అమ్మయె కాగితము కలము
అమ్మయె అక్షరము సుమ్ము;
అమ్మయె స్ఫురణం
బమ్మయె శబ్దార్థములగు
అమ్మయె పద్యము రచించు
ఆనందముగా.
అమ్మయె యతియున్ ప్రాసయు
అమ్మయె ఛందస్సు గణము
లమ్మయె కాదా?
అమ్మయె ఉపమోత్ప్రేక్షలు
అమ్మయె ఇది నిర్వహింప
అలసట గలదే?
అమ్మయె ధారా శుద్దియు
అమ్మయె వ్యాకరణ మగును
అమ్మయె గుణమౌ
అమ్మయె శైలియు రీతియు
అమ్మయె లయ తీర్చి పద్య
మాకృతి గొనదే?
అమ్మయె కర్తయు భోక్తయు
అమ్మయె వక్తయును శ్రోత
అన్ని సభలలో
అమ్మయె కవియును పఠితయు
అమ్మకై మన రచనలన్ని
అంకితము కదా!
అమ్మను గుండెలో నిలిపి
అచ్చపు భక్తియె అక్షరమ్ములై
కమ్మని పద్యముల్ పలికి
కాంక్షలు తీరగ పూజ సేయగా
నమ్మిక గాఢమై అనుదినంబును
పొంగెడు అమ్మభావనల్
తెమ్మెర లౌచు వీచి కడు
తీయని తావులు కుమ్మరింపవే!