2023 జూన్ 5వ తేది. అమ్మ ఒడిబిడ్డలులో చూసిన వార్త. “మా గురువుగారైన శ్రీ విరాల రామచంద్రమూర్తిగారి ధర్మపత్ని సుగతి పొందినారు” అని. ఈ వార్త విని శిష్యగణమంతా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైనాము. అంతకు ముందు నెలలోనే ఆ దంపతులిద్దరు జపానులో దిగిన ఫోటోలు చూసి ఎంతో ముచ్చట పడ్డాము. ఆనందించాము. అంతలోనే ఇంత విషాదమా అని దిగ్భ్రాంతి చెందాము.
కార్యేషుదాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ ఈ లక్షణాలన్నీ ఆమె పుణికి పుచ్చుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదనిపించింది.
ఆమె గృహస్థుగా మాష్టారికీ, ముగ్గురు పిల్లలకి చక్కని సేవలందించారు. అలాగే అమ్మ ఆశ్రమంలో ఏ సేవాకార్యక్రమాల్లో అయినా హుషారుగా పాల్గొనేవారు. ఒకప్పుడు అమ్మ విద్యాసంస్థలోవారు, విద్యార్థులతో కలిసి అన్నపూర్ణాలయంలో భోజనాలు అనే ప్రతిపాదన పెట్టినప్పుడు, మాకు వడ్డించడంలోను మాతో కలిసి మెలిసి ఉండేవారు. ఇలా ఆమె కార్యేషు దాసీ.
1976 జులైలో ఒక రాత్రి 9 గంటలకు ఏడుస్తూ మాష్టారి తలుపు తట్టాను. అప్పుడు ఆమె తలుపు తీసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నాకు “రామశబ్దం” రావటం లేదు. కాబట్టి నేను ఇక్కడ ఉండను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు నన్ను ఓదార్చి మాష్టారి దగ్గరకు తీసుకుని వెళ్ళగా వారు “అమ్మాయి ! ఇక్కడకు రావటం, వెళ్ళడం అంతా నా యిష్టం కాదు అమ్మ యిష్టం” అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఇలా నా ఒక్కదానికే కాదు. 1976 – 1981 మా బ్యాచ్ మాష్టారు గైడ్ కాబట్టి మా బ్యాచ్ అందరికీ ఆమెతో ఏదో ఒక అనుబంధం ఉంది.
మా గురువుగారు కష్టాల్లో పడినప్పుడు తన కుమారుడు, కుమార్తెల చదువుల వివాహాల విషయంలో ఆమె కరణేషు మంత్రీ. 2011 జనవరిలో మాష్టారు విజయవాడలోని “శివరామకృష్ణ” అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు నేను మా శ్రీవారు వెళ్ళి, ఆ దంపతులను గౌరవించుకునే భాగ్యాన్ని అమ్మ మాకు కలుగజేసింది. అప్పుడు మా దంపతులను ఆమె ఎంత ముచ్చటగా, ఎంత ఆనందంగా చూసారో ! అప్పుడు ఆమె నా తల్లి స్థానంలో ఉండి మా వారిని చూసారు. అప్పుడు ఆమె నాతో ఒక గంటసేపు ఏకాంతంగా మాట్లాడారు. పావని పెండ్లి ఎలా చేసాము – అప్పటి విషయాలన్నీ నాతో ముచ్చటించారు. అప్పుడు ఆమె క్షమయా ధరిత్రీ అని చెప్పగలను.
అది ఏ సంవత్సరమో గుర్తులేదు కానీ మాష్టారు కుటుంబం అంతా కలిసి విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న శిష్యులను పిలిచి, బట్టలు పెట్టారు. అప్పుడు నాతో పాటు మా శ్రీవారిని పిలిచి మరీ బట్టలు పెట్టారు. ఇది ఆ దంపతులకు నాపై ఉండే ప్రేమ. వాళ్ళింటికి ఏ విద్యార్థి వెళ్ళినా ఏదో ఒకటి పెట్టి పంపేవారు. “ఏమోయ్” అనే ఆమె సంబోధనను మర్చిపోలేను. ఆమె మాతోపాటు అక్కడ అమ్మ చేతుల మీదుగా జరిగే వివాహ వేడుకల్లో పాల్గొని మా ప్రక్కనే ఒక మిత్రురాలులాగ కూర్చొని మాలాగ చేసే చిలిపి అల్లరి, హస్య చతురతను ఎలా మర్చిపోగలను? లక్ష్మీ కళతో చిరునవ్వుతో ఉండే ఆమె మోమును ఎలా మరువగలము ?
1982 లో మా అమ్మ చనిపోయిన తర్వాత తరచుగా ‘అమ్మ’ దగ్గరకు వెళ్లే దాన్ని. అప్పుడు ప్రతిసారి. నన్ను ఇంటికి పిలిచి నా కష్టాలు తెలుసుకుని మాష్టారి మాటగా నన్ను త్వరగా వివాహం చేసుకోమని చెప్పేవారు. నన్ను ఒక కూతురిలా చూసేవారు. నా కష్టాలలో కొండంత ధైర్యాన్ని యిచ్చేవారు.
జపాన్ నుండి మాష్టారు రాగానే ఆ దంపతులిద్దరినీ కళ్ళారా చూడాలనే నా కోరిక తీరలేదు.. ‘అందరికీ సంగతే’ అని అమ్మ చెప్పినట్లు ఆమె సుగతిని పొందారు. మా గురువుగారి కుటుంబానికి ముఖ్యంగా మా గురువుగారైన శ్రీ విరాల రామచంద్రమూర్తి గారికి అమ్మ కొండంత ధైర్యాన్ని ప్రసాదించాలని అమ్మనే ప్రార్థిస్తున్నాను.