించుకోను” అమ్మ సమాధానం. “తరుణమంటే ఏమిటమ్మా” స్వామివారి ప్రశ్న.

“నాయనా! తప్పించుకుందామన్నా తప్పనిది. చేద్దామనుకున్నా చేయలేనిది. వీటన్నిటినీ నడిపిస్తున్న వాడు కర్త. విధానం కర్మ” అమ్మ వ్యాఖ్యానం అంతటితో ఆగకుండా, “మంత్రమంటే మనస్సు. బీజాక్షరాలంటే శబ్దం. ఆ శబ్దానికి వున్న స్థాయే అక్షరం”. అంటూ ముగించింది.

అమ్మ నోట వెలువడిన మరికొన్ని మాటల మణులు, విశ్వజనీనాలు. “ఆధార, అవకాశాల మేలుకలయికే, వుండటమనే స్థితి. అదే యదార్థం. మనసును బట్టే విషయం అర్థమౌతుంది.

సంస్కారానికి అభివ్యక్తి, నమస్కారం.”

అమ్మ, స్వామివారు సాధక ప్రపంచానికి ప్రసాదించిన రెండు అధ్యాత్మ కోణాలు.

“వెళ్ళిరా! అమ్మాయీ! అమ్మాయిలా కనిపిస్తున్నా, అమ్మగా తోస్తున్నావే” అని స్వామి వారి మాటకు, 

“ఆ మాయి అమ్మేగా. మాయి అంటే అమ్మకదా” అన్నది అమ్మ ముక్తాయింపు. తెలుసుకోవటానికి కాక తెలపటానికి వచ్చిన, అమ్మాయిలో దాగిన అమ్మత్వాన్ని బహిర్గతం చేసిన, అవతారాన్ని కాదంటూనే, జ్ఞాన స్వరూపాన్ని ఆవిష్కరించిన, అమ్మ, శుద్ధ చైతన్యం. స్త్రీ రూపధారణ చేసిన ఒక మహాసత్వం.

ఇదంతా జరిగినపుడు, అమ్మ వయసు కేవలం ఏడు సంవత్సరాలు. చైతన్యానికి వయసు, మనసు ఉంటాయా?

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!