1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కృపాపయోనిధి-అమ్మ

కృపాపయోనిధి-అమ్మ

Dr. Kaladhar Raju
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : March
Issue Number : 8
Year : 2022

అమ్మతో మాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. వాటిలో ఒకటి రెండు ప్రస్తావిస్తాను.. 1976-77 ప్రాంతంలో నా శ్రీమతి సుభాషిణీ దేవి అనారోగ్యంతో బాధపడుతూ ఒక సంవత్సరం పాటు హైదరాబాదులోని పెద్ద ఆసుపత్రులన్నీ తిరిగినా ఫలితం దక్కలేదు. అప్పుడు మా మామ డాక్టర్ రాఘవ రాజు గారు (ప్రస్తుత నిత్యాన్న వితరణ శాశ్వత సభ్యులు) ఒకసారి జిల్లెళ్లమూడి తీసుకు వెళ్ళమని సలహా ఇచ్చారు. అప్పటికి సుమారు రెండు మాసాలుగా తిండి లేదు. ఏమైనా తింటే కడుపులో నొప్పితో పాటుగా విపరీతంగా త్రేన్పులు వచ్చేవి. ఒక్క ఇడ్లీ తిన్నా అదే పరిస్థితి. పూర్తిగా బలహీనమైపోయి ప్రయాణం చేసే స్థితిలో కూడా లేదు. అయినా ప్రయత్నం చేద్దామని జిల్లెళ్లమూడి బయలుదేరి ఆ సాయంత్రం ఆరు ఏడు గంటలు మధ్యలో చేరుకున్నాము. రామకృష్ణ అన్నయ్యగారు కలిసి మమ్మల్ని పైకి అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మ పైన గదిలో పడుకొని ఉన్నారు. మేము ఆ గది గడప దాటి లోపలికి వెళ్ళగానే విచిత్రమేమిటంటే మా శ్రీమతి ఎలా త్రేనుపులు తీసేదో అమ్మ అలా త్రేన్పులు తీయడం ప్రారంభించింది. వెళ్లి మా శ్రీమతి అమ్మ తల వైపు కూర్చుంది. అంతలోనే ఎవరో ఒక స్వీట్ షాపు ప్రారంభించినామని ఒక బాక్స్ లో స్వీట్స్ తెచ్చి అమ్మకి ఇచ్చారు. అందులోంచి ఒక లడ్డు తీసి అలా వెనక కూర్చున్న మా శ్రీమతికి ఇచ్చి తినమన్నారు. అప్పుడు ఒక సందేహం. తింటే పడుతుందో పడదో మళ్లీ నొప్పి వచ్చి బాధపడాల్సి వస్తుందో ఏమో అని అనుమానంతో కాస్త వెనక ముందు ఆడి ఎలాగైనా అమ్మ ఇచ్చింది కదా అని మా శ్రీమతి ఆ లడ్డు తిన్నది. ఆ కాసేపటికి అమ్మ “భోజనం చేయండి తర్వాత మాట్లాడొచ్చు” అన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి- సుమారు రెండు మూడు నెలలుగా అన్నమంటే ముట్టని మా శ్రీమతి అన్నపూర్ణాలయంలో పచ్చడి చారుతో భోజనం చేసింది. చాలా రోజుల తర్వాత ఆ రాత్రి జిల్లెళ్లమూడిలో నిద్రపోయింది.

తెల్లవారి అమ్మ దర్శనానికి వెళ్లి అమ్మ దగ్గర కూర్చుని తన బాధనంతా వివరిస్తూ నాకు ప్రతి రోజూ భయం వేస్తుంది అమ్మా! ప్రతి రాత్రి సరిగ్గా 12 గంటలకు మెలకువ వస్తుంది, ఎవరో ఒక నల్లటి ఆకారం నాకు కనపడుతుంది, విపరీతమైన భయం వేస్తుంది- అని చెబుతుండగా “ఈసారి భయం వేస్తే నన్ను తలుచుకో” అని చెప్పి మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పింది. ఆరోజు అక్కడి నుంచి అన్నం తినటం ప్రారంభించింది. ఆ రాత్రికి అక్కడే పడుకున్నాం.

మా ఊరి గుడిలో పూజ చేసే పూజారి గారికి మా ఇంట్లో ఉండటానికి రెండు గదులు ఇచ్చాము. వారు కుటుంబంతో సహా ఉంటారు. పూజారి గారి భార్యకు ఆ రాత్రి కలలో ఒక రెండు నల్లని పెద్ద ఆకారాలు వచ్చినట్టు వాటిని అమ్మ ఇంట్లో నుంచి వెళ్లగొడుతున్నట్టు కనిపించింది అని మేము ఇల్లు చేరగానే చెప్పారు. అప్పుడు అనిపించింది – అమ్మ మాపై ఎంత కరుణ కురిపించిందో అని. మళ్లీ వారం రోజుల తర్వాత మా శ్రీమతికి మళ్లీ అదే మధ్య రాత్రి 12 గంటలకు నల్లని ఆకారం వచ్చి పక్కన నిలబడి నీ మీదికి రావాలా మీ ఆయన మీదికి పోవాలా అని అడిగిందట ఆ వెంటనే మా ఇద్దరి దగ్గరికి వద్దు అని పక్కన గోడ కున్న జిల్లెళ్ళమూడి అమ్మ పెద్ద ఫోటో చూపి ఆ ఫోటోలకు వెళ్లమని చెప్పగా ఆ ఆకారం నేను అక్కడికి వెళ్లను అని ఇంటి నుంచి వెళ్ళిపోయిందట.

