‘అమ్మ’ బిడ్డలతో అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన వారు ఎందరున్నా కీ.శే. కేశవశర్మగారి స్థానం అద్భుతమైనది. అకుంఠిత కార్యదీక్ష కలిగినవారు. జగజ్జనని మంత్రోపాసకులు. సంస్థ విషయములో అహోరాత్రులు శ్రమించిన వారు నాలాంటివారికి చక్కటి సలహాలను ఇచ్చినవారు. మరణ సమయములో కూడా చెప్పిన మాటను నిలబెట్టుకున్నవారు శ్రీ కేశవశర్మగారు.
ఈ విషయంగూర్చి ప్రత్యేకంగా నలుగురికి తెలియాలి కాబట్టి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. కేశవశర్మగారితో నా పరిచయం కొద్దిపాటి మాత్రమే. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు మరల జిల్లెళ్ళమూడిని దర్శించాలని సంస్థ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనాలని ఆశించే వాళ్ళలో నేనూ ఒకడిని. నా ప్రయత్నాలను చూసిన కేశవన్నయ్య చక్కటి సలహాలను ఇచ్చేవారు. మాతృశ్రీ కళాశాల అంటున్నాను. పూర్వ విద్యార్థి సంఘం స్థాపించమని ముందుగా జిల్లాల వారిగా, పిమ్మట సెంట్రలైజ్డ్ గా స్థాపించమని సలహా ఇచ్చారు. దాని గూర్చి ప్రయత్నాలు జరుగుతున్నాయి,
అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా పలుచోట్ల అమ్మ ప్రసాదం పంచబడింది. సామూహికంగా అమ్మకు పూజలు చేయడం జరిగింది. ‘అనసూయేశ్వర’ ట్రస్టు తరపున అన్నయ్య కూడా ఒక కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రూ.5,000/-లు పంపటం జరిగింది. ఇక్కడ మేము చేసిన కార్యక్రమాలను విని మమ్మల్ని ఎంతో అభినందించారు.
ఈ కార్యక్రమాలు అన్నీ అయిన పిమ్మట అన్నయ్య నాకు ఒక ఉత్తరం వ్రాశారు. ‘అమ్మ’ జీవితంలో అనేకమైన ముఖ్య సంఘటనలు బుధవారం నాడు జరిగాయి. నీకు అవకాశం ఉంటే ‘అమ్మ’ ప్రసాదంగా ఆ రోజున పెట్టగలరు. అనసూయేశ్వర ట్రస్టు తరపున రూ.1000/- పంపుతానని చెప్పారు. పోయిన సంవత్సరం మే 5న ‘అమ్మ’ కళ్యాణంరోజు మరల జ్ఞాపకం చేశారు. తప్పక చేస్తాను అని చెప్పిన నేను మా గృహప్రవేశం బుధవారం జరగడం, ఆ రోజు విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం వద్ద పరిషత్ ప్రెసిడెంట్ శ్రీరామబ్రహ్మం అన్నయ్య గారి ద్వారా అమ్మ ప్రసాదం పంచడం జరిగింది. అదే సమయంలో కేశవ అన్నయ్య అస్వస్థతకు గురి అయ్యారని తెలిసి బాధపడ్డాను. అయితే అన్నయ్య హాస్పిటల్లో అక్కయ్యగారికి నా గురించి చెప్పి ట్రస్టు తరపున రూ.1,000/- ఇవ్వవలసిందిగా చెప్పారని ఈ విషయం కుసుమక్కయ్య గారు తెలిపితే నేను చాలా ఆశ్చరపోయాను. ఈ విధంగా దైవకార్యము చేయాలనే తపన మరణసమయంలో కూడా ఎంతమందికి గుర్తు ఉంటుంది. అందుకే నేను “కేశవం” స్మరామి
16.3.2011 ఏకాదశి బుధవారం మాకు దగ్గరలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన తీర్థం తాటిపూడిలో జరుగనున్నది. ఈ విషయాన్ని కేశవశర్మ అన్నయ్య గారింట్లో చెప్పగానే వారు నన్ను పిలిచి రూ.1000/-లు ఇచ్చి అమ్మ ప్రసాదాన్ని పంచమన్నారు. మేము కూడా స్థానికంగా ఉన్న షిరిడీసాయి సేవాసమితి సభ్యులు, గోస్తనీ కేంటిన్, యస్.యస్.యస్. ఫోటోస్టూడియో, ఎ.పి.ఆర్. జూనియర్ కాలేజి మరియు స్కూలు వారి సహాయంతో జాతరలో 2,000 మందికి పైగా అమ్మ ప్రసాదం పంచడం జరిగింది. క్రిందట నెల పత్రికలో మేము చేసిన కార్యక్రమాలను చూచి ఆ ప్రేరణతో ముదిగల్లు గ్రామ అమ్మ బిడ్డలు శ్రీ చౌడేశ్వరిదేవి జాతరలో ప్రసాదం పంచారని తెలిసి చాలా సంతోషించాము. మాకు కేశవశర్మ ప్రేరణ కాగా మా కార్యక్రమాలు మరొకరికి ప్రేరణ కావడం ‘అమ్మదయ.