ఆ తర్వాత సుమారు రెండు మూడు నెలల తర్వాత మళ్లీ అమ్మ దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకునే సమయములో మా శ్రీమతిని చూడగానే భయం పోయిందా అని అడిగింది. అంటే మేము అంత గుర్తున్నామా అని సంబరపడిపోయాం…

మరొకసారి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడిన తర్వాత అమ్మ మళ్ళీ వచ్చినప్పుడు పాదపూజ చేసుకుంటాము అని అన్నాం. అప్పటిదాకా ఎందుకు నాన్నా ఇప్పుడే చేసుకోండి అని అన్నారు అమ్మ. లేదమ్మా మేము అలా అనుకోలేదు మళ్ళీ వచ్చినప్పుడు చేసుకుంటాము అన్నాము… అక్కర్లేదు నాన్నా ఇప్పుడే చేసుకోండి అన్నారు. సరే అని వెంటనే పూలు వగైరా తెప్పించి పాద పూజ చేసుకుని సంతోషపడ్డాం…. ఆ తర్వాత కొద్ది రోజులకే అమ్మ శరీరత్యాగం చేశారు. అప్పుడు అర్థమైంది అమ్మ అప్పుడే పూజ చేసుకోండి అన్నమాట లోని అంతరార్థం.. మరొక సంఘటన మమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయం. మా మనవరాలు విశ్వసాహితీ మే 5వ తేదీన జన్మించింది. అది అమ్మ కళ్యాణోత్సవం రోజు. ఒకసారి మా మనవరాలు జిల్లెళ్లమూడి వెళదాం నా పుట్టినరోజు అక్కడ చేసుకుంటానని పట్టు పట్టింది. పది పదిహేను రోజులుగా మమ్మల్ని సతాయిస్తూ ఉంటే ఎండలు విపరీతంగా ఉండి ఈ ఎండల్లో ప్రయాణం వద్దు అని మేము ఎంత చెప్పినా వినకుండా వెళదామని పట్టు పట్టింది. ఈ పది రోజులుగా వద్దు అన్న నేను 4వ తేదీ రాత్రికి రాత్రి సరే అన్నాను. మా ఇంటిలో పిల్లల ఆనందానికి అవధులు లేవు. మేము ఉదయం బయలుదేరి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి ఆకాశం నిండా మబ్బులు. పూర్తి వాతావరణం మారిపోయి చల్లదనంగా అయిపోయింది. రైలు ఎక్కాము విపరీతమైన జనం – సీట్లు లేవు అందరమూ నిలబడ్డాం.

కాసేపటి తర్వాత మా బోగీలోకి ఒక టికెట్ కలెక్టర్ వచ్చి చెక్ చేస్తున్నాడు. నాకు కొంత దూరంలో ఉన్నాడు నేను ఆయన్ని చూస్తున్నాను ఆయన నన్ను చూస్తున్నాడు. సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయేమో అని అడుగు దామనుకున్నాను. కానీ అంత జనంలో మాకు సీట్లు మాత్రం ఎలా ఇస్తారు వారిని అడగటం ఎందుకని నేను అలా చూస్తూ ఉండిపోయాను. 10 నిమిషాల తర్వాత అతను దగ్గరకు వచ్చి ఏమి అలా చూస్తున్నావ్ నావైపు ? ఏమైనా సీట్లు కావాలా అన్నాడు. అవును సార్ మేము ఎక్స్ట్రా చార్జ్ ఎంతైనా ఇస్తాము ఒక 5 సీట్లు ఇవ్వగలరా అని అడిగాను. దానికి సరే వెంటనే సీట్ అరేంజ్ చేసి ఇచ్చాడు, డబ్బులు ఇవ్వపోతే తర్వాత తీసుకుంటాలే అన్నాడు. మరొక ఐదు పది నిమిషాల్లో నేను రెండుసార్లు అతనితో సార్ డబ్బులు తీసుకోండి అని అడగ్గా తర్వాత తీసుకుంటాలే అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ టికెట్ కలెక్టర్ బాపట్ల వచ్చే వరకు కనపడలేదు. ట్రైన్ దిగిన తర్వాత మేము అనుకున్నాం అమ్మే పంపించి సీట్లు ఇప్పించిందేమో లేకుంటే ఎంత ఇబ్బంది పడే వాళ్ళమో. ఇలా ఎన్నో మరువరాని మర్చిపోలేని సంఘటనలు అమ్మతో మా అనుభవాలు. నేను మొదటిసారి అమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అర్థచంద్రాకారంలో బొట్టు పెట్టింది నాకు. ఇప్పటికీ అమ్మ గుర్తుగా నేను అదే అర్థచంద్రాకారం బొట్టు పెట్టుకుంటాను….

అప్పటినుండి ఇప్పటికీ జిల్లెళ్ళమూడి వస్తూనే ఉంటాం. తల్లిగారింటికి వచ్చిన సంతృప్తి కలుగుతుంది. ఇప్పటికీ మాకు బట్టలు పెట్టి పంపడం అమ్మ ఆశీర్వాద బలంగా భావిస్తుంటాం….

సదా అమ్మ ఆశీస్సులు అర్ధిస్తూ…..

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!